
Primary amoebic meningoencephalitis: కేరళలో ఒక్క కొత్త వ్యాధి ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. మెదుడును తినేసే ఒక సూక్ష్మజీవి వల్ల ఈ వ్యాధి వస్తోందని గుర్తించారు. దీనికి ప్రైమరీ అమోబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ అనే పేరు కూడా ఉంది. ఈ అరుదైన, ప్రాణాంతక వ్యాధి వల్ల ఇప్పటికే కొందరు చనిపోయారు. అందులో ఒక మూడు నెలల చిన్నారి కూడా ఉన్నాడు. మొన్న కరోనా.. ఇప్పుడు ఈ కొత్త వ్యాధి.. అసలు కేరళలో ఏం జరుగుతోంది..? అసలు మెదడు తినేసే ఈ స్మూక్ష జీవి ఎక్కడ ఉంటుంది..? కేరళలోనే ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? డాక్టర్లు ఏం చెబుతున్నారు. ? ఈ వ్యాధి వస్తే మరణం తప్పదా..?
ఓ కొత్త వ్యాధి ఇప్పుడు కేరళ ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది.. ఇప్పటికే కొందరు చనిపోగా.. మరికొందరు కోజికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటివి ఈ ఏడాది ఇలాంటివి ఇప్పుడు వరకు 40కు పైగా కేసులు నమోదయ్యాయి. నీగ్లేరియా ఫౌలేరి అనే సూక్ష్మజీవి కారణంగా వచ్చే ఈ వ్యాధి, కలుషిత నీటి ద్వారా ముక్కు గుండా మెదడుకు చేరి, మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఈ వ్యాధి వస్తే వంద శాతం చావు గ్యారంటీ. కేరళలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధిని ప్రైమరీ అమోబిక్ మెనింగోఎన్సెఫలైటిస్- PAM అని పిలుస్తున్నారు. నీగ్లేరియా ఫౌలేరి సూక్ష్మజీవి వెచ్చని నీటి సరస్సులు, నదులు, కొలనులు, నిల్వ నీటిలో ఉంటుంది. ఇలాంటి మురికి నీటిలో ఈదడం, స్నానం చేసినప్పుడు కలుషిత నీరు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముక్కు ద్వారా ఈ సూక్ష్మజీవి మెదడుకు చేరి, మెదడు కణజాలాన్ని నాశనం చేస్తూ తీవ్రమైన వాపును కలిగిస్తుంది. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి సోకదు, కానీ నీరు ముక్కులోకి చొచ్చుకుపోతే ఈ సూక్ష్మజీవి మెదడుకు చేరే ప్రమాదం ఉంది. లక్షణాలు మొదలైన 5 రోజుల్లోనే మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరం, చికిత్స ఉన్నా బతికే అవకాశాలు చాలా తక్కువ.
ఈ వ్యాధి లక్షణాలు ఏంటి..?
ఈ వ్యాధి లక్షణాలు మొదట సాధారణ జ్వరంలా కనిపిస్తాయి. మొదటి దశలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం, మెడ బిగుసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రోజుల్లో ఈ లక్షణాలు వేగంగా తీవ్రమవుతాయి. మానసిక గందరగోళం, మూర్ఛ, భ్రాంతులు, సమతుల్యత కోల్పోవడం, కోమా వంటివి సంభవిస్తాయి. చిన్న పిల్లల్లో బద్ధకం, అసాధారణ ప్రవర్తన కనిపిస్తాయి. లక్షణాలు మొదలైన తర్వాత 5 నుంచి 18 రోజుల్లో చనిపోయే అవకాశం చాలా ఎక్కువ. చికిత్స కోసం యాంటీఫంగల్ ఔషధాలు, స్టెరాయిడ్స్ వంటివి ఉపయోగిస్తారు, కానీ పనిచేసే అవకాశం చాలా తక్కువ. కేరళలో ఒప్పటి వరకు 42 కేసులు నమోదు కాగా.. 8 మంది కోజికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేరళలో ఈ వ్యాధి పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, నీటి ఉష్ణోగ్రతల పెరుగుదల, నగరాల్లో నిలిచిపోయే మురుగునీరు ఈ సూక్ష్మజీవి పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. కేరళలో వర్షకాలం తర్వాత నిలిచిన నీటి గుంటల్లో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ సూక్ష్మజీవి సులభంగా వృద్ధి చెందుతోంది. నగర ప్రాంతాల్లో నీటి నిల్వ ట్యాంకులు, బావులు సరిగా శుభ్రం చేయకపోవడం కూడా ఈ సమస్యకు కారణమవుతోంది. కొన్ని సందర్భాల్లో మట్టి, దుమ్ము నుంచి కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఈ కేసులు ఎప్పటి నుంచి నమోదవుతున్నాయి..?
