గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకూ.. రక్తికట్టించిన దేవాకట్ట ‘మయసభ’

వెబ్ సిరీస్: మయసభ Mayasabha
నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్, రవీంద్ర విజయ్, తన్య రవిచంద్రన్, భావన వజపండల్, చరిత వర్మ, శంకర్ మహంతి తదితరులు
దర్శకత్వం: దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్
నిర్మాతలు: విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష
బ్యానర్: హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌
మ్యూజిక్ డైరెక్టర్: శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రాఫర్: సురేష్ రగుతు, జానశేఖర్ వీఎస్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
ఓటీటీ : సోనీలివ్
రిలీజ్ డేట్: 07-08-2025

శర్వానంద్, సందీప్ కిషన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో 2010లో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాతో డైరెక్టర్ దేవా కట్టా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2021లో సాయిదుర్గ తేజ్‌తో తీసిన ‘రిపబ్లిక్’ సినిమా కూడా పొలిటిక్ డ్రామాగా సాయితేజ్‌కు మంచి గుర్తింపునిచ్చింది. అలాంటి డైరెక్టర్ నుంచి మరో పొలిటికల్ డ్రామా వస్తుందంటే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. దేవకట్టా షోరన్నర్‌గా వ్యవహరించిన ‘మయసభ’ వెబ్ సిరీస్ టీజర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండ నాయకుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ సోనీలివ్ ఓటీటీలో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ను పంచింది అనేది ఈ రివ్యూలో చూద్దాం..

కథ:
చిత్తూరు జిల్లాకు చెందిన కాకర్ల కృష్ణమనాయుడు (ఆదిపినిశెట్టి) రైతు కుటుంబంలో జన్మిస్తాడు. పీజీ పూర్తి చేసి, పీహెచ్‌డీ చేసేందుకు యూనివర్సిటీలో చేరతాడు. విద్యార్థి రాజకీయాల్లో చేదు అనుభవాలు ఎదురైనా, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. మరోవైపు కడప జిల్లాకు చెందిన ఎంఎస్‌ రామిరెడ్డి (చైతన్యరావు) తండ్రి చేసే ఫ్యాక్షన్‌ గొడవలు ఇష్టం లేక, వైద్య విద్యను అభ్యసించడానికి బళ్లారి వెళ్తాడు. స్థానికంగా హాస్పిటల్ నిర్మించి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉంటాడు. అయితే రామిరెడ్డి రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆయన తండ్రి శివారెడ్డి ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో కృష్ణమనాయుడు, రామిరెడ్డి ఇద్దరూ కలుస్తారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితులు వాళ్లను స్నేహితులుగా మారుస్తాయి. కలిసి రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరి పయనం ఎలా సాగింది? ప్రజలకు మేలు చేయడానికి వీరిద్దరూ కలిసి ఆడిన రాజకీయ చదరంగం ఏంటి? మరోవైపు విజయవాడలోని రౌడీయిజంపై ఒక వ్యక్తి తిరుగుబాటు ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? తెలుగువారి అభిమాన నటుడు రాయపాటి చంద్రశేఖరరావు (సాయికుమార్) రాజకీయ పార్టీ స్థాపించడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న ఐరావతి బసు(దివ్య దత్త) ఎలాంటి వ్యూహాలు పన్నింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పును తీసుకొచ్చాయి? అన్నది 9 ఎపిసోడ్‌ల సిరీస్‌‌లో చూడాల్సిందే.

