బెంగళూరు తొక్కిసలాట ఘటనపై మరోసారి దుమారం..!

Bengaluru stampede Government Report: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పటికే కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికపై మరోసారి దుమారం రేగింది. నివేదికలో కోహ్లీ పేరు ఉండటంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అసలు నివేదికలో ఏముంది..? ఘటనకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఎలా సాగుతోంది..?

గత నెల జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద RCB విజయోత్సవ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటనపై పొలిటికల్ హీట్ మళ్లీ రాజుకుంది. ఈ ప్రమాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో.. దీనిపై దర్యాప్తు జరిపిన కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వం బయటకు విడుదల చేయడంతో మరోసారి దీనిపై దుమారం రేగింది. తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంతోషంలో లక్షలాది అభిమానులు స్టేడియం వద్ద గుమిగూడారు. విధానసౌధ నుంచి స్టేడియం వరకు విజయ పరేడ్ జరగనుందని ఆర్సీబీ సోషల్ మీడియాలో ప్రకటించడంతో, 2-3 లక్షల మంది అభిమానులు రోడ్లపై తండోపతండంగా గుమిగూడారు. కానీ, స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మాత్రమే ఉండటంతో.. అంతమంది వచ్చే సరికి తొక్కిసలాట జరిగింది. పలువురు మరణించడం, చాలా మంది గాయపడటంతో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. Bengaluru stampede Government Report.

హైకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక తొక్కిసలాట ఘటనపై నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రమాద ఘటనకు ఆర్సీబీనే కారణం అని చెప్పబడింది. ఆర్సీబీ జూన్ 3న పోలీసులకు పరేడ్ గురించి సమాచారం ఇచ్చినప్పటికీ, అధికారిక అనుమతి కోసం నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తు చేయలేదని నివేదిక తెలిపింది. జూన్ 4 ఉదయం ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా ర్యాలీకి ఉచిత ప్రవేశం ఉంటుందని ప్రకటించింది. ఆ తర్వాత ఓ వీడియోను కూడా ఆర్సీబీ విడుదల చేసింది. అందులో విరాట్ కోహ్లీ వీడియోలో అభిమానులను జోష్‌తో రమ్మని పిలుపిచ్చారు. ఆ తర్వాత కార్యక్రమానికి రావాలంటే పాస్‌లు అవసరమని ఆర్సీబీ ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం, అనుమతి లేకపోవడం, భద్రతా ఏర్పాట్ల లోపం వల్ల తొక్కిసలాట జరిగినట్లు నివేదిక తేల్చింది.

ఆర్సీబీ సోషల్ మీడియా ప్రకటనల వల్ల ఏర్పడిన గందరగోళం, జనాలు ఎక్కువగా రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిందని నివేదికలో తెలిపారు. స్టేడియం గేట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు సంక్రమంగా లేకపోవడం, అంబులెన్స్‌లు సకాలంలో చేరుకోలేకపోవడం వల్ల కూడా మృతుల సంఖ్య పెరగిందని నివేదిక పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచే అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్ద గుమిగూడారు. విధానసౌధ నుంచి స్టేడియం వరకు పరేడ్ రద్దు చేసినట్లు పోలీసులు ప్రకటించినప్పటికీ, ఆర్సీబీ సోషల్ మీడియా పోస్ట్‌లు ఆగలేదు. కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద యువత రోడ్డుపై డ్యాన్సులు చేయడం, గేట్లను బద్దలు కొట్టడం, బ్యారికేడ్‌లను దాటడంతో గందరగోళం తీవ్రమైంది. ఫలితంగా, మహిళలు, యువకులు తొక్కిసలాటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

ప్రమద ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని మాజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అదనంగా, రిటైర్డ్ హైకోర్టు జడ్జి జాన్ మైఖేల్ డి’కున్హా నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ జూలై 11న విధానసౌధలో నివేదిక సమర్పించింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానందతో సహా ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సిబ్బంది ముగ్గురిని అరెస్టు చేశారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. తర్వాత హైకోర్టు ఈ నివేదికను బహిరంగంగా ప్రకటించాలని ఆదేశించడంతో ప్రభుత్వం విడుదల చేసింది. అయితే నివేదికలో విరాట్ కోహ్లీ పేరు ఉండటం ఇప్పుడు అగ్గి రాజేసింది.

కర్ణాటక ప్రభుత్వ నివేదికలో విరాట్ కోహ్లీ వీడియోను ప్రముఖంగా ప్రస్తావించారు. దీనిలో కోహ్లీ అభిమానులను విజయోత్సవానికి రావాలని పిలుపునిచ్చాడు. ఈ వీడియో భారీ జనసమూహాన్ని ఆకర్షించడానికి కారణమైందని నివేదిక తెలిపింది. బీజేపీ ఈ అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఈ ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆర్సీబీని నిందించడం ద్వారా ప్రభుత్వం తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటోందని బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రా ఆరోపించారు. ఈ ఘటనను తెలంగాణలో అల్లు అర్జున్ కేసుతో పోల్చి, సిద్ధరామయ్య, శివకుమార్‌లను అరెస్టు చేయాలని కోరారు. పోలీసులు, హోం డిపార్ట్‌మెంట్ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని, ప్రభుత్వం ప్రచారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని బీజేపీ నాయకుడు బీవై విజయేంద్ర అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ విమర్శలను తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించినది కాదని, ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లు ఈవెంట్‌ను ప్లాన్ చేశాయని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం సహకరించిందని, పోలీసు భద్రత కల్పించిందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ ఈ ఘటనను రాజకీయం చేస్తోందని, మృతుల కుటుంబాల ఎమోషన్ ను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కుంభమేళాలో 50-60 మంది మరణించినప్పుడు తాము రాజకీయం చేయలేదని సిద్ధరామయ్య ప్రస్తావించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం, గాయపడినవారికి ఉచిత చికిత్స అందిస్తామని తెలిపిందన్నారు.

ఈ ఘటనలో ఆర్సీబీ, ప్రభుత్వం రెండూ బాధ్యత వహించాలని విశ్లేషకులు అంటున్నారు. ఆర్సీబీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పరేడ్ ప్రకటనలు చేసి, అభిమానులను ఆహ్వానించడం గందరగోళానికి కారణమైంది. మరోవైపు, ప్రభుత్వం భారీ జనసమూహాన్ని అంచనా వేయడంలో విఫలమైందని, సరైన భద్రతా ఏర్పాట్లు, అంబులెన్స్ సౌకర్యాలు లేకపోవడం ఘటన తీవ్రతను పెంచిందని విమర్శలు వచ్చాయి. బీసీసీఐ కూడా ఈ ఈవెంట్‌లో తమకు సంబంధం లేదని, స్థానిక లోపాల వల్ల ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఆర్సీబీ మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, గాయపడినవారికి RCB కేర్స్ ఫండ్ ద్వారా సహాయం ప్రకటించింది.