
Star Heroes Comedy Genre: ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఏ ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలు తీయాలి అనుకుంటారు మేకర్స్. టిల్లుకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసింది కామెడీ. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించింది కూడా కామెడీనే. దీనిని బట్టి అర్ధమయ్యింది ఏంటంటే.. కామెడీతో మెప్పిస్తే.. ధియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అందుకనే.. చిరు, రవితేజ, ప్రభాస్ కూడా ఇదే రూటులో వెళుతూ కామెడీ సినిమాలు చేస్తున్నారు. ఇంతకీ వీళ్లు చేస్తున్న కామెడీ చిత్రాలు ఏంటి..? మరి.. వెంకీకి కలిసొచ్చింది.. చిరు, రవితేజ, ప్రభాస్ కి కలిసొచ్చేనా..?
కామెడీని ఎలా పండించాలి..? ఏ సీన్ లో ఎంత మోతుదులో కామెడీ ఉండాలి..? ఇలా పర్ పెక్ట్ అనేలా కామెడీని అందించడంలో దిట్ట అనిల్ రావిపూడి. అందుకనే అనిల్ తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక చిరు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో చిరు, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా వస్తుందంటే.. థియేటర్ లో నవ్వుల తుఫాన్ ఖాయం అంటున్నారు సినీ పండితులు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత వరుసగా సీరయస్ సినిమాలే చేశాడు కానీ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేయలేదు. అందుకనే ఈసారి రూటు మార్చి హర్రర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అదే.. ది రాజాసాబ్. ఈ సినిమాకి మారుతి డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ అయితే.. వేరే లెవల్లో ఉంది. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కు సైతం విపరీతంగా నచ్చేసింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించే ఈ సినిమా ఉంటుంది అన్నారు మారుతి. Star Heroes Comedy Genre
ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఫుల్ గా నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ సినిమా చకా చకా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో వింటేజ్ రవితేజను చూడబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆద్యంతం సరదా సరదాగా సాగేలా వైవిధ్యమైన కథతో కిషోర్ తిరుమల ఈ సినిమాని రూపొందిస్తున్నారట. చిరు, రవితేజ, ప్రభాస్ తో పాటు మరోసారి వెంకీ నవ్వించడానికి రెడీ అవుతున్నాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలో వెంకీతో మరోసారి నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహా కామెడీ చేయించబోతున్నారట. ఇలా ఇప్పుడు సక్సెస్ కోసం కామెడీని నమ్ముకుంటున్నారు. మరి.. వెంకీకి కలిసొచ్చింది.. చిరు, రవితేజ, ప్రభాస్ కు కూడా కలిసొస్తుందేమో చూడాలి.