జీఎస్టీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.!!

GST two slabs: జీఎస్టీ అంటే సామాన్యుడికి అర్థం కాని ఒక బ్రహ్మపదార్థం. ఈ జీఎస్టీ పెరిగే ఏంటి.. తగ్గితే నాకేంటి అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఆ జీఎస్టీ పెరుగుదల, తగ్గుదలలోనే సామాన్యుల జీవనం ఆధారపడి ఉంది. అయితే ఇప్పుటి వరకు కేంద్ర ప్రభుత్వం మనం కొనుగోలు చేసే రకరకాల వస్తువులపై.. విధవిధాలైన స్లాబులతో జీఎస్టీ వసూలు చేసింది. మనం కొనే సబ్సు నుంచి సైకిల్ వరకు ప్రతీ దానికి జీఎస్టీ వేసింది. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ సారి కేంద్రం జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యులు, ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకుని.. జీఎస్టీలో మార్పులు చేసింది. ఇంతకీ కేంద్రం జీఎస్టీలో ఎలాంటి మార్పులు చేసింది..? దీని వల్ల మనకు ఒరిగే లాభం ఏంటి..? ఇప్పుడు జీఎస్టీలో మార్పుల వల్ల రేట్లు తగ్గుతాయా..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..?

భారత్ దేశంలో వస్తు సేవలపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీ వల్ల మనం కొనే ప్రతీ వస్తువుపై కేంద్రానికి పన్ను రూపంలో కొంత ఆదాయం వెళ్తుంది. అయితే ఇది ఇప్పటి వరకు లాభపేక్షతోనే నడిచిందని.. సామాన్యులపై భారంగా మారిందని అనేక విమర్శలు చేశాయి విపక్షాలు. అయితే కేంద్రం ఈ సారి తన రూటు మార్చింది. సామాన్యులు, పేద ప్రజలకు లాభం చేకూరేలా జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసింది. దీని వల్ల మధ్యతరగతి, పేదల జీవితాల్లో మార్పులు వస్తాయని కేంద్రం చెబుతోంది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం న్యూ ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మంత్రులు హాజరైన ఈ సమావేశంంలో కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇప్పటిన వరకు నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని రెండు స్లాబులోగా మార్చారు. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు అమలులోకి వస్తాయి. ఇది పండుగకు కేంద్రం ఇచ్చిన గిఫ్ట్ అని ఎన్డీఏ నాయకులు చెబుతున్నారు.

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా పనీర్, చపాతీ పిండి, పరాఠా వంటి వాటిపై జీఎస్టీ గతంలో 5% ఉండగా దానిని మొత్తం తొలగించారు. హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, షాంపూ, టూత్‌బ్రష్, నమ్‌కీన్, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, బటర్, గీ, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, సాస్‌లు, కాఫీ వంటిపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించారు. ఈ వస్తువులు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల రోజువారీ ఖర్చులో ముఖ్య భాగం. ఈ తగ్గింపు వినియోగదారుల జేబుకు భారాన్ని తగ్గిస్తాయి.. పైగా డిమాండ్‌ను పెంచుతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

వైట్ గూడ్స్, ఆటోమొబైల్ రంగాల్లో కూడా జీఎస్టీ తగ్గింపు గణనీయమైన మార్పులు తెస్తుంది. ఎయిర్ కండీషనర్లు, టీవీలు, డిష్‌వాషర్లు, చిన్న కార్లు, 350 సీసీ కంటే తక్కువ హార్స్ పవర్ ఉన్న మోటార్‌సైకిళ్లపై జీఎస్టీ 18%కి తగ్గింది. ఆటో భాగాలు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్‌లపై కూడా 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 5% గానే కొనసాగుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం 10 శాతం తగ్గనుంది. వీటితోపాటు రోజువారీ వాడుకొనే చిన్న బైకులకు రిలీఫ్‌ లభించింది. ఇప్పటికే ప్రభుత్వం ఆదాయపు పన్నులో 12 లక్షల వరకు ఉపశమనం ఇవ్వడం, వడ్డీరేట్లు తగ్గడంతో ఆటోమొబైల్‌ రంగం పుంజుకోవడానికి అనువైన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు జీఎస్టీ కోత ఈ జోరును మరింత పెంచనుంది. టాటా ఆల్ట్రోజ్‌, మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ ఐ10, ఐ20, రెనో క్విడ్‌ వంటి వాహనాల ధరలు తగ్గనున్నాయి. గతంలో ఈ వాహనాలపై 28 శాతం పన్ను, ఇంధనం, ఇంజిన్‌ సామర్థ్యాన్ని బట్టి 1-3శాతం సెస్సు విధించేవారు. చిన్నకారు ధరలు 6 నుంచి 10 లక్షల రూపాయల మధ్య అనుకొంటే ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు 60 వేల నుంచి లక్ష వరకు మిగలనుంది. కాకపోతే కంపెనీలు ఎటువంటి కారణాలు చెప్పకుండా జీఎస్టీ లబ్ధిని వినియోగదారులకు బదలాయించాల్సి ఉంటుంది.

ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు ఈ సంస్కరణలు పెద్ద ఊరటనిచ్చాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. 33 రకాల లైఫ్-సేవింగ్ ఔషధాలపై జీఎస్టీని తొలగించారు. కంటి చూపు సరిచేసే స్పెక్టకిల్స్‌పై జీఎస్టీ 28% నుంచి 5%కి తగ్గింది. వ్యవసాయ రంగంలో, 12 రకాల బయో-పెస్టిసైడ్స్, బయో-మెంథాల్, వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింది. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఇప్పటివరకు ఉన్న 18 శాతం GSTని మినహాయించడాన్ని చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. ఇది లక్షలాది కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుస్తుందని ఇన్సూరెన్స్‌ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించినప్పటికీ.. ఆ మేరకు వినియోగదారుడికి పూర్తి ప్రయోజనం ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. కంపెనీలకు ఇన్‌పుట్‌ ట్యాక్స్ క్రెడిట్‌ ఆదాయం రాకపోవడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. కార్యాలయ అద్దె, టెక్నాలజీ, కస్టమర్‌ సర్వీస్‌ వంటి సేవలు అందించినందుకు అయ్యే ఖర్చులను ఇన్‌పుట్‌ ట్యాక్స్ రూపంలో క్లెయిమ్‌ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రీమియంపై జీఎస్టీని తొలగించడంతో వీటిపై సందిగ్ధత నెలకొంది. బీమా సంస్థలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. బేస్‌ ప్రీమియంను కొంతమేర పెంచే అవకాశాలున్నప్పటికీ.. మొత్తంగా పాలసీదారుడికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పేదల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన కేంద్రం. లగ్జరీ, శరీరానికి హాని చేసే వస్తువులపై మాత్రం ప్రత్యేక జీఎస్టీ విధించనుంది. లగ్జరీ, సిన్ గూడ్స్‌పై జీఎస్టీ 40%కి పెరిగింది. ఇందులో పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, జర్దా, తంబాకు, బీడీలు, కెఫినేటెడ్ డ్రింక్స్, కోకాకోలా, పెప్సీ వంటి కార్బోనేటెడ్ బీవరేజెస్, 1200 సీసీ కంటే పెద్ద కార్లు, 350 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ ఉన్న మోటార్‌సైకిళ్లు, యాచ్‌లు, హెలికాప్టర్లు, ప్రైవేట్ ఉపయోగానికి విమానాలు ఉన్నాయి. తంబాకు ఉత్పత్తులపై ప్రస్తుత 28% జీఎస్టీ, కంపెన్సేషన్ సెస్ కొనసాగుతాయి, రుణాలు తీరే వరకు కొత్త రేట్లు అమలులోకి రావు. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్య రక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించింది. 100 రూపాయలలోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం వీటిపై 12 శాతం జీఎస్టీ ఉండగా.. తాజాగా దాన్ని 5 శాతానికి తగ్గించింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు, చిన్న పట్టణాల్లోని సినిమా హాళ్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, 100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది 18శాతం జీఎస్టీ వసూలు కొనసాగుతుంది. అంటే, మల్టీప్లెక్స్‌లు, ప్రీమియం థియేటర్లలపై నూతన జీఎస్టీతో ఎలాంటి ప్రభావం లేదు. అటు పాప్‌కార్న్‌పై నూతన జీఎస్టీ విధానంలో స్పష్టత వచ్చింది. సాల్ట్‌ పాప్‌కార్న్‌ 5 శాతం శ్లాబ్‌లోకి రాగా.. క్యారమిల్‌ పాప్‌కార్న్‌ 18 శాతంలోకి వస్తుంది. గతంలో ఒకే పాప్‌కార్న్‌పై ప్యాకేజింగ్‌ను బట్టి వేర్వేరుగా పన్ను విధించే వారు. తాజాగా దీనిని సవరించారు. ఇప్పుడు ప్యాక్‌ చేసి అమ్ముతారా? విడిగా విక్రయిస్తారా అన్నదానితో ఇక సంబంధం ఉండదు. ప్యాకేజ్డ్‌, విడిగా అమ్మే సాల్టెడ్‌ పాప్‌కార్న్‌ను 5శాతం జీఎస్టీ పరిధిలోకి, పంచదార కలిపి చేసిన క్యారమెల్‌ పాప్‌కార్న్‌ 18 శాతం పన్ను పరిధిలోకి వచ్చింది.

ఈ జీఎస్టీ సంస్కరణలు ఎంఎస్‌ఎంఈలకు, రిటైల్ రంగానికి పెద్ద ఊపిరిగా భావిస్తున్నారు. 99% వస్తువులు 12% స్లాబ్ నుంచి 5%కి, 90% వస్తువులు 28% నుంచి 18%కి మారాయి. ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సరిదిద్దడం, ఎగుమతి రిఫండ్లను 7 రోజుల్లో జారీ చేయడం, బయోమెట్రిక్ ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్, బీ2సీ ఈ-ఇన్‌వాయిసింగ్ వంటి చర్యలు వ్యాపారాలకు సౌలభ్యాన్ని పెంచాయి. ఈ సంస్కరణలు ఎంఎస్‌ఎంఈలకు ఖర్చులను తగ్గించి, అనధికార రంగాన్ని అధికారిక రంగంలోకి తీసుకొస్తాయి. GST two slabs.

ఈ సంస్కరణల ఫలితంగా సర్కారుకు సుమారు 48,000 కోట్ల రూపాయల రాబడి నష్టం జరుగవచ్చని, కానీ దీర్ఘకాలంలో వినియోగం పెరగడం వల్ల ఈ నష్టం భర్తీ అవుతుందని అంచనా. ఈ సంస్కరణలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీని 0.3 శాతం పెంచుతాయని భావిస్తున్నారు. అయితే, విపక్ష పాలిత రాష్ట్రాలు ఈ నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయా, లేక కొత్త సవాళ్లను తెస్తాయా అనే సందేహాన్ని తెలిపాయి.