తెలంగాణాలో స్థానిక సమరానికి ప్రధాన పార్టీలు సిధ్ధమవుతున్నాయి.!

Political battleground in united Khammam district: తెలంగాణాలో స్థానిక సమరానికి ప్రధాన పార్టీలు సిధ్ధమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ రణరంగం మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ముందుగానే ఎన్నికల పోరుకు కాలు దువ్వతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులతో పాటు టీడీపీ, జనసేన కూడా స్థానిక పోరులో దిగుతున్నాయి.

స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల హడావుడి మొదలైంది. అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అందరూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా నిర్వహించారు. దీంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఇందిర మహిళా శక్తి సంబరాలు పేరుతో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ చేస్తోంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అధ్యక్షతన జరుగుతున్న ఈ సంబరాలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార వేదికలుగా మారాయి.

ఖమ్మం జిల్లా విషయానికొస్తే, జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి వంశీచంద్ రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్చార్జీలు సమీక్షా సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికలతో కేడర్ సిద్ధం కావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో అవకాశం లేకుండా ఉండేందుకు కాంగ్రెస్ పకడ్బందీ కార్యాచరణ నిర్వహిస్తోంది. నోటిఫికేషన్ కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారు. జడ్పీటీసీలు, మండల పరిషత్, పంచాయతీ సర్పంచ్ వంటి కీలక పదవులు, మునిసిపల్ చైర్మన్ పదవులపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 21 జడ్పిటీసీ స్థానాలు, 20 ఎంపీపీలు, 283 ఎంపీటీసీలు, 571 సర్పంచులతో పాటు 5 వేల 214 వార్డులున్నాయి. దీనికి తోడు మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు, మునిసిపాలిటీ చైర్మన్ పదవులు, కౌన్సిలర్ పదవులు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ కు ఇంకా గడువు ఉండడంతో ఇప్పట్లో ఎన్నిక లుండవు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 478 పంచాయతీలు, 4 వేల 232 వార్డులున్నాయి. ఇక కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జడ్పీటీసీలు, 22 ఎంపీపీలు, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మేజర్ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాట పడుతోంది. Political battleground in united Khammam district.

ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఘోరంగా ఓడిన బీఆర్ఎస్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలతో పూర్వవైభవం కోసం ఆరాటపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇప్పటికే జిల్లాకు చెందిన నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీ చేసే వారికి పార్టీ ఎన్నికల మెటీరియల్ తో పాటు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. దీంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలు నిర్వహించి స్థానిక ఎన్నికలకు సై అంటున్నారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్తితులను అంచనా వేస్తున్న కారు పార్టీ, అవసరం అనుకుంటే స్వతంత్ర అభ్యర్ధులకు సైతం మద్దతు ఇవ్వాలన్నా ఆలోచన కూడా చేస్తోంది. అటు జిల్లాలో బలంగా ఉన్న సీపీఐ కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మధిరలో జిల్లా మహాసభలు నిర్వహించింది. పొత్తులో భాగంగా తమకు గౌరవ ప్రదమైన స్థానాలు కేటాయించాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. కాంగ్రెస్ అడిగిన సీట్లు ఇవ్వని పక్షంలో ఒంటరిగా పోటీ చేయాలా, లేక ఇతర పార్టీలతో కలిసి వెళ్లాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.

మరో వామపక్ష పార్టీ సీపీఎం మాత్రం ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పరిస్తితికి అనుగుణంగా ఎవరితో పొత్తు ఉంటే పార్టీకి లాభం చేకూరుతుందో, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటానికి రెడీ అంటున్నారు సీపీఎం నేతలు. ఈ విషయంలో స్థానిక పరిస్తితులతో పాటు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విబేధాలను కూడా వాడుకోవాలన్నది సీపీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి సై అంటూ కార్యక్రమాలు సాగిస్తోంది. ఇక జిల్లాలో తమకంటూ ఓట్ బ్యాంక్ పదిలం చేసుకున్న తెలుగుదేశం పార్టీతో పాటు పవన్ మానియా ఉన్న చోట జనసేన కూడా స్థానిక ఎన్నికల బరిలో దిగాలని డిసైడ్ అయ్యిందట.

Also Read: https://www.mega9tv.com/telangana/the-latest-talk-is-that-the-congress-rule-in-telangana-is-a-symbol-of-the-delhi-formula/