జూబ్లిహిల్స్ ఉప పోరు…!!

Jubilee Hills By Election Date: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్ వేస్తుందా… గెలుపు ఇప్పుడు పరువు ప్రతిష్టలుగా మారిపోయిందా…అందుకే కాంగ్రెస్ పార్టీ అందరికంటే కసరత్తు మొదల పెట్టేసిందా….ఇంతకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రణాళికలు ఎలా ఉన్నాయి. పార్టీ వర్గాలు ఏమంటున్నారు. అసలు కాంగ్రెస్ వేసిన స్కెచ్ ఏంటీ…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందని సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొనుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఒక రకమైన ట్రైలర్‌గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో పలువురు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

గత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి ఓడిన అజహరుద్దీన్ తో పాటు మరికొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ క్రమంలో భారీ బహిరంగ సభ నిర్వహించి సమరభేరికి సిద్దమని చాటి చెప్పాలిని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నెల 30వ తేదీన జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో సహా, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హాజరు అయ్యే అవకాశం ఉంది.

హైకమాండ్ పిలుపులో భాగంగా ‘‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’’ నినాదంతో రాహుల్ యాత్రకు సంఘీభావంగా జూబ్లీహిల్స్ లో ఈ సభను నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధికారికంగా ప్రకటించినా.. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేసి, వారిలో జోష్ నింపేందుకే ఈ సభను పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితమే జూబ్లీహిల్స్ లో కూడా రిపీట్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్ దే అనే సిగ్నల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం ముగ్గురు మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ఇన్​చార్జ్​లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో మంత్రి రెండు డివిజన్ల బాధ్యతలు చూస్తూ బూత్ స్థాయి సమావేశాలతో పార్టీ క్యాడర్లో జోష్ తీసుకువస్తున్నారు. అలాగే బస్తీల బాట పడుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. బీహార్ ఎన్నికలతో పాటే ఈ ఉప ఎన్నిక అక్టోబర్ లో జరుగనుందని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశగా తమ ప్రచార స్పీడప్​చేసింది.

ఇప్పటి వరకు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు, బస్తీబాటతో జనం సమస్యలు తెలుసుకున్న పార్టీ నేతలు, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో సభ ఏర్పాటు చేసి పార్టీకి అనుకూల వాతావరణం తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానుండడంతో కాంగ్రెస్ కు కొంత వరకు ఊపు వచ్చే అవకాశం లేకపోలేదు. అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా.. అభ్యర్థి ఎవరనేది కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యండి అనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తున్నది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం తాజాగా నోడల్ అధికారులను నియమించింది. ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్.వి కర్ణన్ నోడల్‌ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని నోడల్ అధికారిగా నియమించిది ఈసీ. అలాగే ఈవీఎం, వివిప్యాట్ నిర్వహణ కోసం కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌవన్ ను, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సి.టి.ఓ శ్రీనివాస్ ను, ట్రైనింగ్ అధికారిగా ఎల్‌.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను, మెటీరియల్ మేనేజ్మెంట్ బాధ్యతలు అడ్మిన్ అదనపు కమిషనర్ కె. వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు తో పాటు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కూడా చేపట్టారు. ఇప్పుడు ఉప ఎన్నికను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వివిధ రకాల పనుల నిమిత్తం జిల్లా ఎన్నికల అధికారి నోడల్ ఆఫీసర్లను కూడా నియమించింది. వచ్చే నెలాఖరులో ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. Jubilee Hills By Election Date.

ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ, ప్రధాన పార్టీలన్నీ ముందస్తుగానే కార్యాచరణను ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ ఉప ఎన్నిక రాజకీయంగా కీలకంగా మారింది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q