
Mandamarri Baldia municipality: ఈ మున్సిపాలిటీలో 30 ఏండ్లుగా స్థానిక ఎన్నికలు లేవు, తమ సాదకబాధకాలు తీర్చడానికి ప్రతినిధి లేకుండా పోయారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తమను గెలిపిస్తే స్థానిక ఎన్నికలునిర్వహించేందుకు కృషి చేస్తామని గతంలో స్వయంగా ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మూడు దశాబ్దాలుగా ఎన్నికలు లేని మందమర్రి మున్సిపాలిటీ పైmega9tv స్పెషల్ స్టోరి
పాత ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ ఏర్పాటు అయి 30 ఏళ్లు అయిన ఎన్నికలు జరగలేదు. దీంతో అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంది. మందమర్రి బల్దియాకు 30 ఏళ్లుగా పాలకవర్గం లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలుగా విభజించి ఎన్నికలను నిర్వహించాలని మందమర్రి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మందమర్రి పంచాయతీని 1993 అక్టోబరు 21న నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. 1995 మే 8న మందమర్రికి గ్రేడ్-3 పురపాలిక(బల్దియా) హోదాను కల్పించారు. ఛైర్మన్ పదవిని రిజర్వేషన్ ఎస్సీ (మహిళ)కు కేటాయిస్తూ ఎన్నికల నిర్వహణకు 1998 మే 21న ఉత్తర్వులను జారీ చేసింది.
మందమర్రిలో 1/70 చట్టం అమల్లో ఉన్నందున ఛైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయించాలంటూ మాజీ సర్పంచి మద్ది రాంచందర్ హైకోర్టును ఆశ్రయించడంతో 1998 జూన్ 18న ఎన్నికలను నిలిపివేస్తూ స్టే జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సొత్కు సంజీవరావు భార్య ఆశానిర్మల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరకు వాది, ప్రతి వాదుల తరఫున కోర్టులో ఎవరు హాజరుకాకపోవడంతో 2005 ఏప్రిల్ 5న ఈ కేసును డిస్మిస్ చేశారు. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్న పురపాలిక ఎన్నికలకు సంబంధించిన వివాదం తలెత్తినట్లయితే పార్లమెంట్ జోక్యం చేసుకుని షెడ్యుల్డ్ ఏరియాల విభాగం 9 (ఎ) చట్టం ప్రకారం బిల్లు ఆమోదించాల్సి ఉంది. Mandamarri Baldia municipality.
ఏజెన్సీ వివాదంతో పాలకవర్గం లేకుండా పోయింది. దీనికి తోడు గిరిజనేతరులు ఇక్కడ క్రయ, విక్రయాలు, నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు. దీంతో బల్దియాకు పెద్దగా ఆదాయం సమకూరే పరిస్థితి లేదు. పురపాలికకు నిధుల మంజూరు కూడా పెద్దగా లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది. దీనికితోడు పలు రకాల పన్నుల రూపంలో వచ్చే నిధులు ఒప్పంద కార్మికుల జీతభత్యాలకే సరిపోతున్నాయి. మున్సిపాలిటీలో ఏజెన్సీ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ చట్టాలు అమలు కావడంలేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్న ఆఫీసర్లు అడ్డుకునే పరిస్థితి లేదు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 నవంబర్ 29న మందమర్రి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాల్క సుమన్ ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటాడని, మందమర్రి మున్సిపాలిటీకి తాను ఎన్నికలు జరిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సమైక్య ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు హామీ ఇచ్చిన ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు.
నూతనంగా ఏర్పడ్డ చెన్నూర్ ,క్యాతనపల్లి మున్సిపాలిటి లకు ఎన్నికలు నిర్వహించారు కాని మందమర్రి మున్సిపాలిటి కి ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పటికైన మందమర్రి మున్సిపాలిటీ కి ఎన్నికలు నిర్వహించి అభివృద్ధి పరుచాలని స్థానికులు కోరుతున్నారు.