
Manoj Jarange Patil: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఓ బక్క పలచ వ్యక్తి వణికిస్తున్నాడు. ఇతడు చేస్తున్న పోరాటం.. దేశ ఆర్థిక రాజధానిని షేక్ చేస్తోంది. మనోజ్ జారంగ్ పటేల్ అనే వ్యక్తి .. మరాఠాలకు ప్రత్యేక కోటా కోసం చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇతడు చేపట్టిన నిరాహార దీక్ష మహారాష్ట్రా రాజకీయల్లో దుమారం రేపుతోంది. అసలు మనోజ్ ఏం డిమాండ్ చేస్తున్నాడు..? ఈ పోరాటానికి ఎవరు మద్దతు పలుకుతున్నారు..? కుల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ఎదరవుతోన్న సమస్యలు ఏంటి..? దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది..?
మరాఠా కమ్యూనిటీ మహారాష్ట్రలో అతిపెద్ద సామాజిక సమూహాల్లో ఒకటి. ఎక్కువగా వ్యవసాయం, రైతు సంబంధిత వృత్తుల్లో మరాఠాలు ఉన్నారు. వీరు సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా OBC కేటగిరీ కింద 10% రిజర్వేషన్ కోరుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కోటా లభిస్తుందని భావిస్తున్నారు. దీని కోసమే మనోజ్ జారంగ్ పటేల్ పోరాటం చేపట్టారు. ప్రధానంగా మరాఠాలను కున్బీ కేటగిరీలో చేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కున్బీ అనేది OBC లిస్టులో ఉన్న వ్యవసాయ కులం. 1884 హైదరాబాద్ గెజిట్, సతారా గెజిట్ రికార్డుల్లో మరాఠాలు, కున్బీలు ఒకే కులంగా గుర్తించారు. మరాఠవాడలో 1884 జనాభా లెక్కల్లో మరాఠా అనే పేరు లేదు, అందరూ కున్బీలుగానే నమోదయ్యారు. అయితే ఆ తర్వాత వారిని వేరు చేయడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. అందుకే మరాఠాలను కున్బీల్లో కలపాలని కోరుతున్నారు. దీని వల్ల తమకు రిజర్వేషన్లు వచ్చి.. ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు.
ఎవరీ మనోజ్ జారంగ్ పటేల్ ?
43 ఏళ్ల మనోజ్ జారంగ్ పటేల్ మరాఠా కోటా ఉద్యమానికి నాయకుడు. జల్నా జిల్లాలోని అంతర్వాలీ సరాటి గ్రామానికి చెందిన మనోజ్, 2023 నుంచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. మనోజ్ కు ఇది ఎనిమిదో దీక్ష, గతంలో జనవరి 2024లో కూడా ముంబైలో ఆందోళన చేసి, ప్రభుత్వం నుంచి హామీ ద్వారా పోరాటానికి విరామం ఇచ్చాడు. అయితే ప్రభుత్వం హామీలు నెలబెట్టుకోలేదు. అందుకే మరోసారి ముంబైలోని అజాద్ మైదాన్‌లో నిరాహార దీక్ష చేపట్టి.. మరాఠాలను కున్బీల్లో కలపాలని కోరుతున్నాడు. తాను బుల్లెట్స్ తగిలినా వెనక్కు తగ్గనని.. తన డిమాండ్లు సాధించుకునే వరకు ముంబై వదిలి వెళ్లనని పోరాటం చేపట్టాడు.
మనోజ్ పోరాటానికి ఎలాంటి మద్దతు లభిస్తోంది?
