తమిళనాడులో హీరో విజయ్ సింహ నాదం..!

TVK Chief Vijay: తమిళనాడు రాజకీయాల్లో హీరో, రాజకీయ నాయకుడు తలపతి విజయ్ సింహనాదం చేశాడు. మదురైలో జరిగిన తమిళగ వెత్రీ కళగం -TVK రెండో రాష్ట్ర సమావేశంలో సింహం వేటకు వచ్చింది అని గర్జించాడు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో ఈ సమావేశంలో తెలియజేస్తారని ప్రచారం జరిగినా తాము సింగిల్ గానే వెళ్తామని విజయ్ తేల్చి చెప్పేసాడు. వచ్చే ఎన్నికల్లో మదురై తూర్పు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని కూడా ప్రకటించిన విజయ్, బీజేపీ, డీఎంకేలతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశాడు. అసలు సింగిల్ గా పోటీ చేసి విజయ్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? టీవీకే ఒంటరి పోరుతో తమిళనాడు రాజకీయాలు ఎలా మారనున్నాయి?

ఎట్టకేలకు తమిళ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తేల్చి చెప్పేశారు. అంతేకాదు మదురైలో జరిగిన TVK సమావేశంలో విజయ్ ప్రసంగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో కం పొలిటికల్ లీడర్ విజయ్ సినిమా డైలాగులను రియల్ లైఫ్ లో మాట్లాడారు. అడవిలో నక్కలు, ఇతర జంతువులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సింహం ఒక్కటే రాజు. అది గుండెలు బద్దలయ్యేలా గర్జిస్తుంది. సింహం వినోదం కోసం బయటకు రాదు, వేట కోసమే వస్తుంది అని విజయ్ సభలో పంచ్ డైలాగులతో అదరగొట్టారు. ఈ మాటలతో విజయ్ తన రాజకీయ లక్ష్యాలను స్పష్టం చేశాడు. వేలాది మంది TVK కార్యకర్తలను సింహ పిల్లలు అని చెప్పి, తమ పార్టీ ప్రజల కోసం నిజాయతీగా పనిచేస్తుందని, ఇతర పార్టీల్లాంటి రహస్య ఒప్పందాలు చేయదని హామీ ఇచ్చాడు.

మదురై సమావేశంలో వేలాది మంది TVK కార్యకర్తలు హాజరయ్యారు. తమిళనాడు నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశంలో విజయ్ తాను మదురై తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు, మిగతా 9 మదురై నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులకు ఓటేస్తే నాకు ఓటేసినట్లే అని అన్నాడు. తమిళనాడు అంతటా TVK పోటీ చేస్తుందని స్పష్టం చేశాడు. అలాగే పొత్తుల విషయంలో విజయ్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. తాము బీజేపీ, డీఎంకేలతో ఎలాంటి పొత్తు పెట్టుకోమని.. తమ కూటమి స్వాభిమానంతో కూడినదని, స్వార్థపరమైనది కాదు అని స్పష్టం చేశాడు. బీజేపీని విచారధార శత్రువుగా, డీఎంకేని రాజకీయ శత్రువుగా పేర్కొన్న విజయ్, ఫాసిస్ట్ బీజేపీ, విషపూరిత డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడదాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. TVK ఒంటరిగా పోటీ చేసి, తమిళనాడు ప్రజలకు ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా టార్గెట్ చేశాడు. కేంద్రం తమిళనాడు అవసరాలను పట్టించుకోవడం లేదని.. RSS అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తమిళులు బీజేపీ పాలనను ఎప్పటికీ అంగీకరించరని అన్నారు. NEET పరీక్షను రద్దు చేయాలని, కీలడి పురావస్తు ఆవిష్కరణలను దాచిపెట్టారని ఆరోపించాడు. శ్రీలంక నావికాదళం తమిళ మత్స్యకారులను హింసిస్తున్నా కేంద్రం పట్టించుకోకుండా ఉందని, కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తమిళ సంస్కృతి, సామాజిక న్యాయాన్ని కాపాడతామని హామీ ఇచ్చాడు.

డీఎంకే మీద విజయ్ తీవ్ర విమర్శలు చేశాడు. మహిళలు, రైతులు, మత్స్యకారులను మోసం చేసిన స్టాలిన్ బలహీన వర్గాలను దోపిడీ చేస్తున్నాడు అని ఆరోపించాడు. స్టాలిన్‌ను అంకుల్ అని పదేపదే సంబోధించి, యువత మద్దతు కోసం వయసు, శక్తివంతమైన నాయకత్వం అనే అంశాన్ని హైలైట్ చేశాడు. 2026 ఎన్నికలు TVK, డీఎంకే మధ్య పోటీగా ఉంటాయి అని తేల్చి చెప్పేశాడు. డీఎంకే రాజవంశ రాజకీయాలు, అవినీతిపై విజయ్ విమర్శలు చేశాడు.

రాజకీయ విశ్లేషకులు విజయ్ వ్యూహాన్ని స్పష్టంగా చూస్తున్నారు. తన అతిపెద్ద ఫ్యాన్ బేస్, యువత, మహిళల మద్దతును ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. డీఎంకే వ్యతిరేక ఓట్లను, బలహీనమైన AIADMK ఓట్లను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఒంటరిగా పోటీ చేయడం రిస్క్. చిన్న పార్టీలతోనైనా కూటమి అవసరం అని నిపుణులు సలహా ఇస్తున్నారు. TVK ఒంటరిగా 10-12% ఓట్లను సాధించవచ్చని, అయితే అధికారం చేపట్టడానికి అది సరిపోదని అంచనా. TVK Chief Vijay.

2026 ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఎంత ఉంటుందనేది ఆసక్తికరం మారింది. సినిమా ఫ్యాన్ బేస్‌ను రాజకీయ ఓట్లుగా మార్చడం అతని ముందున్న సవాలు. డీఎంకే, AIADMK ఆధిపత్యానికి TVK ప్రత్యామ్నాయంగా నిలబడగలదా అనేది కీలకం. బీజేపీ విజయ్‌ను దూరం పెట్టినా, డీఎంకే, AIADMKలకు వ్యతిరేకంగా TVKను వెనుక నుంచి మద్దతు ఇవ్వవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ను ఎలాగైతే బిజెపి దగ్గరకు చేర్చుకుందాం అదేవిధంగా తమిళనాడులో హీరో విజయ్ బిజెపి చేరదీసేందుకు ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు. దీనికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ తో విజయ్కు ఉన్న సారుప్యతలను చూపిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. తర్వాత కూటమిగా ఏర్పడి ఘనవిజయం సాధించారు. అదేవిధంగా విజయ్ కూడా ఒకసారి అనుభవం అవుతే మారతాడని బిజెపి నేతలు భావిస్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q