ఓ పక్క చర్చలు మరోపక్క దాడులు..!

Russia Ukraine War: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం తర్వాత అంతా శాంతి నెలకొంటుందని అందరూ భావించారు.. అలాస్కాలో మీటింగ్ జరిగి వారం రోజులు గడవకముందే.. రష్యా ఉక్రెయిన్ పై భారీ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గోడౌన్ కూడా ధ్వంసమైంది. ట్రంప్-పుతిన్ శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడులను ఎలా చూడొచ్చు? శాంతి చర్చలకు వస్తూనే దాడులు చేయడం వెనక రష్యా వ్యూహం ఏమిటి? ఈ దాడులు శాంతి చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఈ దాడులపై ఉక్రెయిన్ రియాక్షన్ ఏంటి? అసలు రెండు దేశాలు మధ్య శాంతి నెలకొంటుందా లేదా?

అటు శాంతి చర్చలు ఇటు భీకర దాడులు.. ట్రంతో పుతిన్ సమావేశం జరిగి వారం గడవకముందే ఉక్రెయిన్ పై రష్యా తీవ్రమైన దాడులు చేసింది. దీనిపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. అసలు పుట్టిన మనసులో ఏముందో చెప్పాలని జెలన్ స్కీ ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క చర్చలు జరుపుతూనే.. మరోపక్క రష్యా ఉక్రెయిన్‌పై దాడులు రోజురోజుకూ తీవ్రతరం చేస్తోంది. ఆగస్టు 21 జరిగిన దాడుల్లో రష్యా 574 డ్రోన్లు, 40 మిస్సైళ్లు ప్రయోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళం చెప్పిన లెక్కల ప్రకారం, వీటిలో 546 డ్రోన్లు, 31 మిస్సైళ్లను అడ్డుకున్నారు. కానీ మిగిలినవి ఉక్రెయిన్‌లో 11 చోట్ల లక్ష్యాలను తాకాయి. ఈ దాడి రష్యా యుద్ధ చరిత్రలోనే ఒక రికార్డు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఈ సంవత్సరంలో డ్రోన్ దాడుల పరంగా ఇది మూడో అతిపెద్ద దాడిగా నిలిచింది.

ఈ దాడుల్లో పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, ముకాచేవో నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎల్వివ్‌లో డ్రోన్, మిస్సైల్ దాడుల్లో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నగరం హంగేరీ, స్లోవేకియా సరిహద్దులకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్న అమెరికాకు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గిడ్డంగి పూర్తిగా ధ్వంసమైంది. ఈ కంపెనీకి సైన్యంతో ఎలాంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా పౌర సంస్థ అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అటు రష్యా దాడుల తీరు కూడా మారుతోంది. షాహెద్ అటాక్ డ్రోన్లు, డికాయ్ డ్రోన్లు, Kh-47 కిన్జల్ బాలిస్టిక్ మిస్సైళ్లు, ఇస్కాండర్-M, ఉత్తర కొరియాకు చెందిన KN-23 మిస్సైళ్లను రష్యా వాడుతోంది. ఈ దాడులు వేర్వేరు ప్రాంతాల నుంచి, వివిధ దశల్లో జరుగుతున్నాయి, దీంతో ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి బాగా పెరిగింది.

ఓ పక్కన చర్చలు జరుగుతుండగానే రష్యా దాడులు ఎందుకు చేస్తోంది?
రష్యా ఈ దాడుల వెనుక పెద్ద వ్యూహం ఉంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు పంపే సైనిక సాయాన్ని ఎక్కువగా పశ్చిమ ఉక్రెయిన్‌లో దాచి.. అక్కడి నుంచి పంపిణీ చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సరఫరా మార్గాలను నాశనం చేయడం రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాదు, శాంతి చర్చలకు ముందు తన సైనిక బలాన్ని చూపించి, చర్చల టేబుల్‌పై ఆధిపత్యం సాధించాలని రష్యా భావిస్తోంది. ఈ దాడులు శాంతి కోసం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇవి టెర్రర్ చర్యలు అని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

ఈ దాడులు ట్రంప్-పుతిన్ శాంతి చర్చలకు మూడు రోజుల తర్వాత జరగడం చర్చనీయంశంగా మారింది. ఆగస్టు 18న వైట్‌హౌస్‌లో ట్రంప్, జెలెన్స్కీ, యూరోపియన్ నాయకులు సమావేశమైన తర్వాత రష్యా దాడులు మరింత తీవ్రమయ్యాయి. అలాస్కా సమావేశానికి ముందు కూడా రష్యా ఇలాంటి దాడులు చేసింది. పుతిన్‌కు శాంతి కావాలన్న ఆసక్తి లేదని ఇది చూపిస్తోంది అని జెలెన్స్కీ అన్నారు. ఈ దాడులు శాంతి చర్చలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ప్రపంచ దేశాలు దగ్గరగా గమనిస్తున్నాయి.

రష్యా దాడులపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. రష్యా ఈ దాడులతో అంతర్జాతీయ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తోంది అని ఉక్రెయిన్ అంటోంది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవ్వాలని పశ్చిమ దేశాలపై ఒత్తిడి పెరుగుతోంది. రష్యా విద్యుత్ కేంద్రాలు, పౌర సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరం అని మండిపడుతున్నారు. Russia Ukraine War.

రష్యా ఈ దాడులతో శాంతి చర్చలపై తనకు నిజమైన ఆసక్తి లేదని చూపిస్తోంది. శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రష్యా భారీ దాడులతో సమాధానం చెబుతోంది అని అంటున్నారు. జెలెన్స్కీ, యూరోపియన్ నాయకులు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చినప్పటికీ, పుతిన్ నుంచి పెద్దగా స్పందన లేదు. అయితే మరికొద్ది రోజుల్లో జెలన్ స్కీ, పుతిన్ మధ్య ఫేస్ టు ఫేస్ మీటింగ్ జరుగుతుందని ట్రంప్ అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో రష్యా దాడులు ఈ సమావేశంపై నీలి నీడలు కమ్ముతున్నాయి. రష్యా తీరు ఇలానే ఉంటే ఇక శాంతి చర్చలు ముందుకు కదలవని.. ఈ యుద్ధం ఆగదని యూరోపియన్ నేతలు అంటున్నారు. కానీ రష్యాది కేవలం చర్చల్లో తన ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q