అద్భతం సృష్టించిన ఇస్రో.. మన టెక్నాలజీ చూసి నాసా షాక్..!

ISRO Technology: ఇస్రో అంతరిక్ష రంగంలో దూసుకుపోతోంది. భారత్ సొంతంగా అంతరిక్షంలోకి మానవులను పంపే ప్రయోగానికి సంబంధించి చాలా కీలకమైన ప్రయోగం నిర్వహించింది. త్వరలో భారత్ గగన్ యాన్ మిషన్ నిర్వహించనుంది. ఈ గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి క్రూ మాడ్యూల్ మొదటి ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. అసలు ఈ టెస్ట్ ఎలా జరిగింది? ఇది గగన్‌యాన్ మిషన్‌కు ఎలా ఉపయోగపడుతుంది? ఇస్రో రాబోయే పరీక్షలు ఏమిటి? భారత్ అంతరిక్ష భవిష్యత్ ప్రణాళికలు ఏవి? ప్రధాని మోదీ, శుభాంశు శుక్లా భారత అంతరిక్ష యాత్రల గురించి ఏం చెప్పారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో నిర్వహించిన మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ పరీక్షలో క్రూ మాడ్యూల్‌ను పారాచూట్ వ్యవస్థతో పరీక్షించారు. ఒక విమానం నుంచి నిర్దిష్ట ఎత్తులో మాడ్యూల్‌ను వదిలి, పారాచూట్ సిస్టమ్ ద్వారా సురక్షితంగా ల్యాండ్ చేశారు. రెండు పారాచూట్‌లను ఉపయోగించి, ఒకటి విఫలమైనా మరొకటి సురక్షిత ల్యాండింగ్‌ను నిర్ధారించేలా రూపొందించారు. మాడ్యూల్ వేగాన్ని క్రమంగా తగ్గించి, సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. భారత నావికాదళం బంగాళాఖాతంలో మాడ్యూల్‌ను రికవరీ చేసింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్, పారాచూట్ డిజైన్, రికవరీ విధానాన్ని సురక్షితంగా టెస్ట్ చేశారు.

ఈ టెస్ట్ గగన్‌యాన్ మిషన్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ గగన్‌యాన్ మిషన్‌కు కీలకమైన మైలురాయి. గగన్‌యాన్ భారత్‌ను రష్యా, అమెరికా, చైనా తర్వాత స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర సామర్థ్యం ఉన్న నాల్గవ దేశంగా నిలబెడుతుంది. క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురావడానికి అవసరమైన పారాచూట్ సిస్టమ్, రీ-ఎంట్రీ స్టెబిలైజేషన్, రికవరీ ప్రక్రియలను ఈ టెస్టు ద్వారా తెలుసుకున్నారు. అంటే మానవులు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో క్రూ మాడ్యూల్ ల్యాండింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే వ్యోమగాముల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే క్రూ మాడ్యూల్ ఎర్త్ రీ ఎంట్రీ టెస్ట్ ఎంతో ముఖ్యం. మాడ్యూల్ హీట్ షీల్డ్, బ్రేకింగ్ సిస్టమ్, ఫ్లోటేషన్ డివైస్‌ల సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. 2026లో జరగనున్న మానవ సహిత గగన్‌యాన్ మిషన్‌కు ఈ ఫలితాలు వ్యోమగాముల రక్షణకు ఉపయోగపడే టెక్నాలజీ పనితనాన్ని తెలియజేశాయి.

ఫ్యూచర్ పరీక్షలు ఏమిటి?
ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయం తర్వాత, ఇస్రో గగన్‌యాన్ కోసం మరిన్ని కీలక పరీక్షలను ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ లో మొదటి అన్‌మ్యాన్డ్ మిషన్ లాంచ్ చేయనున్నారు. ఇందులో క్రూ మాడ్యూల్‌ను 400 కిలోమీటర్ల ఎత్తులో లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపి, సురక్షితంగా తిరిగి తీసుకువస్తారు. ఈ మిషన్‌లో మైక్రోగ్రావిటీ, రీ-ఎంట్రీ హీట్, రేడియేషన్ ఎక్స్‌పోజర్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. వ్యోమమిత్ర అనే ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్‌ను కూడా పంపనున్నారు, ఇది రేడియేషన్, మైక్రోగ్రావిటీ ప్రభావాలను ట్రాక్ చేస్తుంది. 2026లో మరో రెండు అన్‌మ్యాన్డ్ మిషన్‌లు నిర్వహించి, అన్ని సిస్టమ్‌ల సామర్థ్యాన్ని ధృవీకరిస్తారు. ఇవి విజయవంతమైతే, 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మానవ సహిత మిషన్ లాంచ్ అవుతుంది.

