జలదిగ్బంధంలో ముంబై..!

Mumbai Heavy Rains: ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నాన్ స్టాప్ గా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. అంధేరి సబ్వే , లోఖండ్వాలా కాంప్లెక్స్ తదితర లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు , ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ ట్రైన్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. సబర్బన్ రైళ్లు 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబైతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

గత శనివారం మొదలైన వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి నిరంతరాయంగా వర్షం పడుతూనే ఉంది. ఇవాళ ఉదయం కూడా భారీ వర్షపాతం నమోదవడంతో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే కొన్ని గంటలు వర్షం ఇలాగే కొనసాగితే రైల్వే ట్రాక్‌లు మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కుర్లా స్టేషన్‌లోని సెంట్రల్ రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సెంట్రల్, హార్బర్ రైల్వే లైన్‌లలో స్థానిక రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటలు పోలీసులు, పౌరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్రదించాలని కోరారు. Mumbai Heavy Rains.

ఇదిలా ఉంటే ముంబైతో పాటు సమీప జిల్లాలైన థానే, రాయ్‌గడ్‌లలో రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య మహారాష్ట్రలోని అహిల్యానగర్, ధూలే, జల్గావ్, పుణె, సతారా, సాంగ్లి, సోలాపూర్, కొల్హాపూర్, నాసిక్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరాఠ్వాడాలోని బీడ్, ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్, రేపు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబైలో రానున్న 48 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్ట్​ 23 వరకు తేలికపాటి వర్షాలు కొనసాగుతాయి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q