విశ్లేషణ:
ప్రస్తుతం చారిత్రక ఘట్టాలు, నిజ జీవిత కథలకు అటు వెండితెర పైనా, ఇటు ఓటీటీలోనూ మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా తెలిసిన వారి కథలు వస్తున్నాయంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ‘మయసభ’తో అలాంటి అంచనాలే పెంచి, దాన్ని అంతే ఆసక్తిగా తీర్చిదిద్దడంలో దర్శకులు దేవా కట్టా, కిరణ్‌ జయ్‌కుమార్‌ విజయం సాధించారు. తెలుగు చరిత్రను మలుపుతిప్పిన రాజకీయ లెజెండ్స్‌ జీవితాల ఆధారంగా ఇప్పటికే సినిమాలు వచ్చాయి. ఎన్నికల అజెండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికి అనుగుణంగా వారు వాటిని తెరపై ఆవిష్కరించారు. అందరికీ తెలిసిన ఆ కథను మరింత లోతుగా, కొత్తగా, కాస్త కాల్పనికత జోడించి ఆవిష్కరించాలంటే కత్తిమీద సామే. ఎవరికీ తెలియని విషయాల్ని తీయడం ఎంత సులభమో, అందరికీ పరిచయమున్న వ్యక్తులు, పాత్రలను తెరపై ఆవిష్కరించడం చాలా కష్టం. మేకింగ్‌, టేకింగ్‌లో ఏమాత్రం తేడా వచ్చినా, అభాసుపాలవడంతోపాటు, కథ వల్ల తలెత్తే వివాదాలు అంతకుమించిన తలనొప్పి. ఈ విషయంలో దర్శకుడు దేవా కట్టా, ఆయన టీమ్‌ చాలా రీసెర్చ్‌ చేసి, ‘మయసభ’ను ఆవిష్కరించింది. ఏ పాత్రను, ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలి? ఎంతలో తీయాలి? అన్న లెక్క.. సిరీస్‌ రూపొందించే విషయంలో దేవా కట్టా విజన్‌ ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపించింది.

ఇద్దరు యువకుల కుటుంబ నేపథ్యంతో పాటు, ఈ కథలోని కీలక పాత్రలను పరిచయం చేస్తూ మొదటి ఎపిసోడ్‌తో ‘మయసభ’ ప్రపంచాన్ని పరిచయం చేశారు. అక్కడినుంచి ప్రతి ఎపిసోడ్‌లోనూ ఇద్దరి పాత్రలను చాలా బ్యాలెన్స్‌ చేస్తూ తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. ముఖ్యంగా వారి జీవితాలను మూలాల నుంచి ఆవిష్కరించిన తీరు బాగుంది. ఆ సమయంలో కుటుంబ నేపథ్యం పరంగా ఆ ఇద్దరూ ఎదుర్కొన్న అవమానాలు, వాటిని దాటి కెరీర్‌లో ముందుకువెళ్లేందుకు తీసుకునే నిర్ణయాలు, ఇలా ప్రతిఒక్కటీ కొత్తగా, ఇప్పటివరకూ ఎవరూ చెప్పని కథను చెప్పారు. కేవలం ఇద్దరి పాత్రలే కాదు, అదే సమయంలో విజయవాడ రాజకీయాలు, అక్కడి సామాజికవర్గంలో పుట్టిన ఓ వ్యక్తి వ్యవస్థలను శాసించే స్థాయికి ఎదిగిన తీరు.. ఆ తర్వాత హత్యకు గురైన ఘటన తదితర అంశాలనూ ఇందులో ప్రస్తావించడం గమనార్హం. ఇక ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న పరిస్థితులను ఇద్దరు యువకుల జీవితాలకు అన్వయిస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు అలరిస్తాయి. దిల్లీలో ప్రధాని ఐరావతి బసు ఆడే రాజకీయ చదరంగం, ఆమె కొడుకు సందీప్‌ బసు తీసుకున్న నిర్ణయాలు ఇలా ఆ టైమ్‌లైన్‌లో జరిగిన ఏ అంశాన్నీ వదల్లేదు. అయితే, వాటికోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారేమో అనిపిస్తుంది. మొదటి మూడు, నాలుగు ఎపిసోడ్స్‌లో ఇద్దరూ రాజకీయాల వైపు అడుగులు వేయడానికి దారితీసిన పరిస్థితులను చూపించారు.

