సెల్యూట్ సిస్టర్స్…!

4 Government Employee Sisters: సాధారణంగా ఆడపిల్లలు పుట్టగానే చదువు కంటే ముందుగా పెళ్లి చేసేయాలి అని అనుకునే తల్లిదండ్రులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నారు. కానీ ఈ తల్లి మాత్రం అందుకు భిన్నం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ పరిస్థితి. భర్త చనిపోయి దశాబ్ద కాలమైంది. పూట గడవటమే కష్టమైన పరిస్థితులు..అయినా తన బిడ్డల బంగారు భవిష్యత్తే ముఖ్యమనుకుంది. శక్తికి మించి చదివించింది ఆ మాతృమూర్తి. కుటుంబ పరిస్థితుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు కష్టపడి చదివారు. ప్రస్తుతం ఇంట్లో ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే కష్టం అని అనుకునే రోజులు. అలాంటిది ఒకే కుటుంబం నుంచి నలుగురు అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ కొలువులు సాధించి తమ తల్లి కష్టం వృధా కాలేదని నిరూపించారు. కష్టపడి చదివితే, క్రమశిక్షణతో ముందుకు వెళ్తే విజయం తప్పక వరిస్తుంది అని నిజం చేసి చూపించారు ఈ అక్కాచెల్లెళ్లు. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ అక్కాచెల్లెళ్ల వీరి విజయగాథను మనమూ తెలుసుకుందాం పదండి.

ఉద్యోగం పురుష లక్షణం అనే నానుడిని తిరగరాశారు ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు. పేద కుటుంబంలో పుట్టినా ప్రభుత్వ కొలువులు సాధించి శెభాష్ అనిపించుకున్నారు. ఏదైనా సాధించాలని అనుకుని పరిస్థితులకు సర్దుకుపోయి భవిష్యత్తును పక్కన పెట్టే ఎంతో మంది అమ్మాయిలకు.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. పేద కుటుంబంలో జన్మించిన ఈ సరస్వతీ పుత్రికలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, వేపమాకులపల్లికి చెందిన మునివెంకటప్ప, గౌరమ్మ దంపతులకు నలుగురు సంతానం. గౌరమ్మ జీవితంలో పదేళ్ల క్రితం పెద్ద విషాదం చోటుచేసుకుంది. భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో చిన్న వయసులోనే ఆమె ఒంటరిగా కుటుంబ బరువు మోయాల్సి వచ్చింది. దినసరి కూలీగా పని చేస్తూ పిల్లలను పెంచి, పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించింది. ఏ విషయంలోనూ పిల్లలకు లోటు చేయలేదు. వారు ఆకలితో ఉండకుండా చూసుకుంటూనే, చదువుకు ఎప్పుడూ రాజీ పడలేదు. చదువుతోనే మన జీవితాలు మారుతాయి అని తన కూతుర్లకు చెబుతూ వచ్చేది గౌరమ్మ. ఆ తల్లి మాటలు వృథా కాలేదు.ఆమె నలుగురు కూతుళ్లు చదువుతోనే పేదరికాన్ని జయించారు. గౌరమ్మ పేరును, వంశ గౌరవాన్ని నిలిపారు.

గౌరమ్మ పెద్ద కూతురైన వీణా కుమారి 2014లో ఉమెన్ పోలీస్ గా ఉద్యోగంలో చేరారు.ప్రస్తుతం పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ కుటుంబానికి మొదటి ఆశగా ఆసరాగా నిలిచారు. రెండో కూతురు వాణి 2016లో SGT టీచర్ గా ఎంపికైంది. ఇక కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అమ్మాయిని కానిస్టేబుల్, టీచరుగా చేస్తున్న అమ్మాయిని టీచరే వివాహం చేసుకోవడం ఆ తల్లికి మరింత సంతోషాన్నిచ్చింది. మిగిలిన ఇద్దరు అమ్మాయిలూ ఉద్యోగాలు సాధిస్తే బాగుంటుందని అల్లుళ్లూ ప్రోత్సహించారు. గత నెలలో విడుదలైన పోలీస్‌ ఉద్యోగాల ఫలితాల్లో మూడో కూతురు వనజాక్షి కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఇక తాజాగా రిలీజైన డీఎస్సీ ఫలితాల్లో నాలుగో కూతురు శిరీష సెకండరీ గ్రేడ్‌ టీచరుగా ఎంపికయ్యారు. అలా తల్లి కష్టాన్నీ, నమ్మకాన్నీ వమ్ము చేయకుండా తమ ఆశయాన్ని సాధించారు ఈ అక్కాచెల్లెళ్లు. ఈ విజయంతో గౌరమ్మ గౌరవం రెట్టింపైంది.

తన కూతుళ్ల విజయాన్ని చూసిన గౌరమ్మ కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. పిల్లలు ఉద్యోగాలు సాధించడం వల్ల ఇన్నాళ్లు పడిన తన కష్టం ఫలించిందంటున్నారు. ఇప్పుడు తనకు ఎలాంటి బాధ లేదుని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 4 Government Employee Sisters.

పేదరికం ఒక సవాలు మాత్రమే, అది అడ్డంకి కాదు.ధృడ సంకల్పం..ఆత్మ విశ్వాసం..కలిస్తే ఏదైనా సాధ్యమని ఈ రియల్ స్టోరీ స్పష్టం చేస్తోంది. కష్టపడి చదివి మీ కాళ్ళపై మీరు నిలబడితే సమాజంలో గౌరవం ఉంటుందని తల్లి చెప్పిన మాటలు ఈ అక్కాచెల్లెళ్ల జీవితాలనే మార్చేశాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు ఉపాధ్యాయులు కావడమే గొప్ప విషయం. ఆ విధంగా పెంచి పెద్ద చేసిన ఈ మాతృమూర్తికి హ్యాట్సాఫ్. అలాగే ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న అక్కా చెల్లెళ్లకు అభినందనలు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q