
Gun Culture on the Rise: ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ఏరియాల్లో కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన దాడి, నిన్న అమెరికాలోని న్యూయార్క్‌లో చోటుచేసుకున్న కాల్పులు అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. ఎలా తుపాకులతో పిచ్చిపట్టినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు..? ఈ ఘటనల వెనుక కారణాలు ఏమిటి? అమెరికాలో ఇలాంటి కాల్పులు ఎందుకు తరచూ జరుగుతున్నాయి? అమెరికాలో ప్రతి ఇంట్లో తుపాకులు ఎందుకు సర్వసాధారణం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ప్రదేశాల్లో కాల్పుల ఘటనలు గత దశాబ్దంలో గణనీయంగా పెరిగాయి. థాయ్‌లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధరణంగా మారడంతో సమాజంలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. వ్యక్తిగత కక్షలు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఉగ్రవాదం, సామాజిక అసమానతలు..ఇలా కారణం ఏదైనా కావచ్చు బలయ్యేది మాత్రం అమాయక ప్రజలు. తుపాకులు పట్టుకుని పబ్లిక్ ఏరియాల్లోకి వచ్చి కనిపించిన వారిపై కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ కాల్పులు జరిపే వ్యక్తికి.. చనిపోయే వారికి ఎలాంటి సంబంధం ఉండదు. కొన్ని ఘటనల్లో కాల్పులు జరిపిన వ్యక్తి సమస్య చాలా చిన్నదిగా అనిపించిన.. వారి వల్ల కలిగిన హింస చాలా పెద్దది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన తాజా ఘటనలు ఈ సమస్య తీవ్రతను మరోసారి గుర్తు చేస్తున్నాయి. 2019లో ప్రపంచవ్యాప్తంగా 2,17,000 మంది తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ డేటాబేస్ తెలిపింది.
జూలై 28న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓర్ టోర్ కోర్ మార్కెట్‌లో దారుణమైన కాల్పుల ఘటన జరిగింది. ఈ మార్కెట్, వీకెండ్ మార్కెట్ సమీపంలో ఉండటం వల్ల స్థానికులతో పాటు పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఈ సమయంలో ఓ వ్యక్తి మార్కెట్‌కు వచ్చి, ముందుగా ఒక ఎంట్రన్స్ వద్ద ముగ్గురు గార్డులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తన మరో గార్డును చంపి, మార్కెట్‌లోకి పరుగెత్తి, ఒక మహిళా వ్యాపారిని చంపి, మరో ఇద్దరిని గాయపరిచాడు. ఆ తర్వాత అతడు తన తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు, ఇద్దరు గాయపడ్డారు. Gun Culture on the Rise.
వ్యక్తిగత కక్షే బ్యాంకాక్ కాల్పుల ఘటనకు ప్రధాన కారణంగా పోలీసులు తేల్చారు. కాల్పుల జరిపిన వ్యక్తికి .. మార్కెట్లోని ఓ గార్డుకు గతంలో జరిగిన ఒక గొడవ ఈ దారుణానికి కారణమైంది. మార్కెట్ సెక్యూరిటీ గార్డు తన కారును పాడు చేశాడనే కోపంతో దుండగుడు గన్ తో కాల్పులు జరిపాడు. అయితే థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దు ఘర్షణల సమయంలో ఈ కాల్పులు జరగడంతో.. దానితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ ఘటనకు దానికి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆగ్నేయాసియాలోని దేశాల్లోని అన్నింటిలో థాయ్‌లాండ్‌లోనే తుపాకీ లెసెన్స్ లు ఎక్కువ. దాదాపు 100 మందిలో 15 మందికి తుపాకులు ఉంటాయని అంచనా. అయితే వీటిలో 40 శాతం అక్రమ మార్గంలో వచ్చినవే. లక్షలాది తుపాకులు బ్లాక్ మార్కెట్‌లో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా లభిస్తుండటంతో ఎవరికి వారు తుపాకులు కొంటున్నారు. సరైన పర్యవేక్షణ లేకుపోవడం కూడా థాయిలాండ్ లో గన్ కల్చర్ పెరగడానికి కారణమైంది.
థాయిలాండ్ ఘటన జరిగిన 24 గంటల్లోనే అమెరికా కాల్పుల మోతతో వణికింది. అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక హ్యాండ్‌గన్‌తో రద్దీగా ఉన్న సబ్‌వే స్టేషన్ సమీపంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగినదా లేక ముందస్తు ప్రణాళికతో జరిగినదా అనే దానిపై స్పష్టత లేదు. సంఘటనా స్థలంలో సేకరించిన CCTV ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల ఘటనపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కీలక ఆధారాలు సేకరించింది. గన్‌మన్ గుర్తింపు కోసం సబ్‌వే స్టేషన్, టైమ్స్ స్క్వేర్ పరిసరాల్లోని CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు సంబంధం ఉందా, వ్యక్తిగత కక్షల వల్ల కాల్పులు జరిగాయా లేక మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ఇలా చేశాడా అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. అయితే, కాల్పులు జరిపిన వ్యక్తి ఘటన తర్వాత పారిపోవడంతో టైమ్స్ స్క్వేర్ వద్ద భద్రతను పెంచారు.