మరాఠా కమ్యూనిటీ నుంచి మనోజ్ కు చాలా మద్దతు ఉంది. మహారాష్ట్రలోని జల్నా, బీడ్, పూణే, మరాఠవాడ వంటి ప్రాంతాల నుంచి లక్షలాది మంది ముంబైలోని అజాద్ మైదాన్‌కు చేరకుని .. మనోజ్ దీక్షకు మద్దతు పలికారు. వందలాది వాహనాలతో, వేలాది మంది సఫారీ ఫ్లాగ్‌లు, కాషాయ టోపీలతో ర్యాలీలు నిర్వహించారు. అంతేకాదు ఆందోళనకారులు ముంబై మున్సిపల్ కార్యాలయం, ముంబై స్టాక్ మార్కెట్ కార్యాలయాల వద్దకు వెళ్లి నిరసనలు చేపట్టారు. దలాల్ స్ట్రీట్‌లోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ గేట్స్ వద్ద తాము కూడా షేర్‌హోల్డర్లమే, తమకు ఈ దేశంలో హక్కులున్నాయి నినాదాలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలకు అనుమతించలేదు. ఆశ్చర్యకరంగా, విదేశీ పర్యాటకులు కూడా ఏక్ మరాఠా, లఖ్ మరాఠా స్లోగన్‌లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, OBCనాయకులు మాత్రం మరాఠా కోటా వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకిస్తున్నారు.
రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏం చెబుతోంది?
మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా CM దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని BJP-మహాయుతి ప్రభుత్వం, ఈ సమస్యపై గందరగోళ స్థితిలో ఉంది. ఫడ్నవీస్ ఒక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసి, మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు బాధ్యత అప్పగించారు. ఈ కమిటీ అడ్వకేట్ జనరల్ బిరేన్ సరాఫ్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి సందీప్ షిండేతో చర్చలు జరుపుతోంది. అయితే, సుప్రీం కోర్టు గతంలో మరాఠాలు, కున్బీలు ఒకే కులం కాదు అని ఇచ్చిన తీర్పు వల్ల లీగల్ సమస్యలు ఉన్నాయి. మరాఠా కమ్యూనిటీ సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. కానీ రాజ్యాంగ, చట్టపరమైన మార్గంలోనే పరిష్కారం కనుగొనాలని అంటున్నారు. హైదరాబాద్, సతారా గెజిట్‌ల ఆధారంగా కున్బీ స్టేటస్ ఇవ్వడం సాధ్యమేనా అని లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.
దీక్ష చేస్తున్న మనోజ్ ఆరోగ్యం క్షీణిస్తోంది. మూడు రోజుల ఆకలి దీక్ష తర్వాత, సెప్టెంబర్ 1 నుంచి నీటిని కూడా తాగడం మానేశాడు. JJ హాస్పిటల్ డాక్టర్లు మనోజ్ బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్‌ను చెక్ చేశారు, కానీ నీరు లేకుండా ఎక్కువ రోజులు జీవించడం కష్టమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన దీక్షను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని.., సమయం వృథా చేస్తోందని మనోజ్ పటేల్ ఆరోపిస్తున్నారు. అందుకే నీటిని కూడా మానేస్తున్నానన్నారు. బుల్లెట్స్ కాల్చినా, జైల్లో వేసినా వెనక్కి తగ్గనని చెబుతున్నారు. Manoj Jarange Patil.
మారాఠా రిజర్వేషన్ల ఉద్యమం రాజకీయంగా మహారాష్ట్రలో పెద్ద సవాల్‌గా మారింది, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు, సివిక్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అటు విపక్ష నాయకులు ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఏ మంత్రి కూడా మనోజ్ ను కలవలేదని.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సుప్రియా సూలే విమర్శించారు. ఆమె ఒక ప్రత్యేక అసెంబ్లీ సెషన్, ఆల్-పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు షరద్ పవార్, రోహిత్ పవార్‌లపై ఈ ఉద్యమానికి ఫండింగ్ చేస్తున్నారని BJP నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే మరాఠా కోటా సమస్య పరిష్కారం అంతా సాధారణ విషయం కాదని చెబుతున్నారు. దీనికి చాలా లీగల్ చిక్కులు ఉన్నాయని అంటున్నారు. సుప్రీం కోర్టు గత తీర్పులు, రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ క్యాప్, OBC కమ్యూనిటీ వ్యతిరేకత వంటివి మరాఠా రిజర్వేషన్లకు అడ్డంకిగా ఉన్నాయి.