ఎప్పుడైతే కృష్ణమనాయుడు, రామిరెడ్డి ఎన్నికల్లో విజయం సాధిస్తారో అప్పటినుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఇద్దరూ ఆడే రాజకీయ చదరంగం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా చేవెళ్ల భాస్కర రావు (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) సన్నివేశాలు ఆద్యంతం వినోదాన్ని పంచుతాయి. చివరి రెండు ఎపిసోడ్స్‌లో కథలో గాఢత మరింత పెరుగుతుంది. తెలుగు రాజకీయాల్లో సువర్ణాధ్యాయానికి బాటలు పడిన సంఘటనలను దేవా కట్టా చాలా నాటకీయంగా వీటిలో చూపించారు. ఐరావతి బసు చర్యల వల్ల తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతినడం.. సినీ నటుడు ఆర్‌సీఆర్‌ వీర తెలుగు పార్టీని స్థాపించడం ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ అలరిస్తాయి. తాను ఉన్న పార్టీ నుంచి తెలుగు వీర పార్టీలోకి కృష్ణమనాయుడు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులను లాజికల్‌గా చూపించిన తీరు బాగుంది. చివరి 10 నిమిషాల్లో కృష్ణమనాయుడు చేసే ప్రసంగం భావోద్వేగభరితంగా ఉంటుంది. చివరిలో ‘కంగ్రాట్స్‌ నాయుడు ఇక మిగిలిన యుద్ధం నీకూ నాకే’ అంటూ రామిరెడ్డి డైలాగ్‌తో సిరీస్‌ ముగించి, ‘సీజన్‌2’ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇద్దరు స్నేహితులు ఎలా శుత్రువులు అయ్యారో తర్వాతి సీజన్‌లో స్పష్టంగా చూపిస్తారేమో చూడాలి. 1970లలో మొదలైన ఈ కథ, 1990ల నుంచి ఊపందుకుంటుంది. ఈ సిరీస్‌ను చూస్తుంటే ఎవరెవరిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సిరీస్‌ను రూపొందించారనే విషయం ప్రేక్షకుడికి అర్థమైపోతూ ఉంటుంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, అప్పటి వేషధారణ .. పల్లెల పరిస్థితికి అద్దం పడుతూ ఈ సిరీస్‌ను చిత్రీకరించడం కష్టమైన పనేనని చెప్పుకోవాలి. దాన్ని సాధ్యం చేసి చూపించారు షో రన్నర్ దేవాకట్ట. Mayasabha

