శ్రీలంక మాజీ రాష్ట్రపతి రనిల్ విక్రమసింఘే అరెస్ట్..!

Ranil Wickremesinghe arrest: శ్రీలంక మాజీ రాష్ట్రపతి రనిల్ విక్రమసింఘే అరెస్ట్ వార్త సంచలనం రేపింది. భార్య ప్రైవేటు ప్రోగ్రాం కోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై CID ఆయనను అదుపులోకి తీసుకుంది. అసలు విక్రమ సింఘే ఏం తప్పు చేశారు? ఆయన అరెస్ట్ వెనుక కథేంటి? ఈ ఆరోపణలు రాజకీయంగా చేసినవా.? దీని వెనుక కుట్ర ఏమైనా ఉందా..?

శ్రీలంక మాజీ రాష్ట్రపతి రనిల్ విక్రమసింఘే చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. రనిల్ విక్రమసింఘేను శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ -CID అరెస్ట్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో లండన్‌లోని వుల్వర్‌హాంప్టన్ విశ్వవిద్యాలయంలో తన భార్య, ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘే గౌరవ డాక్టరేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్యూబాలో జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశం నుంచి తిరిగి వస్తూ మార్గమధ్యలో విక్రమసింఘే లండన్‌లో ఆగారు. ఈ ప్రైవేట్ టూర్ కోసం రనిల్ ప్రభుత్వ నిధులను ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన బాడీగార్డ్‌ల ఖర్చులు కూడా ప్రభుత్వం భరించిందని సీఐడీ చెబుతోంది. రనిల్ మాత్రం తన భార్య యాత్ర ఖర్చులను ఆమె సొంతంగా భరించారని, ప్రభుత్వ నిధులను ఉపయోగించలేదని వాదించారు.

రనిల్ విక్రమసింఘే శ్రీలంక రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన నాయకుడు. 1977లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆయన, ఆరు సార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా, 2022 నుంచి 2024 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. 2022లో గోటబాయ రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత, ఆర్థిక సంక్షోభం మధ్య దేశాన్ని స్థిరీకరించేందుకు ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడిగా, ఆయన 1994 నుంచి పార్టీని నడిపిస్తూ, అవినీతిని నిరోధించేందుకు క్రమశిక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, లెఫ్ట్ పార్టీ నాయకుడు అనుర కుమార దిస్సానాయకే రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రనిల్ హయాంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆయనపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

రనిల్ విక్రమసింఘే 2022-2024 మధ్య రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 23 విదేశీ యాత్రలు చేశారు. వీటి వల్ల శ్రీలంక ప్రభుత్వానికి 600 మిలియన్ రూపాయల ఖర్చు అయినట్లు లెక్కలు చెబుతున్నారు. అయితే 2023 సెప్టెంబర్‌లో లండన్ టూర్ విషయంలోనే వివాదం రేగింది. CID ఈ యాత్రను ప్రైవేట్ టూర్ గా భావిస్తోంది, ఎందుకంటే ఇది రాష్ట్రపతి అధికారిక విధులకు సంబంధం లేని కార్యక్రమం. ఈ కేసులో రనిల్ సిబ్బంది, మాజీ ప్రెసిడెన్షియల్ సెక్రటరీ, మాజీ ప్రైవేట్ సెక్రటరీని కూడా CID ప్రశ్నించింది. ఈ ఆరోపణలు శ్రీలంకలో అవినీతిపై కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రపతి అనుర కుమార దిస్సానాయకే ప్రభుత్వం యాంటీ-కరప్షన్ డ్రైవ్‌లో భాగంగా చూడబడుతున్నాయి.

ఈ ఆరోపణలు నిజమైనవా.. రాజకీయంగా చేసినవా?
ముఖ్యంగా రనిల్ ఓడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ఎజెండాను బలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పింది. అనుర కుమార దిస్సానాయకే సెప్టెంబర్ 2024లో రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత, అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసు దానిలో భాగంగా పెట్టిందనే అంటున్నారు. కానీ రనిల్ మద్దతుదారులు దీనిని రాజకీయ కుట్రగా భావిస్తున్నారు. రనిల్ హయాంలో IMF నుంచి 2.9 బిలియన్ డాలర్ల బెయిల్‌ఔట్ సాధించడం, ఆర్థిక స్థిరీకరణ చర్యలు తీసుకోవడం వంటి విజయాలను వారు గుర్తు చేస్తున్నారు.

ఈ కేసు శ్రీలంక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
రనిల్ విక్రమసింఘే అరెస్ట్ శ్రీలంక రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. శ్రీలంక చరిత్రలో మాజీ రాష్ట్రపతిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి, ఇది ఉన్నతాధికారులపై జవాబుదారీతనాన్ని పెంచే సంకేతంగా ఉంది. UNP మద్దతుదారులు దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా చూస్తుండగా, కొత్త ప్రభుత్వం దీనిని అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. 2022 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల్లో అవినీతిపై ఉన్న ఆగ్రహం ఈ కేసుకు మరింత ప్రాముఖ్యతను ఇస్తోంది. కొందరు రనిల్‌ అరెస్ట్‌ను అన్యాయమని విమర్శిస్తున్నారు, మరికొందరు అవినీతిపై కఠిన చర్యలను సమర్థిస్తున్నారు. Ranil Wickremesinghe arrest.

ఈ కేసులో ఏం జరగవచ్చు?
రనిల్ విక్రమసింఘేను కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత, కోర్టు ఆయనను రిమాండ్‌లో ఉంచాలా, బెయిల్‌పై విడుదల చేయాలా, లేక ఛార్జీలు నమోదు చేయాలా అని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఛార్జ్‌షీట్ బయటపెట్టలేదు, కానీ CID దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు గత ఏడాది జూన్ లో కోర్టు ముందుకు వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఒకవేళ ఆయనపై నేరం నిరూపితమైతే, శ్రీలంక చట్టాల ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే, రనిల్ రాజకీయ ప్రభావం, UNP మద్దతు ఈ కేసు పురోగతిని ప్రభావితం చేయవచ్చు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q