భారత్ భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు ఏంటి..?
గగన్‌యాన్ మిషన్ భారత అంతరిక్ష రంగంలో మొదటి అడుగు మాత్రమే. ఇస్రో దీర్ఘకాలిక లక్ష్యాల్లో 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం, 2040 నాటికి మానవ సహిత చంద్రయాన్ మిషన్, భవిష్యత్తులో గ్రహాంతర యాత్రలు ఉన్నాయి. 2028 నాటికి అంతరిక్ష స్టేషన్ మొదటి మాడ్యూల్ ఆర్బిట్‌లోకి పంపడం లక్ష్యంగా ఉంది. చంద్రయాన్-4, NISAR వంటి మిషన్‌లు భారత్ అంతరిక్ష సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి. గగన్‌యాన్ ద్వారా స్వదేశీ రాకెట్ తో మానవులను అంతరిక్షంలోకి పంపే సామర్థ్యాన్ని సాధిస్తామని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలు భారత్‌ను అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయి శక్తిగా నిలబెడతాయి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తాయి.

భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష మిషన్ల కోసం పెద్ద ఎత్తున వ్యోమగాములను సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగం కావాలని జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు, విద్యార్థులు, విధానకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. మనం చంద్రుడు, అంగారకుడిని చేరుకున్నామని.. ఇప్పుడు అనేక రహస్యాలు దాగున్న రోదసిలోని సుదూర తీరాలపై పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. దానివల్ల భవిష్యత్తు తరాలకు మరిన్ని వెలుగులు ప్రసాదించే అవకాశం దక్కుతుందన్నారు. అంతరిక్ష రంగంలో ఒకదాని తర్వాత మరో విజయం మనకు, మన శాస్త్రవేత్తలకు సులభమైందన్నారు. ఏ సరిహద్దూ చివరిది కాదని మనకు విశ్వం చెబుతోంది అని మోదీ పేర్కొన్నారు. 2040లో భారత్‌ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వికసిత్‌ భారత్‌ ఖ్యాతిని చాటుతారని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే స్థితికి మనం చేరుకోగలమా అని అంతరిక్ష శాస్త్రవేత్తలను ఆయన ప్రశ్నించారు. అటు ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా దేశం లిఖిస్తున్న అధ్యాయానికి గగన్‌యాన్‌ మిషన్‌ మొదటి అడుగని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌కు చెందిన శుభాంశు అంతరిక్షంలో రైతుగా మారారని అన్నారు. ఐఎస్‌ఎస్‌లో గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను వేసి..జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని అధ్యయనం చేశారని గుర్తు చేశారు.

శుభాన్షు శుక్లా ఏమంటున్నారు?
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంటున్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణను ఇచ్చినందుకు ఐఏఎఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఏఎఫ్‌, కాక్‌పిట్‌ మాత్రమేనన్నారు. వాటి నుంచే అంతరిక్ష యాత్రకు అవసరమయ్యే చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. భవిష్యత్తులో భారత్‌ చేపట్టనున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని.. చాలామంది శాస్త్రవేత్తలు ఇందులో భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అంతరిక్షం నుంచి భారత్‌ ఎంతో అందంగా కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు. జీవితంలో తాను చూసిన అద్భుత దృశ్యాలలో అదీ ఒకటన్నారు. ISRO Technology.

చంద్రయాన్-3తో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్, ఆదిత్య-L1తో సౌర అధ్యయనం, ఇప్పుడు గగన్‌యాన్‌తో మానవ అంతరిక్ష యాత్ర వరుస ప్రయోగాలతో… భారత్ అంతరిక్షంలో పవర్‌హౌస్‌గా మారుతోంది. ఇస్రో స్వదేశీ సాంకేతికత, నాసా, స్సేప్ ఎక్స్ వంటి సంస్థలతో సహకారం, శుభాంశు శుక్లా వంటి వ్యోమగాముల అనుభవం భారత్‌ను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలబెడుతోంది. ఈ విజయాలు భారత యువతకు స్ఫూర్తినిస్తూ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి.