భారత్ కా షేర్ ఏకే 203..!

AK 203 Kalashnikov: భారత్ ఇటీవల స్వదేశీ ఆధునిక ఆయుధాల తయారీపై గట్టి దృష్టి పెట్టింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ రక్షణ బలోపేతం కోసం సరికొత్త ఆయుధాలు తయారు చేస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న ఆయుధాలను అప్ గ్రేడ్ చేస్తోంది. అయితే ఈ అత్యాధునిక ఆయుధాల అభివృద్ధి ఎందుకు ముఖ్యమైంది? లడాఖ్‌లో భారత్ ప్రయోగించిన ఆకాశ్ ప్రైమ్ పరీక్ష ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ కు చెక్కలు చూపించింది. దీని అప్ గ్రేడ్ వర్షన్ ఎలా ఉండనుంది? బాలాసోర్‌లో పృథ్వి, అగ్ని క్షిపణులు, కొత్త ఏకే-203 రైఫిల్ భారత సైన్యానికి ఎలాంటి బలాన్ని అందించనున్నాయి?

ఆపరేషన్ సిందూర్ .. భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ ఆపరేషన్‌లో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ ఉపయోగించిన చైనా తయారీ డ్రోన్‌లను, టర్కీ తయారీ లాయిటరింగ్ మ్యూనిషన్‌లను విజయవంతంగా నాశనం చేసింది. ఈ ఘర్షణల తర్వాత భారత్‌ కు స్వదేశీ ఆయుధాల ప్రాముఖ్యత ఎంతో అర్థమైంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, డ్రోన్ దాడులు, సైబర్ భద్రతలో మెరుగుదల అవసరం, స్టెల్త్ ఫైటర్ జెట్‌ల అవసరం ఎంతో తెలిసేలా చేసింది. దీంతో, భారత్ మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేసింది, విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎంతో ఉపయోగపడింది. తాజాగా లడాఖ్‌లో 4,500 మీటర్ల ఎత్తులో ఆకాశ్ ప్రైమ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది. ఈ పరీక్షలో రెండు వేగంగా ప్రయాణిస్తోన్న డ్రోన్లను ఈ క్షిపణి ఖచ్చితంగా నాశనం చేసింది. ఆకాశ్ ప్రైమ్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్, డీఆర్‌డీఓ రూపొందించింది. ఈ పరీక్ష లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమీపంలో జరగడం చైనాకు ఒక గట్టి మెసేజ్ ఇచ్చింది. ఈ పరీక్షను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం, డీఆర్‌డీఓ అధికారులు పరిశీలించారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ విజయాన్ని గొప్ప విజయంగా అభినందించారు. AK 203 Kalashnikov.

ఆకాశ్ ప్రైమ్ ఒక మధ్య-శ్రేణి ఉపరితలం-నుంచి-ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ, ఇది ఫైటర్ జెట్‌లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగలదు. 4,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో, చల్లని వాతావరణంలో పనిచేయగలదు. స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌తో లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేస్తుంది. 30 నుంచి 60 కి.మీ. పరిధిలో, 18,000 మీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను చేరుకోగలదు. ట్యాంకులు, ట్రక్కులపై నుంచి ఉపయోగించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకేసారి అనేక లక్ష్యాలను నాశనం చేయగలదు, రాజేంద్ర రాడార్ సహాయంతో 100 కి.మీ. దూరంలో 40 లక్ష్యాలను గుర్తించగలదు.
ఆకాశ్ ప్రైమ్ ఆర్మీ మూడవ, నాల్గవ ఆకాశ్ రెజిమెంట్లలో చేర్చనున్నారు, సరిహద్దు రక్షణను బలోపేతం చేస్తుంది.

ఓ పక్క డిఫెన్స్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తూనే అటాక్ చేసే క్షిపణులను కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. ఒడిశాలోని చందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పృథ్వి-2, అగ్ని-1 క్షిపణులను స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ విజయవంతంగా పరీక్షించింది. పృథ్వి-2, ఈ షార్ట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 350 కి.మీ. పరిధి కలిగి, 500 కేజీల అణు వార్ హెడ్ లను మోసుకెళ్లగలదు. ఇది లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో, అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను తాకగలదు. అలాగే అగ్ని-1 700 నుంచి 900 కి.మీ. పరిధి కలిగిన ఈ మధ్య-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి 1,000 కేజీల అణువార్ హెడ్ మోసుకెళ్లగలదు. మెరుగైన గైడెన్స్ సిస్టమ్‌తో ఖచ్చితమైన దాడులు చేయగలదు.

ఓ వైపు క్షిపణులు, డిఫెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు సైనికులకు అవసరమైన రిఫైల్స్ అప్ర గ్రేడేషన్ పై కూడా భారత్ దృష్టి పెట్టింది. కొత్తగా ఏకే-203 రైఫిల్ భారత్-రష్యా జాయింట్ వెంచర్ ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తయారు చేస్తున్నారు. ఈ ఆధునిక యుద్ధ అవసరాలకు తగినట్లు రూపొందించబడింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఏకే 47 కంటే ఇది ఎన్నో రెండ్లు మెరుగైంది. 300-400 మీటర్ల దూరంలో లక్ష్యాలను ఖచ్చితంగా తాకగలదు. తేలికైన డిజైన్, సులభంగా మోసుకెళ్లే సామర్థ్యం దీని ప్రత్యేకత. నైట్ విజన్, గ్రెనేడ్ లాంచర్‌లను అనుసంధానించే సౌకర్యం ఈ కొత్త ఏకే-203లో ఉంది. 2024లో ఇప్పటికే 48,000 ఏకే-203 రైఫిల్స్ భారత సైన్యానికి అందించారు. మరో 70,000 రైఫిల్స్ త్వరలో అందిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఈ పరీక్షలు భారత సైనిక శక్తిని, స్వదేశీ సాంకేతికతను ప్రపంచానికి చాటాయి. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, డీఆర్‌డీఓ చైర్మన్ సమీర్ వి. కమత్ ఈ విజయాలను అభినందించారు, ఇవి దేశ రక్షణ సంసిద్ధతకు గొప్ప ఊతమని పేర్కొన్నారు. ఈ పరీక్షలు చైనా, పాకిస్థాన్‌లకు భారత రక్షణ సామర్థ్యాలను స్పష్టమైన సందేశంగా పంపాయి. అలాగే, ఫ్రాన్స్‌తో స్టెల్త్ ఫైటర్ జెట్‌ల తయారీకి సంబంధించిన చర్చలు కూడా స్వదేశీ సాంకేతికతను మరింత బలోపేతం చేసే దిశగా ఉన్నాయి.

ఆకాశ్-ఎన్‌జీ వంటి మరిన్ని అప్‌గ్రేడెడ్ క్షిపణుల అభివృద్ధి, స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి భవిష్యత్ యుద్ధ అవసరాలకు సన్నద్ధతను చూపిస్తోంది. ఏకే-203 రైఫిల్స్ త్వరలో పూర్తిగా సైన్యానికి అందించనున్నారు. ఈ కొత్త ఆయుధాలు, రైఫిల్స్ భారత్‌ను సైనిక, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి దోహదపడతాయి. ఆపరేషన్ సిందూర్ లాంటి ఘటనలు భారత్ స్వదేశీ ఆయుధాల అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి, దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాయి.

Also Read: https://www.mega9tv.com/national/series-of-bomb-threats-in-the-country-threat-mails-to-mumbai-delhi-bengaluru-police-conclude-that-they-were-fake-calls/