ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు..? ఆయన బాధ్యతలేంటి..?

Vice President responsibilities: భారత్‌లో రెండో అత్యున్నత స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తోంది ఈసీ. ఈ నేపథ్యంలో హస్తిన రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. వైస్‌ ప్రెసిడెంట్ బరిలోని అభ్యర్థులెవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి అధికరణలు..ఓటింగ్‌ సరళిపై ఓ లుక్‌ వేద్దాం..

భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక మొదట ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా ఇండియా కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపింది. అధికార, విపక్ష పార్టీలు దక్షిణాది రాష్ట్రాల నుంచే తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ఎన్డీయే అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్నారు.

ఆగస్టు 7న ఈసీ ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ జారి చేసింది. ఆగస్టు 21వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 22 నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణ గడువుగా ప్రకటించారు. సెప్టెంబర్ 9న పార్లమెంట్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

భారత రాజ్యాంగంలోని 63వ అధికరణంలో ఉపరాష్ట్రపతి పదవిని ప్రస్తావించారు. ఆర్టికల్ 63 ప్రకారం దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. ఈ పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. అయితే పదవీకాలం ముగిసినా.. మరొకరు పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు పదవిలో కొనసాగవచ్చు. ఆర్టికల్‌ 64 ప్రకారం రాజ్యసభ ఎక్స్‌ అఫీషియెగా ఉపరాష్ట్రపతి ఉంటారు. ఆర్టికల్‌ 65తో తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించవచ్చు. రాష్ట్రపతి గైర్హాజరు, అనారోగ్యం, మరే ఇతర కారణాల వల్ల తన విధులను నిర్వర్తించలేనప్పుడు, ఉప రాష్ట్రపతి వాటిని నిర్వర్తిస్తారు. అలాంటి సమయంలో రాష్ట్రపతికి ఉండే అన్ని అధికారాలు కూడా ఉపరాష్ట్రపతికి ఉంటాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఎ) ప్రకారం, భారత ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్ 2022 ఆగస్ట్‌లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2027 వరకు ఆయనకు పదవీ కాలం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని 63 నుంచి 71వ అధికరణాలతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమాలు- 1974 ప్రకారం ఈ పదవికి ఎన్నుకుంటారు.

ఉపరాష్ట్రపతి పదవి ఖాళీని త్వరగా భర్తీ చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని సెక్షన్ 2 ప్రకారం… ఉప రాష్ట్రపతి మరణం, రాజీనామా, తొలగింపు వంటివి కానీ లేదా మరేదైనా కారణం వల్ల కానీ ఖాళీ ఏర్పడితే భర్తీ చేయడానికి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా నిబంధన ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి 60 రోజులలోపు తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. కానీ ధన్‌ఖడ్‌ ఆకస్మాతుగా రాజీనామా చేశారు. Vice President responsibilities.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎన్నికలు సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. సెప్టెంబర్ 9న ఈ ఎన్నిక జరగనుంది. అదే రోజున భారత 17వ ఉపరాష్ట్రపతి నియమితులవుతారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q