హాలీవుడ్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘SSMB 29’ ఫస్ట్ లుక్..!

‘SSMB 29’ First Look Update: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం తెరకెక్కిస్తున్నారంటే, అందుకు సంబంధించిన అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఆయన సినిమాల విషయంలో అనౌన్స్ మెంట్, ప్రెస్ మీట్ ద్వారా ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచడం పరిపాటి. కానీ ‘SSMB29’ విషయంలో మాత్రం రాజమౌళి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్ మెంట్ జోలికి వెళ్లకుండా, ఎంతో గోప్యతతో షూటింగ్‌ ప్రారంభించారు.

‘SSMB29’ పూజా కార్యక్రమం నుంచి సెట్స్‌ దాకా ప్రతి దశను చాలా రహస్యంగా ఉంచుతూ వస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు, ఆయన బర్త్‌డే అయిన ఆగస్టు 9న అయినా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారేమోనని ఆశించారు. కానీ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే అదేరోజు రాజమౌళి, నవంబరులో ఓ భారీ అప్‌డేట్ రానుందని ప్రకటించారు. ఇప్పుడు అందుకే సిద్ధమవుతున్నారట.‘SSMB 29’ First Look Update

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ‘SSMB29’ నుంచి ఓ భారీ సర్‌ప్రైజ్‌ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ త్వరలో ప్రకటించనున్నారట. ఆ ప్రకటనను కూడా ఓ గ్రాండ్‌ స్కేల్‌లో చేయాలన్నది జక్కన్న ప్లాన్. అందుకోసం ఏకంగా హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ను రంగంలోకి దిగుతున్నారట. అవును, ‘అవతార్’ దర్శకుడి చేతుల మీదుగా SSMB29 టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారు రాజమౌళి.

ఇటీవల ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ అనే కొత్త సినిమా పూర్తి చేసిన కామెరూన్, డిసెంబరు 19న దాన్ని విడుదల చేయనున్నారు. ఆ ప్రమోషన్ కోసం నవంబర్‌లో ఇండియా వచ్చే అవకాశం ఉంది. అదే సమయాన్ని ఉపయోగించుకుని, SSMB29కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను జేమ్స్ కామెరూన్‌ చేతుల మీదుగా విడుదల చేయించాలన్నది జక్కన్న ప్లాన్. ఇదే జరిగితే, ప్రాజెక్ట్ ప్రారంభ దశ నుంచే గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు లభించే అవకాశం ఉంది.

2023లో ఓ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో రాజమౌళి, జేమ్స్ కామెరూన్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కామెరూన్ ‘RRR’ను చూసి ప్రశంసలు కురిపించడమే కాదు, “మీరు హాలీవుడ్‌లో సినిమా తీయాలనుకుంటే మాట్లాడుకుందాం” అని కూడా తెలిపారు. ఆ కలయిక ఇప్పుడు మరో ప్రత్యేక దశకు చేరినట్టు కనిపిస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ చేతుల మీదుగా సౌత్‌ మాస్‌ హీరో మహేష్ బాబు సినిమాకు ఫస్ట్‌లుక్, టైటిల్ విడుదల అవుతుంటే… అంతకన్నా పెద్ద ఇంటర్నేషనల్ సెన్సేషన్ ఇంకేముంటుంది? త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.