అంతర్జాతీయ కుట్ర..?

Dharmasthala Case: ధర్మస్థల వ్యవహారం కర్ణాటక రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదం వెనుక అనేక ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ధర్మస్థలపై అబద్ధాలు ప్రచారం చేయడం కొందరి హస్తం ఉందనే మాట వినిపిస్తోంది. దీంతీ బీజేపీ, హిందూ సంఘాలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నాయి. బీజేపీ ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ కేసును NIA లేదా CBIకి అప్పగించాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? మాస్క్ మాన్ చిన్నయ్య అబద్ధాల వెనుక ఎవరి హస్తం ఉంది? బీజేపీ ఎలాంటి ఆందోళనలకు పిలుపునిచ్చింది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ధర్మస్థల కేసు కర్ణాటకలో రాజకీయాలను రణరంగంగా మార్చింది. BJP ఈ కేసును NIA లేదా CBIకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ధర్మస్థలపై అబద్ధాల వెనుక హిందూ దేవాలయాలను టార్గెట్ చేసే ఒక పెద్ద కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT విచారణలో పారదర్శకత లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. మొదటి నుంచి ఈ కేసులో అన్ని అబద్ధాలే ప్రచారం అయ్యాయని అంటున్నారు. దీని వల్ల ధర్మస్థల ఆలయ ఇమేజ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింటోంది అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముక్కుమొఖం తెలియని వ్యక్తి ఆరోపణల ఆధారంగా జ్యుడీషియల్ అనుమతి లేకుండా ఎక్స్‌కవేషన్స్ ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. మసీదు లేదా చర్చ్‌పై ఇలాంటి ఆరోపణలు వస్తే ఇలా చేసేవారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ సంస్థలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందని, దీని వెనుక లెఫ్టిస్టుల ఒత్తిడి ఉందని ఆరోపిస్తున్నారు.

అనేక ప్రాంతాల్లో తవ్వకాల తర్వాత మాస్క్ మాన్ అని పిలిచే చిన్నయ్య ఆరోపణలు అన్నీ అబద్ధాలుగా తేలాయి. చిన్నయ్య మొదట 70-80 మృతదేహాలను ధర్మస్థలలో పాతిపెట్టానని, అనేక ప్రదేశాల్లో శవాలు ఉన్నాయని, కొన్నింటిని సాక్ష్యంగా చూపించాడు. కానీ SIT విచారణలో అతని వాదనల్లో ఏదో తేడా ఉందని తేలింది. గట్టిగా ప్రశ్నిస్తే తాను అబద్ధం చెప్పానని చిన్నయ్య ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. చిన్నయ్య చూపించిన పుర్రె కూడా నకిలీదని SIT విచారణలో తేలింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చిన్నయ్య 2003లో జరిగిన సౌజన్య హత్య కేసుతో కూడా ఈ ఆరోపణలను లింక్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ అది కూడా ఫాబ్రికేటెడ్ అని తేలింది.

BJP ఈ వివాదం వెనుక కన్వర్షన్ మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తోంది. హిందూ మత సంస్థలపై బురద చల్లడానికి ఈ కుట్ర పన్నారని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాలను, ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో ఉన్నఆలయాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందని BJP రాష్ట్ర అధ్యక్షుడు B.Y. విజయేంద్ర ఆరోపించారు. హిందూ సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇది కూడా శబరిమల వివాదం లాంటిదని.. పవిత్ర హిందూ స్థలాలను అపవిత్రం చేసే కుట్ర అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ధర్మస్థలకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర పై ఎన్‌ఐఏ దర్యాప్తుతో చేయించాలని బీజేపీ ఆధ్వర్యంలో చలో ధర్మస్థల పేరుతో సభను నిర్వహించారు. ఈ కేసు విచారణ సిట్‌కు బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించాలని, కుట్రకు పాల్పడిన దుష్టశక్తులను చట్టప్రకారం శిక్షించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రపోరాటం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. మంజునాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మైదానంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. వేలాదిగా కార్యకర్తలు సభకు తరలివచ్చారు. సిట్‌ దర్యాప్తు పట్ల తమకు ఎలాంటి అనుమానం లేదని కానీ ఈ కేసులో అంతర్జాతీయ శక్తుల హస్తం ఉండటంతో ఎన్‌ఐఏ కు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ధర్మస్థలకు అపకీర్తి తీసుకురావాలనే దురుద్దేశంతో కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అటు బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల రాజకీయ యాత్ర అని, దాని వల్ల ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. రాజకీయలబ్ధికోసమే వారు యాత్ర చేశారన్నారు. ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ బూటకపు నిరసన సాగిస్తోందన్నారు. హిందువులను ఆకర్షించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే అది తప్పు అని గుర్తిస్తారన్నారు. ధర్మస్థల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. సిట్‌ ఏర్పాటు చేసినప్పుడు వ్యతిరేకించని బీజేపీ, ఇప్పుడు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. తానూ ఓ హిందువేనని గుర్తు చేశారు సిద్ధరామయ్య. Dharmasthala Case.

ధర్మస్థల వివాదం కర్ణాటక రాజకీయల్లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. BJP ఈ వివాదాన్ని మాస్క్ మాన్ ఫేక్ ఆరోపణలు నుంచి హిందూ దేవాలయాలపై కుట్ర వరకు మార్చగలిగింది. మాస్క్ మాన్ అరెస్ట్, ఫేక్ ఎవిడెన్స్ ఎక్స్‌పోజ్ కావడంతో వాళ్ల వాదన మరింత బలపడింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మొదటి ఆరోపణలను సరిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎందుకు అనుమతించారు? సరైన ధృవీకరణ లేకుండా SIT ఎందుకు ఏర్పాటు చేశారు?. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్సివ్ పొజిషన్‌లో ఉంది, ఒపోజిషన్ వాళ్లను హిందూ వ్యతిరేక ఇమేజ్‌లోకి నెట్టగలిగింది. రాబోయే ఎన్నికల్లో BJP ఈ ఇష్యూని ప్రధాన క్యాంపెయిన్ పాయింట్‌గా ఉపయోగించే అవకాశం ఉంది. ధర్మస్థల వంటి ప్రతిష్టాత్మక ధార్మిక సంస్థ విశ్వసనీయతకు డ్యామేజ్ అయిన పరిస్థితిలో, రాజకీయ పార్టీల బాధ్యత గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.