హింట్ ఇచ్చేశారుగా!

Madurai East constituency: తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ ఓ ప్రభంజనం. రాజకీయంగా కాకపోయినా.. కనీసం పాపులారిటీ విషయంలో అయినా ఆయన మిగిలిన వారి కన్నా ఒక మెట్టుపైనే ఉంటారు. పార్టీ పెట్టిన రోజు ఎలాంటి ఉత్సాహంతో కనిపించారో.. ఇప్పుడు కూడా అదే పవర్‌ కనిపించింది ఆయనలో. మధురై మానాడు సభ.. అభిమానులతో కిక్కిరిసిపోయింది. దళపతి నినాదాలతో హోరెత్తింది. అయితే ఈ బలప్రదర్శన ఓట్లుగా కన్వర్ట్‌ అవుతుందా? అసలు విజయ్‌ ప్రజల్లోకి ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు?

మధురై మానాడు పేరుతో నిర్వహించిన ఈ సభకు 4 లక్షల మంది వచ్చారు. సిద్ధం సభల మాదిరిగా.. ఇక్కడ కూడా విజయ్‌ ప్రజల్లోకి ఓ ర్యాంప్‌ను వేసి.. అందరికీ అభివాదం చేశారు. విజయ్‌ తాను సింహంలా సింగిల్‌గా వస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఒక్కసారి సింహం గర్జిస్తే 8 కిలోమీటర్లమేర భూమి వణికిపోతుందన్నారు. అడవుల్లో ఎన్నో తోడేళ్లుంటాయి కాని.. ఒకటే సింహం ఉంటుందంటూ.. ఫ్యాన్స్‌ను సినిమాటిక్‌ డైలాగ్స్‌తో ఉర్రూతలూగించారు.

సభ ముందు వరకు బీజేపీతో పొత్తు అనౌన్స్‌ చేస్తారన్న ఊహాగానాలున్నాయి కాని.. ఆయన వేదికపైకి వచ్చాక తన భావజాలం బీజేపీకి వ్యతిరేకం అంటూ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉండదు ఉండబోదన్నారు విజయ్‌. అంతేకాదు డీఎంకే ప్రధాన రాజకీయ శత్రువుగా చెబుతూ.. అంకుల్‌ స్టాలిన్‌ అంటూ పంచ్‌లు విసిరారు.

అలంగానల్లూరు జల్లికట్టు సాక్షిగా.. మధుర మీనాక్షి సాక్షిగా.. దివంగత ఎంజీఆర్‌ రాజకీయ స్ఫూర్తితో.. మరో ఎంజీఆర్‌గా పేరుపొందిన విజయ్‌కాంత్‌ గడ్డపై నుంచి తన రాజకీయ గర్జన చేస్తున్నానంటూ అక్కడి కల్చర్‌ని ఎత్తిచూపారు.

తనను ఎంతగా విమర్శిస్తే అంతగా ఎదుగుతానని టీవీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ అగ్ర నటుడు విజయ్ పేర్కొన్నారు. తమ భావజాల శత్రువు బీజేపీ, రాజకీయ విరోధి డీఎంకే అని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, తమ పార్టీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తడతామని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కులం కాదు.. మతం కాదు తమిళుడికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన ఉద్ఘాటించారు. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. మనం ఆరెస్సెస్ ముందు ఎందుకు తలవంచాలని ఆయన ప్రశ్నించారు. తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

1967, 1977లో ఎలా అయితే రాజకీయ మార్పులు జరిగాయో.. 2026లోనూ అదే రిపీట్‌ అవుతుందన్నారు విజయ్‌. ఇక బీజేపీ తమిళనాడు ముస్లింలను టార్గెట్‌ చేయడం, తమిళ జాలర్లను నిర్లక్ష్యం చేయడం, అసలు తమిళ కల్చర్‌నే అణచివేయాలని చూస్తోందంటూ విమర్శల దాడి చేశారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం ప్రజలను పాలించడానికి వచ్చిందా… మైనార్టీలను అణచివేయడానికి అధికారం చేపట్టిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. నీట్‌ రద్దునూ సమర్ధించారు విజయ్‌. ఇక డీఎంకే అధినేత సీఎం స్టాలిన్‌పైనా పంచ్‌ల వర్షం కురిపించారు. అంకుల్‌ అంటూ వ్యంగ్యంగా సంభోదించారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగ సమస్య, లిక్కర్‌ స్కాం వంటి ఆరోపణలు ఉన్న డీఎంకే నేతలు మిస్టర్‌ క్లీన్‌ ఎలా అవుతారంటూ విమర్శించారు.

తాను సినిమాల్లో అవకాశాలు లేక రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజా సేవకోసం వస్తున్నానన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నా మార్క్‌ క్లీన్‌ గవర్నెన్స్‌ ఏంటో చూపిస్తాననన్నారు విజయ్‌. వచ్చే ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో నిలబడేది తానే అని.. ఓటు వేసేటపుడు తన ఫేస్‌ మాత్రమే గుర్తుండాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రజలు ధైర్యంతో ఓటేయాలని.. అప్పుడే మనం విజయం సాధిస్తాం అంటూ చెప్పారు.

కచ్చతీవులకు శ్రీలంక నుంచి స్వేచ్ఛ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఢిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఆయన పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. 2024 ఫిబ్రవరిలో టీవీకేను స్థాపించినప్పటి నుంచి భారీ సభను నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది విల్లుపురం జిల్లాలోని విక్రవందిలో మొదటి సభను నిర్వహించారు.

మధురై తూర్పు నుంచి పోటీ చేసేందుకు విజయ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని మహిళలు ద్రవిడ పార్టీల పట్ల అసంతృప్తితో ఉన్నారని, విజయ్‌కే ఓటు వేస్తామని చెబుతున్నట్లు నేరుగా టీవీకే అధినేతనే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

అయితే విజయ్ ఎంచుకున్న మధురై తూర్పు నియోజకవర్గం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తరచుగా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించే ‘బెల్‌వెదర్’గా ఈ నియోజక వర్గం పరిగణించబడుతుంది. గతంలో ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీలే చెన్నైలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్న నమ్మకం బలంగా ఉంది. ఈ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే.. విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలనే సూచనకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. Madurai East constituency.

మొత్తం నాలుగు లక్షల మంది అభిమానులు, సపోర్టర్ల మధ్య జరిగిన తమిళ వెట్రి కళగం మధురై మానాడు సభ హిట్‌ అనే చెప్పాలి. అయితే ఈ సపోర్ట్‌ ఎంతవరకు ఓట్లుగా మారతాయన్నది ఆసక్తికరం. మరి విజయ్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే సీఎం అవుతారా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.