ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది..?

Indian society is worried in Australia: ఆస్ట్రేలియాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సమయంలో, ఖలిస్తానీ మద్దతుదారులు సృష్టించిన అలజడి భారతీయ సమాజంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. మెల్బోర్న్‌లోని భారత కాన్సులేట్ వద్ద జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, ఖలిస్తానీ మద్దతుదారులు భారత జాతీయ పతాకాన్ని అవమానించి, ఖలిస్తానీ జెండాలను ఎగురవేస్తూ వేడుకలను అడ్డుకున్నారు. ఈ సంఘటన ఒక్కటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరిగాయి, ఇవి భారతీయ సమాజంలో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఉద్యమం ఆస్ట్రేలియాలో ఎలా పాతుకుపోయింది? కెనడాలోని ఖలిస్తానీ ఉద్యమంతో దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? దాడులకు ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధం ఏంటి..?

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో భారత కాన్సులేట్ వద్ద 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖలిస్తానీ మద్దతుదారుల కారణంగా అలజడికి గురయ్యాయి. స్థానికంగా సెటిల్ అయిన భారతీయులు జాతీయ జెండాన్ని ఎగురవేస్తూ, దేశభక్తి పాటలు ఆలపిస్తుండగా, ఖలిస్తానీ మద్దతుదారులు ఖలిస్తానీ జెండాలను ఎగురవేస్తూ, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్రమైన వాగ్వివాదం కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని గొడవను చల్లార్చారు. ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ గ్రూపులు భారతీయులతో గొడవకు దిగడం ఇది మొదటిసారి కాదు. 2024లో భారత-ఆస్ట్రేలియా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఖలిస్తానీ మద్దతుదారులు భారతీయ అభిమానులపై దాడి చేశారు. భారతదేశంలో పుట్టిపెరిగి.. విదేశాలకు వెళ్లి అక్కడ ఖలిస్తానీ పేరుతో వీరు దేశ వ్యతిరేక చర్యలు చేపడుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ ఉద్యమం పెరుగుదలకు కారణం ఏంటి..?
ఖలిస్తానీ ఉద్యమం అంటే ఇప్పటి వరకు ఎక్కువగా కెనడా పేరు వినిపించేది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా ఆ జాబితాలో చేరింది. ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ ఉద్యమం గత కొన్ని సంవత్సరాలుగా చాలా పెరిగింది, ముఖ్యంగా మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ వంటి పెద్ద నగరాల్లో ఖలిస్తానీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా సిక్కు సమాజంలో కొంతమంది యువత భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా ఈ ఉద్యమానికి పెద్ద వేదికగా మారింది, ఇక్కడ ఖలిస్తానీ నాయకులు తమ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. పలు సిక్కు సంస్థలు, భారత్‌లో నిషేధించబడినప్పటికీ, ఆస్ట్రేలియాలో పంజాబ్ స్వాతంత్ర్య రిఫరెండమ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 2023లో మెల్బోర్న్‌లో జరిగిన ఒక రిఫరెండమ్ సందర్భంగా ఖలిస్తానీ మద్దతుదారులు, భారతీయ సమాజంతో ఘర్షణకు దిగారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల, ఈ ఉద్యమం మరింత విస్తరిస్తోందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం తమ భద్రత, సామాజిక శాంతి కోసం ఆందోళన చెందుతోంది.

