పాకిస్థాన్‎కు అమెరికా షాక్..?!

US declares TRF as international terrorist organization: జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన దారుణమైన ఉగ్రదాడి భారత్‌లోనే కాక, అంతర్జాతీయ సమాజంలో కూడా కలకలం సృష్టించింది. ఈ దాడికి బాధ్యత వహించిన TRFను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక భారత్ దౌత్య చర్చలు ఎలా పనిచేశాయి? TRFకు లష్కర్-ఎ-తోయిబాతో సంబంధం ఏమిటి? గతంలో పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలపై అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పాకిస్థాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది?

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో TRFను ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించారు. ఈ ప్రకటన వల్ల TRFకు ఆర్థిక సహాయం, సహకారం అందించడం అమెరికా చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. దీని ద్వారా ఇక టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థకు ఆర్థిక సహకారం అందకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా ఇది పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా చెప్పబడుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కు గట్టి హెచ్చరికగ భావింవచ్చు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఎంతో మంది పర్యాటకులు మరణించారు. పురుషులను వేరుచేసి, వారి మతాన్ని అడిగి కాల్చి చంపారు. ఈ దాడి 2008 ముంబై దాడుల తర్వాత భారత్‌లో సామాన్య పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడిగా పరిగణించబడింది. ఈ ఘటన భారత్-పాకిస్థాన్ సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టి దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అలాగే ప్రపంచ దేశాలకు ప్రతినిధులను పంపి.. ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ తీరును ఎండగట్టింది.

అమెరికా ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ -TRF అనేది 2019లో భారత్ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ పాకిస్థాన్ ఆధారిత లష్కర్-ఎ-తోయిబా కు ఒక శాఖగా పనిచేస్తుందని భారత్, అమెరికా ఆరోపిస్తున్నాయి. లష్కర్-ఎ-తోయిబా అనేది 1980లలో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఒసామా బిన్ లాడెన్ ఆర్థిక సహాయంతో స్థాపితమై, 2008 ముంబై దాడులకు బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ. TRF, LeT, హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి క్యాడర్‌లను సేకరించి, కాశ్మీర్‌లో హిందూ మైనారిటీలు, వలసదారులపై దాడులు చేస్తోంది. పెహల్గాం దాడికి TRF మొదట బాధ్యత వహించి, టెలిగ్రామ్‌లో ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. భారత జాతీయ దర్యాప్తు సంస్థ TRF చీఫ్ షేక్ సజ్జాద్ గుల్‌ను ఈ దాడి మాస్టర్‌మైండ్‌గా గుర్తించింది. US declares TRF as international terrorist organization.

పెహల్గాం దాడి తర్వాత టీఆర్ఎఫ్ ను ఉగ్రసంస్థగా ప్రకటించడానికి భారత్ దౌత్య చర్యలు చేపట్టింది. భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్, LeT స్థావరాలు ధ్వంసమయ్యాయి, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌తో పాటు, భారత్ 33 దేశాలలో 7 దౌత్య బృందాలను పంపి, పెహల్గాం దాడి తీవ్రతను, పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందనే వాదనను అంతర్జాతీయంగా హైలైట్ చేసింది. భారత్ ఈ దాడిని UNలో లేవనెత్తినప్పుడు, పాకిస్థాన్, చైనా మద్దతుతో TRF ప్రస్తావనను UNSC స్టేట్‌మెంట్‌లో చేర్చకుండా అడ్డుకుంది. అయినప్పటికీ, భారత్ దౌత్య ఒత్తిడి, జైశంకర్ అమెరికా పర్యటన తర్వాత, అమెరికా TRFను FTOగా ప్రకటించడానికి కారణమైంది.

TRFను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం వల్ల ఈ సంస్థకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, లాజిస్టిక్స్ అందించడం అమెరికా చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఇది TRF ఆర్థిక, ఆపరేషనల్ సామర్థ్యాలను బలహీనపరుస్తుంది. అంతర్జాతీయంగా TRF, LeTలకు మద్దతు ఇచ్చే వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. ఇది పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచుతుంది, ఎందుకంటే TRF, LeTలకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపిస్తోంది.

గతంలో అమెరికా LeT, జైష్-ఎ-మొహమ్మద్ , హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలను FTOలుగా ప్రకటించింది. అయినప్పటికీ, పాకిస్థాన్ ఈ సంస్థలను నిర్మూలించడంలో, ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో తగిన చర్యలు తీసుకోలేదని భారత్, అమెరికా, ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి. 2008 ముంబై దాడులకు మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ ఇప్పటికీ పూర్తిగా అరెస్టు చేయలేదు. పాకిస్థాన్ ISI ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపిస్తోంది. TRFను FTOగా ప్రకటించడం వల్ల పాకిస్థాన్‌పై ఆర్థిక, దౌత్య ఒత్తిడి పెరుగుతుంది, ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి సంస్థల నుంచి సహాయం అందదు.

Also Read: https://www.mega9tv.com/national/india-focuses-on-new-advanced-weapons-after-operation-sindoor-focus-on-indigenous-weapons/