
Trump Tariff Update: ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడల్ ఎత్తిస్తున్నారు. ఇక రష్యాను అయితే చెప్పక్కర్లేదు బద్ధశత్రువుగానే చూస్తున్నారు. ఇక ఆదేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న ప్రత్యేకించి క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాల్నింటిపైనా ట్రంప్ కొరడా ఝుళిపిస్తోన్నారు. ఇక ఇదే క్రమంలో భారత్ పై ఇప్పటికే 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు. ముందుగా 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ ఆ తరువాత మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. దీంతో భారత్ పై 50 శాతం టారిఫ్ భారం పడింది.
అయితే ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి ట్రంప్ మరో ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. భారత్ పై విధించిన టారిఫ్ మొత్తాన్ని 50 శాతానికి పెంచడానికి గల కారణాలు ఏంటో వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లివిట్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కొనసాగించకుండా నిరోధించడంలో భాగంగా భారత్ పై అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అదనంగా విధించిన 25 శాతం టారిఫ్ ను అమలు పర్చడానికి ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా జారీ చేసింది. ఈ అదనపు టారిఫ్ ను వసూలు చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. రేపు అర్థరాత్రి 12:01 నిమిషాల నుంచి టారిఫ్ అమలులోకి వస్తుంది.
ఈ మేరకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం నోటీసు జారీ చేసింది. ఈ 25 శాతం అదనపు టారిఫ్ విధించడానికి గల కారణాలను ఇందులో స్పష్టంగా పొందుపరిచింది కూడా. రష్యా నుండి అమెరికాకు ముప్పు పొంచివున్న కారణంగా ఈ కొత్త టారిఫ్ విధించాల్సి వచ్చిందని వివరించింది. రష్యాను నియంత్రించడంలో భాగంగా భారత్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
భారత్ నుండి దిగుమతి చేసుకునే అన్నిరకాల ఉత్పత్తులు, వస్తువులపై విధించిన అదనపు 25 శాతం టారిఫ్.. రేపు తెల్లవారుజామున 12:01 ఈస్ట్ డే-లైట్ సమయం నుండి అమలులోకి వస్తాయని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తేల్చి చెప్పింది. ఈ నెల 6వ తేదీన డొనాల్డ్ ట్రంప్ సంతకంతో జారీ అయిన నంబర్ 14329 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఈ కొత్త సుంకం వర్తిస్తుంది. అయితే.. ఈ తేదీకి ముందు బయలుదేరి 2025 సెప్టెంబర్ 17 కి ముందు అమెరికాకు చేరుకున్న వస్తువులు ఈ సుంకం నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఉన్న పన్నులకు ఈ సుంకం అదనమని.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు ఇస్తామని యూఎస్ ప్రకటించింది. Trump Tariff Update.
ఇప్పటివరకు కూడా చైనా సహా రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోన్న ఇతర దేశాలపై అమెరికా ఈ అదనపు టారిఫ్ ను విధించకపోవడం, భారత్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q