యశస్వినీ రెడ్డి అత్తగారు ఝాన్సీరెడ్డి MLA రూపం..!

Palakurthy MLA Yashaswini Reddy: సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన సంతోషం కూడా లేకుండా పోయిందని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు బాధ పడుతున్నారట. పార్టీ సూచించిన అభ్యర్ధి గెలుపుకోసం శాయశక్తులా పోరాడి విజయం సాధిస్తే అసలు సంతోషమే లేకుండా పోయిందని బాధ పడుతున్నారు. ఎమ్మెల్యే కన్నా వాళ్ల అత్త పెత్తనం ఎక్కువైందని సగటు కార్యకర్త మదన పడుతున్నారట.ఇంతకీ ఏదా నియోజకర్గం. కాంగ్రెస్ కార్యకర్తలకు తలనొప్పిగా మారిన ఆ అత్త ఎవరు. లెట్స్ వాచ్.

పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకుని స్వపక్షం లో విపక్షంలా మారిందట. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అత్తగారు ఝాన్సీరెడ్డి తీరు పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యశస్వినీ రెడ్డి గెలుపు కోసం ఎర్రబెల్లి లాంటి బలమైన నేతతో పోరాడి విజయం సాధించిన కార్యకర్తలకు ఝాన్సీరెడ్డి రూపంలో తలనొప్పి మొదలైందని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ సమస్యల కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామన్న కార్యకర్తలకు ఝాన్సీ రెడ్డి అడ్డు తగులుతున్నారట. సీనియర్ నాయకులను కూడా పట్టించుకోకుండా కొత్తగా కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సదరు కార్యకర్తలు. పార్టీ పదవుల్లో కూడా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇచ్చి సీనియర్ నేతలకు మొండి చేయి ఇచ్చారని పాలకుర్తిలో చర్చ జరుగుతోంది.

దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి కార్యక్రమాలకు పిలవకపోవడం, ఆ తర్వాత వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం గతంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ ఘటన మర్చిపోక ముందే తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మెన్ తిరుపతి రెడ్డిని పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం, తిరుపతి వర్గం నేతలను సస్పెండ్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. చెర్లపాలెంలో పార్టీ సన్నాహక సమావేశానికి తిరుపతి రెడ్డి ఆహ్నానించకపోవడం పట్ల తిరుపతి రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన టెంట్ ను ధ్వంసం చేసి కుర్చీలు విసిరేశారు. చేసేదేమీ లేక సమావేశానికి వచ్చిన ఇంచార్జీ వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్తితి నెలకొంది. ఇక చిట్టిమల్ల మహేష్, లంబాడా హక్కుల నేత బాలు నాయక్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మెరుగు మల్లేశంను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని తిరుపతి రెడ్డి వర్గం నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. Palakurthy MLA Yashaswini Reddy.

తిరుపతి రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించి, పార్టీ కార్యకలాపాలకు పిలవకపోవడాన్ని అసమ్మతి నేతలు సీరియస్ గా తీసుకున్నారట. ఝాన్సీ రెడ్డిపై నేరుగా విమర్శలు సంధించడం ఇప్పుడు పాలకుర్తి వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఝాన్సీ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను చిన్నచూపు చూస్తున్నారనీ, కావాలనే ఝాన్సీ రెడ్డి తమను పక్కన పెడుతున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. అసలు తమను పార్టీ నుంచి సస్పెండ్ చేసే హక్కు ఆమెకు ఎవరిచ్చారని మండిపడుతున్నారు. యశస్వినీ రెడ్డి గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన తిరుపతి రెడ్డిని పార్టీకి దూరం చేయడం అన్యాయమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారట.

పార్టీ అధికారంలో లేకున్నా కూడా పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం ఎర్రబెల్లి లాంటి నేతతో పోరాడి,ఎన్నో కేసులు ,సమస్యలు దాటుకొని వస్తె ఇవాళ ఝాన్సీ రెడ్డి పట్టించుకోకపోవడం సరికాదని కార్యకర్తలు అంటున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి నియోజకవర్గ ప్రజల కోసం మంచి చేయాలని ఉన్నా, ఝాన్సీ రెడ్డి తీరుతో చేయలేక పోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఇప్పటికైన ఝాన్సీ రెడ్డిని కట్టడి చేయాలని లేకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/telangana/there-is-a-buzz-of-organizational-elections-in-nizamabad-district-congress/