నటీనటుల విశ్లేషణ:
వాస్తవ కథలు, నిజ జీవిత సంఘటలను తెరపై ఆవిష్కరించే సమయంలో నటీనటుల ఎంపిక కూడా అత్యంత ప్రధానమైంది. ఈ విషయంలోనూ దేవకట్టాకు మంచి మార్కులు పడతాయి. కృష్ణమనాయుడిగా ఆది పినిశెట్టి, రామిరెడ్డిగా చైతన్యరావు, ఆర్‌సీఆర్‌గా సాయికుమార్‌ బెస్ట్‌ ఛాయిస్‌. మనకు ఎంతో సుపరిచితులైన ఆ రాజకీయ నాయకుల అనుకరణ, ఆహార్యాన్ని అలాగే దించేశారు. రాయలసీమ యాస, సాధారణ సమయాల్లో ఉన్నప్పుడు వాళ్ల వ్యవహారశైలి ఎలా ఉంటుంది? వేదికలు, రాజకీయ ర్యాలీల్లో వారు ప్రసంగించే తీరు ఎలా ఉంటుందన్న విషయాలను బాగా పట్టుకున్నారు. ఆ వేరియేషన్స్‌ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రధాని ఐరావతి బసు పాత్రలో దివ్యదత్‌ ఒదిగిపోయారు. ఆమె చాలా సెటిల్డ్‌గా నటించారు. ఏ ఎండకాగొడుగు పట్టేలా చేవెళ్ల భాస్కసరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగారు ఈ సిరీస్‌కు మరో ప్లస్‌ పాయింట్. రవీంద్ర విజయ్‌ (రాయలసీమలో బలమైన నాయకుడు), శత్రు (విజయవాడ నాయకుడు) తదితరులు తమదైన పాత్రలో మెప్పించారు. ఎన్టీఆర్‌ అభిమానిగా జీకేఆర్‌ పాత్ర తళుక్కున మెరుస్తుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విశ్లేషణ:
సిరీస్‌ బాగుంది. ఇద్దరు రాజకీయ నాయకులు యువకులుగా ఉన్న కాలం నాటి పరిస్థితులను చాలా చక్కగా ఆవిష్కరించారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫ్రీకి మార్కులు పడతాయి. సినీ నటుడు ఆర్‌సీఆర్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలను రీక్రియేట్‌ చేసిన తీరు బాగుంది. ఇంకాస్త షార్ప్‌గా ఎడిటింగ్‌ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్‌ ఎపిసోడ్స్‌ తక్కువ సమయమే ఉన్నా, చివరికి వచ్చేసరికి నిడివి పెరిగిపోతూ వచ్చింది. దర్శకుడు, రచయిత దేవాకట్టా ‘మయసభ’ను తనదైన శైలిలో బలమైన పొలిటికల్‌ డ్రామాగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆయన సంభాషణల్లో మెరుపు ఉంది. ‘నినాదాలు, తుపాకీ గుళ్లు సమస్యలను పరిష్కరించలేవు. కానీ, రాజకీయాలు పరిష్కరిస్తాయి’.. ‘ ప్రభుత్వాలు, పోలీసులు తీవ్రవాదులుగా వ్యవహరించిన దేశాలు బాగుపడలేదు’.. ‘మనం కులమనే ఊబిలో బతుకుతున్నాం. నీ వాళ్ల ఉనికిని కాపాడటం నీ ధర్మం.. నా వాళ్ల ఉనికిని కాపాడటం నా ధర్మం.. కులాన్ని కాదంటే అడ్రస్‌ లేకుండా పోతాం నాయుడు’.. ‘శిలా ఫలాకాలు కదా సర్‌.. అవి అక్కడే ఉంటాయి’ వంటి సంభాషణలు బాగున్నాయి. కొన్నిచోట్ల సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు రాజకీయ ఉద్ధండులు విద్యార్థి దశలో ఉన్నప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఆర్‌సీఆర్‌ను కాదని, తెలుగు వీర పార్టీకి అధ్యక్షుడిగా, ఆ తర్వాత సీఎంగా కృష్ణమనాయుడు కావడానికి ఉన్న బలమైన కారణాలను ఆవిష్కరించలేదు. బహుశా సీజన్‌-2లో చూపిస్తారేమో.

చివరిగా..
దర్శకుడు ఎంచుకున్న కథ వివాదాలకు అవకాశం ఉన్నదే అయినా.. సిరీస్‌లో ఎక్కడా వివాదానికి తావులేకుండా ప్రతి సన్నివేశాన్ని మలిచాడు. తెలుగులో సరైన వెబ్ సిరీస్‌లు రావట్లేని బాధపడేవాళ్లకు ‘మయసభ’(Mayasabha) ఆ లోటును భర్తీ చేస్తుంది. తెలుగు పొలిటికల్‌ థ్రిల్లర్‌‌గా ప్రతి ఎపిసోడ్ మిస్ అవకుండా చూసేలా ఉన్న ఈ ‘మయసభ’ను కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకుపైగానే ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్‌ప్లేను అంత బాగా పండించిన దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ‘మయసభ’సీజన్-1 చూసినవాళ్లంతా సీజన్-2 కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

-బిల్లా గంగాధర్