అమెరికాలో కాల్పుల ఘటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయి..?
అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. లెక్కల ప్రకారం, 2024లో అమెరికాలో 400కు పైగా మాస్ షూటింగ్స్ జరిగాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక అసమానతలు, గ్యాంగ్ వార్స్, జాతి వివక్షలు ఇలాంటి కాల్పుల ఘటనలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. అమెరికాలో 100 మంది ఉంటే వారి దగ్గర 120 తుపాకుల చొప్పున 400 మిలియన్లకు పైగా తుపాకులు ఉన్నాయని ఓ అంచనా. అమెరికా రాజ్యాంగంలోని రెండవ సవరణ ద్వారా ప్రతీ ఒక్కరికీ తుపాకీని కలిగి ఉండే హక్కు ఉంటుంది. భారత్ లో అయితే ఎవరికైనా అవసరం ఉండి.. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ లైసెన్స్ ఇస్తారు. అయితే అమెరికాలో తుపాకీ కలిగి ఉండటం ప్రాథమిక హక్కుగా భావిస్తారు. ఇది తుపాకీ నియంత్రణ చట్టాలను రూపొందించడంలో అడ్డంకిగా మారుతోంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వంటి సంస్థలు తుపాకీ హక్కులను గట్టిగా సమర్థిస్తాయి, దీనివల్ల కఠిన చట్టాలు అమలు కావడం కష్టమవుతోంది. ప్రభుత్వం బలప్రయోగం చేస్తే ప్రజలు తుపాకీలతో తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అమెరికా ఏర్పడినప్పుడే గన్ కల్చర్ మొదలైంది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో తుపాకులు కీలక పాత్ర పోషించాయి. 1791లో రాజ్యాంగంలో చేర్చిన రెండవ సవరణ ప్రకారం.. ప్రజలు ఆయుధాలు ప్రాథమకి హక్కుగా కలిగి ఉండవచ్చు. ఈ తుపాకులు నిరంకుశ ప్రభుత్వాలు వచ్చినప్పుడు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉపయోగపడతాయని భావిస్తారు. 19వ శతాబ్దంలో వైల్డ్ వెస్ట్ యుగంలో, స్వీయ రక్షణ కోసం తుపాకులు అవసరమయ్యాయి. 20వ శతాబ్దంలో, తుపాకులు స్వేచ్ఛ, వ్యక్తిగత శక్తి, గుర్తింపు చిహ్నంగా మారాయి. హాలీవుడ్ సినిమాలు, వీడియో గేమ్‌లు ఈ గన్ కల్చర్‌ను మరింత ప్రోత్సహించాయి.
అమెరికాలో దాదాపు 32% గృహాల్లో తుపాకులు ఉన్నాయని అంచనా. స్వీయ రక్షణ, వేటాడటం, క్రీడా షూటింగ్, సేకరణ వంటి కారణాలతో ప్రజలు తుపాకులు కొంటారు. చాలా రాష్ట్రాల్లో తుపాకీ కొనుగోలుకు పెద్దగా ఎటువంటి అనుమతులు ఉండవు. స్వీయ రక్షణ కోసం తుపాకీ ఉంచుకోవాలనే భావన అమెరికన్ సమాజంలో లోతుగా పాతుకుపోయింది. అయితే, ఈ తుపాకులు తరచూ దుర్వినియోగం కావడం, ప్రమాదవశాత్తు కాల్పులు, ఆత్మహత్యలు, గృహ హింసకు దారితీస్తున్నాయి.
థాయ్‌లాండ్, అమెరికా రెండు దేశాల్లోను ప్రజలు తుపాకీలు ఎక్కువగా కలిగి ఉన్నా, వాటి గన్ కల్చర్‌లో తేడాలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో తుపాకులు పేరు ప్రతిష్టలకు చిహ్నంగా భావిస్తారు. ఎక్కువగా ఆర్మీలో పనిచేసే వారికి, పోలీసులకు తుపాకులు సులభంగా లభిస్తాయి. అయితే అక్కడ చట్టాలు కఠినంగా కనిపించినప్పటికీ, అమలు బలహీనంగా ఉంది. అమెరికాలో మాత్రం తుపాకులు వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ కోసం ఎక్కువగా కలిగి ఉంటారు. థాయ్‌లాండ్‌లో మాస్ షూటింగ్స్ అరుదైనప్పటికీ, అమెరికాలో ఇవి సర్వసాధారణం.