కెమికల్ వద్దు.. మట్టి వినాయకుడే ముద్దు..!

Kadapa’s Palempalli village: ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం కనిపిస్తుంది. ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ – పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం అనాధిగా మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. నిజానికి ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కడప పాలెంపల్లి గ్రామంలో మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేయడంలో చాలా ఫేమస్. గత 40 ఏళ్లుగా ఈ గ్రామంలో పర్యావరణ హితంగా మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. అయితే మట్టి వినాయకుల తయారీలో ముసలం పట్టుకుందా…రాబోయే తరాలకు మట్టి గణపయ్య విగ్రహాలు కనుమరుగవుతాయా అనే టెన్షన్ వీరిలో నెలకొన్నది.

పాలెంపల్లి గ్రామస్తులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందారు, ఇది పర్యావరణానికి అనుకూలమైన పద్ధతి. ఈ విగ్రహాలను తయారు చేయడానికి, వారు సహజమైన మట్టిని, అలాగే రంగులు వేయడానికి సహజమైన పదార్థాలను ఉపయోగిస్తారు. వినాయక చవితి పండుగ సమయంలో, ఈ మట్టి విగ్రహాలను పూజించి, ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వలన పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ సంప్రదాయాన్ని పాలెంపల్లి గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న పాలంపల్లెలోని మట్టి వినాయకుల తయారీలో ముసలం పట్టుకుందా రాబోయే తరాలకు మట్టి గణపతులు కనుమరుగవుతున్నాయా అనే సందేహం కలుగుతుందని కడప జిల్లా వాసులు అంటున్నారు.

ఏళ్ల తరబడి సాగిస్తున్న మట్టి గణపతి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పాలెం పల్లె సమీపానికి చేరుకొని గణేష్ ఉత్సవాల ప్రారంభం అయ్యే కొద్ది రోజులు ముంది నుండే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనిక ఫార్ములా క్యాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేటే. రసాయనాలతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. అందులోనూ ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ కావడంతో మట్టి విగ్రహ తయారీ మరుగున పడవేస్తున్నారని పాలంపల్లె కుమ్మరి కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ రక్షణ కోసం ఎన్నో ఏళ్ల నుండి కులవృత్తిగా చేస్తున్న తమ పనికి అధికారులు కూడా సహకరించడం లేదంటూ వాపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే మరి కొద్ది రోజుల్లో మట్టి గణపతులు కనుమరుగయ్యే అవకాశం ఉందంటున్నారు.

అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనిక ఫార్ము లా క్యాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేటే. విగ్రహాల తయారీలో వాడుతున్న రసాయనాలు, రంగుల వలన నిమజ్జనం చేసిన చెరువు లేదా జలవనరు నీటిరంగు మారుతుంది. ఆ నీరు పంట పొలాల్లో సేద్యపు నీటిగా వాడడం వలన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగు పదార్థాలు పంట పొలాల్లో అవశేషాలుగా ఉండిపోయి సారవంతమైన పంట భూమిని నిర్జీవంగా మారుస్తుంది. నీటిలో పెరిగే అపారమైన వృక్ష సంపద, మత్స్య సంపద, జంతు సంపద నశిస్తుంది. నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. కాలుష్య జలంలోని రసాయన పదార్థాలు ఆహారపు గొలుసు ద్వారా మొక్కలు, చేపలు, పక్షులు మొదలైన వాటిలోనికి ప్రవేశించి చివరికి వాటిని తినడం ద్వారా మానవుని శరీరంలోనికి ప్రవేశిస్తాయి విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక మట్టితో తయారుచేసిన వినాయకుని ప్రతిమ 45 నిమిషాల్లో నీటిలో కరిగినట్లయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు మాత్రం నీటిలో కరగకుండా కొన్ని నెలలపాటు ఉండిపోతాయి. మట్టిగణపతి నీటిలో పూర్తిగా కరిగిపోతుంది కాబట్టి అదేమట్టిని ఉపయోగించి మరుసటి సంవత్సరం కొత్త వినాయకులను తయారు చేసుకోవచ్చు. అంటే రీసైకిల్ చేయవచ్చు. మట్టి వినాయకుడిని పూజించడం ద్వా రా రీసైక్లింగ్ అనే ప్రకృతి విధానాన్ని మనం పాటిస్తున్నాం అన్నమాట. నిమజ్జనం చేసిన ప్లాస్టర్ పారిస్ విగ్రహాలను రీసైకిల్ చేయలేము. ఉదాహరణకు మట్టిలో విత్తనం నాటితే అది మహావృక్షంగా మారుతుంది. మట్టి జీవం పోస్తుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో విత్తనం నాటితే ఆ విత్తనం చనిపోతుంది. మొలకెత్తదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్జీవంగా మార్చే ఒక విష పదార్థం. కాబట్టి మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజిస్తే మంచిదని పాలంపల్లెవాసులు తెలుపుతున్నారు

ఇదిలా ఉండగా మట్టి గణపతి అవగాహన మొక్కుబడిగా పత్రికా ప్రకటనలకే పరిమితం అవడంతోక్షేత్రస్థాయిలో నిర్వాహక మండళ్లు, భక్తుల దృష్టికి చేరడం లేదు. గణేష్ నవరాత్రుల ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే ప్లాస్టరాఫ్ ప్యారిస్ విగ్రహాలను వినియోగించవద్దని సంబంధిత ఉత్సవాల నిర్వాహకులతో అన్ని ప్రధాన పట్టణాల్లో సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చేసిన కసరత్తు నామమాత్రంగాన సాగుతోంది. పర్యావరణాన్ని రక్షించాల్సిన అధికారులే నిమ్మకు నీరు ఎత్తినట్లు ప్రవర్తిస్తుంటే మరి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటూ పాలెం పల్లె గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. Kadapa’s Palempalli village.

వివిధ రకాల కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునేకంటే.. ఉన్నంతలో పండగ చేసుకొని పది మందికి మంచిని పంచిపెట్టడం మేలు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q