2016లో కేరళలోని అలప్పుజా జిల్లాలో మొదటి కేసు నమోదైంది. అప్పటి నుంచి 2024 వరకు 7 కేసులు వెగులు చూశారు. వారందరూ మరణించారు. 2024లో రెండు కేసులు నమోదు కాగా.. ఆ ఇద్దరు చనిపోయారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఒక్కసారిగా మరింత పెరిగింది, ఆగస్టులోనే ముగ్గురు చనిపోయారు. గతంలో ఇంత ఎక్కువ కేసులు ఒకేసారి నమోదు కాలేదు, ఇది ఒక ప్రమాద సూచన అని నిపుణులు అనుమానిస్తున్నారు. చాలా కేసులు తప్పుగా నిర్ధారణ అవుతున్నాయి. గతంలో కొన్ని కేసులను మెదడు వాపుగా భావించారు. కానీ ఇప్పుడు కేరళ ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తమైనందున, ఎక్కువ కేసులు గుర్తిస్తున్నారు.
కొత్త వ్యాధులు అన్నీ కేరళలోనే ఎందుకు వస్తాయి..?
కొత్త వ్యాధులు కేరళలోనే మొదలు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేరళ పశ్చిమ కనుమల్లో ఉంది, ఇది జీవవైవిధ్య కేంద్రం. ఉష్ణమండల వాతావరణం, ఎక్కువ వర్షపాతం, అధిక తేమ వంటివి వ్యాధులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. నగరీకరణ, అటవీ నిర్మూలన వల్ల వన్యప్రాణుల ఆవాసాలు దెబ్బతింటున్నాయి, దీనివల్ల జంతుజన్య వ్యాధులు మనుషులకు సోకే అవకాశం పెరుగుతోంది. నీపా వైరస్ వంటి వ్యాధులు 2018, 2019, 2021, 2023లో కేరళలోనే పలుమార్లు వ్యాపించాయి. వర్షాకాలం తర్వాత తర్వాత నిలిచిపోయి ఉండే నీటి గుంటలు ఈ సూక్ష్మజీవులకు, క్రిమి-మీడియేటెడ్ వ్యాధులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. కేరళ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా దుబాయ్, సింగపూర్ వెళ్లి వచ్చే జనాభా ఎక్కువగా ఉంది, ఇది కొత్త వ్యాధుల ప్రవేశానికి దారితీస్తుంది.
కరోనా వ్యాధి కేరళలో మొదట వ్యాపించడానికి కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి. భారతదేశంలో మొదటి కరోనా కేసు 2020 జనవరి 30న కేరళలోనే నమోదైంది. చైనాలోని వుహాన్ నుంచి వచ్చిన ముగ్గురు వైద్య విద్యార్థుల ద్వారా కరోనా వ్యాపించింది. అధునాతన ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వల్ల ముందస్తుగా కేసులను గుర్తించడం సాధ్యమవుతోంది, కానీ అదే సమయంలో విదేశీ ప్రయానాలు వ్యాధుల ప్రవేశానికి దారితీస్తోంది. అధిక సామాజిక స్పృహ, విద్యాస్థాయి వల్ల కేరళలో సందర్భాలు త్వరగా నమోదవుతాయి. Primary amoebic meningoencephalitis.
ఈ వ్యాధిని నివారించడానికి అత్యంత కీలకమైన చర్యలు తీసుకోవాలి. నీటి భద్రత అతి ముఖ్యం. నిలిచిన నీటి సముదాయాలైన సరస్సులు, నదులు, కొలనుల్లో ఈదడం మానాలి. ముఖ్యంగా వెచ్చని నీటిలో దిగకూడదు. ఈదేటప్పుడు ముక్కు క్లిప్స్ ఉపయోగించాలి. సరస్సులు, నదుల్లో డైవింగ్ లేదా గెంతడం నివారించాలి. ఈజు కొలనులు సరిగా క్లోరినేట్ చేయబడి ఉండాలి. ఇంటి నీటి నిల్వ ట్యాంకులు, బావులను శుభ్రం చేయాలి. ముక్కు శుభ్రపరచడానికి బావి నీటిని ఉడకబెట్టి ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి వ్యాపికంచకుండా ఉంటుంది.