లైంగిక ఆరోపణల వ్యవహారంలో కేరళ కాంగ్రెస్ యూత్ లీడర్.!

Kerala Actress Rini George: కేరళ రాజకీయాల్లో కలకలం రేగింది. కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లైంగిక ఆరోపణల వ్యవహారంలో చిక్కుకోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఓ మలయాళ నటి కాంగ్రెస్ యూత్ లీడర్ రాహుల్ మంకూట్టతిల్ పై ఆరోపణలు చేయడంతో.. అతడు పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? యూత్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ పై వచ్చిన ఆరోపణలు ఏంటి? దీనిపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి? కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోనుంది?

కేరళలో మీ టూ ఉద్యమం తర్వాత.. మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మంకూట్టతిల్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. తాజాగా అతడి రాజీనామా నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ కేరళ నటి తన స్నేహితురాలని రాహుల్ చెప్పుకొచ్చాడు. పైగా లైంగిక ఆరోపణల విషయంలో ఆమె తన పేరు చెప్పలేదని.. తనపై ఎక్కడా ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపాడు. అయితే పార్టీ కార్యకర్తలు తనను సమర్థించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. చట్టపరంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని రాహుల్ మంకూట్టతిల్ చెప్పాడు.

అసలు కేరళ సినీ నటి ఏం ఆరోపణలు చేసింది?
మలయాళం నటి రిని అన్ జార్జ్ ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. మూడున్నర సంవత్సరాల క్రితం ఒక యువ రాజకీయ నేత తనకు అనేకసార్లు అభ్యంతరకర సందేశాలు పంపాడని, హోటల్ గదికి రమ్మని ఆహ్వానించాడు అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అతని పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చారని ఆరోపించింద. అయితే ఈ ఆరోపణలు వ్యక్తిగత ద్వేషంతో చేసినవి కావని.. ఇతర మహిళల కోసం తాను మాట్లాడుతున్నా అని, రాహుల్‌ను ఇప్పటికీ స్నేహితుడిగానే భావిస్తున్నానని నటి రిని చెప్పింది.

అయితే కాంగ్రెస్ యూత్ లీడర్ పై మరొకరు కూడా ఆరోపణలు చేశారు. రచయిత హనీ భాస్కరన్ రాహుల్‌పై మండి పడ్డారు. 2025 జూన్‌లో శ్రీలంక ట్రిప్ సందర్భంగా రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ ఫోటోకు కామెంట్ చేశాడని.. మొదట ట్రావెల్ గురించి మాట్లాడినా, అతని సందేశాలు అసభ్యంగా మారాయని తెలిపారు. తాను రిప్లై ఇవ్వండం ఆపేశానని ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాహుల్ ను వివాదాల్లో నెట్టింది. ఇతర పార్టీల నేతలు రాహుల్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఆటు బీజేపీ, సీపీఎం యూత్ వింగ్ డీవైఎఫ్‌ఐ నిరసనలు తీవ్రతరం చేశాయి. పలక్కడ్‌లో రాహుల్ కార్యాలయం వద్ద ర్యాలీలు నిర్వహించి, అతని ఎంఎల్ఏ పదవి రాజీనామా డిమాండ్ చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్‌లో రాహుల్ ఒక మహిళతో మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి, కానీ అది ఫేక్ అని రాహుల్ అన్నాడు.

కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకుంది. కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ మాట్లాడుతూ ఆరోపణల పరిశీలిస్తామని… అవి నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాహుల్‌కు తన వాదన చెప్పే అవకాశం ఇస్తామని, త్వరగా నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మరి కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు. రాహుల్‌ను పార్టీ మెంబర్‌షిప్ నుంచి తొలగిస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

రాహుల్ మంకూట్టతిల్ కేరళలో యువ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 పలక్కడ్ ఉప ఎన్నికల్లో 18,840 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. కేరళ స్టూడెంట్స్ యూనియన్‌తో రాజకీయ జీవితం ప్రారంభించి, 2023లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే ఈ ఆరోపణలు అతని రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. మీ టూ ఉద్యమం, ఇటీవలి హేమా కమిటీ నివేదిక తర్వాత కేరళలో మహిళల భద్రతపై సున్నితమైన పరిస్థితి నెలకొంది. Kerala Actress Rini George.

అటు నటి రిని అన్ జార్జ్ వైఖరి కూడా రాహుల్ పై నేరుగా ఆరోపణలు చేయలేదు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఇతర మహిళల కోసం మాట్లాడుతున్నా. సిస్టమ్‌పై నమ్మకం లేక ఫిర్యాదు చేయలేదు అని చెప్పింది. రాహుల్‌ను ఇప్పటికీ స్నేహితుడిగా భావిస్తున్నానని, ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం కాదని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది కేరళ రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారింది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q