
18 Muslim women MPs in Lok Sabha: వారి ఓట్లు కావాలి.. కాని వారిని మాత్రం పార్లమెంట్ కు పంపరు.. వారి పేరుతో రాజకీయం చేస్తారు.. కాని రాజకీయాల్లో వారికి ప్రాతినిధ్యం లేకుండా చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం ఆందోళనకరంగా కనిష్ట స్థాయికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 18 లోక్‌సభల్లో కేవలం 18 మంది ముస్లిం మహిళలు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎన్నికల్లో ముస్లిం మహిళలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ, వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంలో రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ అన్యాయానికి కారణాలు ఏమిటి? ముస్లిం మహిళలు రాజకీయంగా ఎదగాలంటే ఏ మార్పులు అవసరం? తప్పు ఎవరిలో ఉంది..?
స్వాతంత్ర్యం వచ్చిన 77 సంవత్సరాల్లో, 18 లోక్‌సభల్లో కేవలం 18 మంది ముస్లిం మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2024 లోక్‌సభలో ముస్లిం మహిళల సంఖ్య మరింత తక్కువగా, కేవలం 2-3 మంది మాత్రమే ఉన్నారు. దేశ జనాభాలో ముస్లిములు 14% ఉన్నప్పటికీ, ముస్లిం మహిళల ప్రాతినిధ్యం 1% కంటే తక్కువగా ఉంది. రషీద్ కిద్వాయ్, అంబర్ కుమార్ ఘోష్ రాసిన మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ పుస్తకం ప్రకారం, ఈ 18 మందిలో 13 మంది రాజకీయ కుటుంబాల నుంచి రాజవంశీకుల వచ్చినవారే, సామాన్య ముస్లిం మహిళలకు అవకాశాలు దాదాపు లేవని స్పష్టమవుతోంది. 18 Muslim women MPs in Lok Sabha.
ముస్లిం మహిళలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని, కానీ వారికి ప్రాతినిధ్యం ఇవ్వడంలో విఫలమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ముస్లిం మహిళల ఓట్లు కీలకమైనవి, అయితే వారికి టికెట్లు ఇవ్వడంలో పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజవాది పార్టీ వంటి విపక్ష పార్టీలు ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో ముస్లిం మహిళల సమస్యలను ప్రస్తావిస్తాయి, కానీ 2024లో కేవలం 94 మంది ముస్లిం అభ్యర్థులలో మహిళల సంఖ్య నామమాత్రంగా ఉంది. ఇటు బీజేపీ ఒక్క ముస్లిం మహిళా అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు.
స్వాతంత్ర్యం నాటి నుంచి 2024 వరకు, 690 మంది మహిళా ఎంపీలలో కేవలం 25 మంది ముస్లిం మహిళలు ఉన్నారు. ఈ 25 మందిలో 13 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారు. వీరిలో బేగం అబిదా అహ్మద్, నూర్ బానో, మెహబూబా ముఫ్తీ వంటి వారు ప్రముఖ రాజకీయ కుటుంబాల నుంచి ఎన్నికయ్యారు. 2024లో ఎన్నికైన ముస్లిం మహిళా ఎంపీలలో ఇక్బాల్ బానో, సజ్దా అహ్మద్ ఉన్నారు. ఈ ఎంపీలు ఎక్కువగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచే గెలిచారు, సామాన్య ముస్లిం మహిళలకు అవకాశాలు దాదాపు లేవు.
ముస్లిం మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింలోని పురుష ఆధిక్య సమాజం నుంచి వ్యతిరేకత రావొచ్చనే అభిప్రాయం కూడా దీనికి కారణం కావొచ్చు. ఇక ముస్లింల్లో విద్య, ఆర్థిక స్థితి, సామాజిక ఆంక్షలు మహిళలను రాజకీయంగా ముందుకు రాకుండా అడ్డుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లో ముస్లిం ఓటర్లలో 50% మంది మహిళలు ఉన్నప్పటికీ, వారి ప్రాతినిధ్యం దాదాపు శూన్యం. ఈ ధోరణి ముస్లిం మహిళల గళాన్ని పార్లమెంటులో వినిపించకుండా అడ్డుకుంటోంది. సలోని భోగలే అధ్యయనం ప్రకారం, 1999-2017 మధ్య ముస్లిం సమస్యలపై లోక్‌సభలో అడిగిన 1,875 ప్రశ్నలలో 22% మాత్రమే ముస్లిం ఎంపీలు అడిగారు. వీటిలో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే ముస్లింల్లోనే మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని చాలా మంది అంగీకరిచడం లేదు.. ఇక మిగిలిన సమాజం ఎందుకు పట్టించుకుంటుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ముస్లిం మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు పలు సంస్కరణలు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళలకు విద్య, రాజకీయ నాయకత్వ శిక్షణ అందించడం ద్వారా వారిని సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకురావాలి. ముస్లిం సముదాయంలో మహిళలపై ఉన్న సామాజిక, సాంస్కృతిక ఆంక్షలను తొలగించడం కీలకం.
పార్టీలు ముస్లిం మహిళలకు టికెట్లు కేటాయించడంలో వంశవాద ధోరణులను విడనాడి, సామాన్య మహిళలకు అవకాశాలు కల్పించాలి. ముస్లిం మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అవసరం, తద్వారా వారు రాజకీయంగా చైతన్యం పొందగలరు. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం పెంచడం భారత ప్రజాస్వామ్యంలో సమగ్రత కోసం కీలకం. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు గళం వినిపించాలి. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు రాజకీయ, సామాజిక సంస్కరణలు అవసరం. ముస్లిం మహిళలు రాజకీయ చైతన్యం పొందాలి, వారి సమస్యలను స్వయంగా పార్లమెంటులో లేవనెత్తేలా శిక్షణ, అవకాశాలు కల్పించాలి అని అంటున్నారు.