
China DF-5C Missile: ఇటీవల చైనా నిర్వహించిన సైనిక పరేడ్ లో అత్యాధునిక అణు క్షిపణిని ప్రపంచానికి పరిచయం చేసింది. దాని పేరు DF-5C పేరు షార్ట్ గా ఉన్నా.. దీని రేంజ్ మాత్రం చాలా లాంగ్. అంటే ప్రపంచంలోనే ఏ దేశంపై నైనా దీనిని ప్రయోగించవచ్చు. అంతేకే ఒకేసారి 10 అణు వార్ హెడ్ లను మోసుకెళ్లగలదు. చైనా సైనిక పరేడ్ లో ఎన్నో ఆయుధాలను ప్రదర్శించినా.. ఈ DF-5C క్షిపణి మాత్రం అమెరికాకు ఇప్పుడు టెన్షన్ తెప్పిస్తుందనే చెప్పాలి.. అసలు ఈ ఆయుధాన్ని ప్రదర్శించడం ద్వారా చైనా ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంది..? DF-5C రాకతో అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ మార్పులు వస్తాయి? అమెరికాకు ఇది నిజంగా ఒక హెచ్చరిక అనుకోవచ్చా? DF-5C క్షిపణిని ఎదుర్కొనే శక్తి ప్రస్తుతమున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కు ఉందా..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
ఇటీవలి కాలంలో చైనా చుట్టు పక్కల దేశాల్లో అమెరికా ప్రభావం పెరిగింది. చైనా ఆధిపత్యానికి సవాల్ విసిరేలా .. చైనా సమీపంలోని దేశాలతో అమెరికా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దీంతో చైనా అమెరికాకు గట్టి వార్నింగ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో చూస్తోంది. దానికి సమయం వచ్చింది. చైనాలో జరిగిన విక్టరీ డే పరేడ్ లో ప్రదర్శించిన క్షిపణి ఇప్పుడు అమెరికాకు ఆందోళనలో పడేసింది. అదే DF-5C.
DF-5C అనేది చైనా తయారు చేసిన అత్యాధునిక ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇది చైనా సైనిక శక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ క్షిపణి 20,000 కిలోమీటర్ల రేంజ్ కలిగి, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలను సులభంగా టార్గెట్ చేయగలదు. ఇది చైనా DF-5 క్షిపణి సిరీస్‌లో అప్ గ్రేడ్ వర్షన్. చైనా ఈ క్షిపణిని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా, తమ అణు సామర్థ్యం ప్రపంచంలోని సూపర్‌పవర్‌లైన అమెరికా, రష్యాల స్థాయిలో ఉందని చాటింది. అమెరికాకు చెందిన మినిట్ మెన్3, రష్యాకు చెందిన సర్మత్ వంటి ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లల చైనా తమ వద్ద కూడా DF-5C ఉందని చాటింది.
DF-5C అతి పెద్ద ప్రత్యేకత దాని MIRV టెక్నాలజీ. అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఈ టెక్నాలజీ ద్వారా ఒకే క్షిపణి 10 అణు వార్‌హెడ్‌లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదు. ఉదాహరణకు, బీజింగ్ నుంచి ప్రయోగిస్తే, అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ వంటి పలు నగరాలను ఒకేసారి టార్గెట్ చేయవచ్చు. ప్రతి వార్‌హెడ్ స్వతంత్రంగా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది, దీనివల్ల శత్రు రక్షణ వ్యవస్థలు గందరగోళంలో పడతాయి. ఒక్కో వార్‌హెడ్‌లో 1 మెగాటన్ శక్తి ఉంటుంది. అంటే ఒక DF-5C క్షిపణి ప్రయోగిస్తే భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు.
చైనా తయారీ DF-5C రాకతో ప్రపంచవ్యాప్త రక్షణ వ్యవస్థలకు భారీ సవాలు ఎదురవుతోంది. అమెరికా, జపాన్ దగ్గర ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒకే క్షిపణిని అడ్డుకోగలవు, కానీ MIRV టెక్నాలజీతో 10 వార్‌హెడ్‌లను తీసుకువెళ్లే DF-5C క్షిపణిని ఒకేసారి ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం. ఈ క్షిపణి రాడార్‌లను గందరగోళ పరుస్తుంది. దీనివల్ల రక్షణ వ్యవస్థలు ఏ వార్‌హెడ్ నిజమైనదో, ఏది నకిలీదో గుర్తించడం కష్టం. దీని వల్ల అమెరికా వంటి దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత అప్‌గ్రేడ్ చేయవల్సిన పరిస్థితి ఏర్పడింది.
చైనా DF-5Cను పరేడ్ లో ప్రదర్శించడం తన వ్యూహాత్మక ఆలోచనను స్పష్టం చేస్తోంది. అమెరికా-చైనా మధ్య తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్ విషయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం, దక్షిణ చైనా సముద్రంలో నావికా యుద్ధనౌకలను మోహరించడం బీజింగ్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ సమయంలో DF-5Cను ప్రదర్శించడం ద్వారా చైనా, తాము ఏ సూపర్‌పవర్‌కైనా సవాలు విసరగలం అనే సందేశం పంపింది. ఈ క్షిపణి కేవలం సైనిక ఆయుధం మాత్రమే కాదు, అమెరికాకు, దాని మిత్ర దేశాలకు ఒక రాజకీయ హెచ్చరిక. చైనా తన గ్లోబల్ ఇన్‌ఫ్లూయెన్స్‌ను సైనిక శక్తితో బలోపేతం చేయాలని చూస్తోంది. China DF-5C Missile.
మొత్తం మీద, DF-5C ప్రదర్శన చైనా సైనిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటింది. ఇది అమెరికాకు తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో జోక్యం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని అనడానికి ఒక హెచ్చరిక. ప్రపంచానికి చైనా ఇప్పుడు మూడో సూపర్‌పవర్ అనే విషయాన్ని ఈ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఈ క్షిపణి రాకతో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త కోల్డ్ వార్ ఛాయలు కనిపిస్తున్నాయి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. DF-5C శాంతిని కాపాడే ఆయుధమా, లేక కొత్త ఉద్రిక్తతలకు నాంది పలికే అస్త్రమా? సమయమే సమాధానం చెబుతుంది.