తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మాటల తూటాలు..!!

MLA Madhusudhan Reddy vs Alla Venkateswara Reddy: గత కొన్ని నెలలుగా మర్యాద రామన్నగా వ్యవహరించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలు ఎక్కుపెట్టారు. తమ పార్టీ అధినాయకులపై ఆ ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలను మాజీ ఎమ్మెల్యే తట్టుకోలేకపోతున్నారట. తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మాటల తూటాలు ఆ నియోజకవర్గంలో అగ్గి రాజేస్తున్నాయట. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్నారా. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ఇద్దరు నేతలు దూషణలు రాజకీయ సెగలు రాజేస్తోందా. ఇంతకీ రాజకీయ రంగులు మారుతున్న నియోజకవర్గం ఏంటి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా నేతలు పనులను చక్కబెట్టుకుంటారు. కానీ గత పద్దెనిమిది నెలలుగా స్తబ్దుగా ఉన్న దేవరకద్ర నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాజకీయ సెగలను రాజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత నామమాత్రపు విమర్శలతో సరిపెట్టిన నేతలు, ఇప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు నాయకులు, కార్యకర్తల్లోనే కాకుండా, సాధారణ జనాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలకు సంబంధించిన కథనాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

గత రెండు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేశ్వర్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశారు. తన నియోజకవర్గంలో పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక చెక్ డ్యాములు నిర్మించి అప్పటి సీఎం కేసీఆర్ మన్ననలు పొందారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దేవరకద్ర పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సైతం ఆయన హయాంలో పూర్తి చేశారు. నియోజకవర్గంలో మృదుస్వభావిగా వెంకటేశ్వర్ రెడ్డికి పేరుంది. దీంతోపాటు 2023 ఎన్నికల్లో కచ్చితంగా దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఆయన గెలుస్తారని భావించారు. కానీ అనూహ్యంగా అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లో ఘాటైన విమర్శలు చేశారు. ఈ మాటల యుద్దానికి బీజం ఇటీవల హైదరాబాద్లో పడింది. అంతకుముందు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయకపోవడం పట్ల ఘాటుగా విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ వెంక టేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జీఎంఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. దేవరకద్ర ఎమ్మెల్యే అనడం కన్నా 1300 ఓట్లతో గెలిచిన గఫ్లత్ ఎమ్మెల్యే అంటే బాగుంటుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటువంటి ఎమ్మెల్యే కల్లు తాగిన కోతి లాగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావును విమర్శించడం దారుణమన్నారు. జీఎంఆర్ తన స్థాయి తెల్సుకోవాలంటూ సెటైర్ వేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. MLA Madhusudhan Reddy vs Alla Venkateswara Reddy.

తాజా మాజీ ఎమ్మెల్యేల రాజకీయ రగడ దేవరకద్ర నియోజకవర్గంలో అగ్గిరాజేసింది. ఎన్నడూ లేని విధంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు రాజకీయ దుమారం రేపాయి. దీనికి కౌంటర్ గా జిఎంఆర్ ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నల్లమట్టి దోచుకున్న ఎమ్మెల్యేగా వెంకటేశ్వరరెడ్డికి పేరుందంటూ కామెంట్ చేశారు. ఇలా వరుస విమర్శలతో దేవరకద్ర రాజకీయం తీవ్ర దుమారం రేపుతోంది. చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న నియోజకవర్గంలో ఇద్దరి మధ్య రేగుతున్న వివాదంపై జనం కూడా జోకులు వేస్తున్నారట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ రచ్చ జరుగుతోందని జనం కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రశాంతంగా రాజకీయాలు నడిపే దేవరకద్ర నియోజకవర్గంలో ఇలాంటి పరిస్తితి ఎప్పుడు రాలేదని జనం చెప్పుకోవడం కొసమెరుపు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q