
AP Deputy CM Pawan Kalyan: ఒంటరిగా నిలబడి..ఒక్కడై పోరాడి..కూటమితో జతకట్టి..గెలుపులో కీలక పాత్ర పోషించి..సత్తా చాటిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జనసేన భవిష్యత్‌పై సీరియస్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం, పాలన మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు పవన్. ఇప్పుడు విశాఖ వేదికగా అతిపెద్ద సభకు ప్లాన్ చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ నెల 30న విశాఖలో 15వేల మంది జనసైనికులతో మహాసభ పెడుతున్నారు. జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున సభకు తరలి రానున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఆగస్ట్ 30న సభ. మధ్యలో ఒక్క రోజు గ్యాప్‌లో రెండు పెద్ద ఈవెంట్లు ఉన్నాయి.
జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలో ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని, జనసేనాని ఎలాంటి వ్యూహాలను రచిస్తారోనన్న ఉత్కంఠ రేపుతోంది. విశాఖ సభతో జనసేన భవిష్యత్ ప్లాన్ ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక పాయింట్ కి వస్తే విశాఖలో పవన్ కళ్యాణ్ తన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఆయన విశాఖలో బస చేయనున్నారు. అయితే పవన్ విశాఖ వస్తున్న సమయం సందర్భాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా గట్టి హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు పవన్ చాలా సార్లు విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఏపీ వ్యాప్తంగా డిజిటల్ కాంపెయిన్ అని 2021 డిసెంబర్ లో మూడు రోజుల పాటు ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ వేదికగా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో తమ గళం విప్పాలని ఆయన ఆనాడు కోరారు. ఇపుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా కూటమి ఎంపీలు ఏమి చేస్తున్నారు అని ఉక్కు కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లోని 32 కీలక విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి యాజమాన్యం నిర్ణయం అయితే తీసుకుంది. దాంతో కార్మిక లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోల్ సేల్ గా ప్రైవేట్ చేయకుండా రిటైల్ గా ప్రైవేట్ పరం చేస్తోందని దీని ద్వారా ఉద్యమం నీరు కార్చాలన్న వ్యూహం ఉందని కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పార్టీ తరఫున ప్రకటన చేయాల్సిందే అంటున్నారు. AP Deputy CM Pawan Kalyan.
పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు మీద స్పందించాల్సిందే అన్నది ప్రజా సంఘాలు మేధావుల నుంచి వస్తున్న మాట. దాంతో విశాఖలో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండే పవన్ 30న జరిగే బహిరంగ సభలో అయినా ఈ విషయం మీద మాట్లాడుతారా అన్న ఆసక్తి పెరుగుతోంది. పవన్ ప్రకటన కోసం అయితే ఉక్కు కార్మిక లోకం వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. మరి పవన్ ఏం చెబుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q