ఆస్ట్రేలియాలోని ఖలిస్తానీ ఉద్యమాన్ని కెనడాతో పోల్చినప్పుడు చాలా దగ్గర సంబంధాలు కనిపిస్తాయి. కెనడాలో భారీ సంఖ్యలో పంజాబీ వలసదారులు ఉన్నారు, ఇక్కడ ఖలిస్తానీ ఉద్యమం రాజకీయ, సామాజిక మద్దతును పొందుతోంది. కెనడాలో ఖలిస్తాన్ రిఫరెండమ్ వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇది ఖలిస్తానీ భావజాలాన్ని విస్తరించడానికి వేదికగా మారింది. ఇటీవలలో సర్రేలోని ఒక గురుద్వారాలో ఖలిస్తాన్ ఎంబసీ ఏర్పాటు చేయడం, కెనడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి కార్యకలాపాలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా స్థానిక సిక్కు గురుద్వారాలు, కమ్యూనిటీ నెట్‌వర్క్‌ల ద్వారా వీరు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కెనడాలో ఖలిస్తానీ ఉద్యమానికి రాజకీయ మద్దతు ఎక్కువగా ఉండటం, ఆస్ట్రేలియాలో కూడా ఈ ఉద్యమం విస్తరణకు ప్రేరణగా నిలుస్తోంది. 2023లో సిడ్నీలో జరిగిన ఒక ఖలిస్తానీ ర్యాలీలో భారత వ్యతిరేక నినాదాలు చేశారు.

అటు ఖలిస్తానీ ఉద్యమంతో ఆస్ట్రేలియాలో భారతీయ సమాజం ఆందోళన చెందుతుంటూ.. ఇటు జాతి విద్వేష దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హిందూ ఆలయాలు, పలు భారతీయ రెస్టారెంట్లపై దాడులు జరిగాయి. 2025లో మెల్బోర్న్‌లోని స్వామినారాయణ దేవాలయంపై దాడి చేసి గోడలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు రాసారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో ఆందోళనను రేకెత్తించింది. అదే విధంగా, అడిలైడ్‌లో ఒక భారతీయ యువకుడు పార్కింగ్ వివాదంలో జాత్యాహంకార దాడికి గురయ్యాడు. ఈ దాడుల వెనుక సామాజిక అసంతృప్తి స్థానిక భద్రతా వ్యవస్థలలో లోపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఖలిస్తానీ ప్రచారం యువతను రెచ్చగొడుతోంది, ఇది భారతీయ సమాజంతో ఘర్షణలకు దారితీస్తోంది. ఉదాహరణకు, 2024లో బ్రిస్బేన్‌లో జరిగిన ఒక ఖలిస్తానీ ర్యాలీలో భారత వ్యతిరేక బ్యానర్లు, నినాదాలు భారతీయ సమాజంలో భయాందోళనలను సృష్టించాయి. ఈ ఘటనలు ఆస్ట్రేలియాలో భారతీయుల శాంతియుత జీవనానికి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం, ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ ఖలిస్తానీ కార్యకలాపాలు, జాతి విద్వేష దాడుల వల్ల భయాందోళనలకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఖలిస్తానీ ప్రచారం భారతీయ సమాజంలో భిన్న భావాలను రేకెత్తిస్తోంది. ప్లాట్‌ఫామ్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు భారత వ్యతిరేక వీడియోలు, పోస్ట్‌లను విస్తృతంగా షేర్ చేస్తున్నారు, ఇవి భారతీయ యువతలో అసహనాన్ని, భయాన్ని సృష్టిస్తున్నాయి. మెల్బోర్న్‌లో ఒక భారతీయ వ్యాపారవేత్త తన రెస్టారెంట్‌పై జరిగిన దాడి తర్వాత, స్థానికంగా భద్రతా లోపాలు బయటపడ్డాయి. Indian society is worried in Australia.

ఖలిస్తానీ ఉద్యమం కారణంగా ఆస్ట్రేలియాలో భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు శాంతియుత వేడుకలు, ఆస్తుల భద్రతపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేసి, ఖలిస్తానీ కార్యకలాపాలను అరికట్టడం అవసరం. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గతంలో కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఖలిస్తానీ తీవ్రవాద కార్యకలాపాలకు అవకాశం ఇవ్వవద్దని కోరారు. ఈ ఉద్యమం ఒక రాజకీయ సమస్య మాత్రమే కాదు, భిన్న సాంస్కృతిక సమాజంలో సామాజిక సమత్యులతను కాపాడే సవాలుగా మారింది.

Also Read: https://www.mega9tv.com/international/hunter-biden-escalates-rift-with-melania-trump-over-jeffrey-epstein-allegation/