ఆరేళ్ళ తర్వాత జోడి కడుతున్న విజయ్ – రష్మిక..!

Vijay Deverakonda Rashmika combo: టాలీవుడ్ క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గురించి మళ్లీ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ విషయాలు మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పరేడ్ ఈవెంట్‌కి కలిసి హాజరవడంతో, ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది. అదే సమయంలో వీరిద్దరూ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత మళ్లీ కలిసి ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై కనిపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ క్షణం వచ్చేసినట్టే. తాజా సమాచారం ప్రకారం విజయ్, రష్మిక కాంబినేషన్‌లో మూడో సినిమా మొదలైపోయిందట.

ఈ కొత్త సినిమా దర్శకత్వ బాధ్యతలు రాహుల్ సాంకృత్యాన్ తీసుకున్నారని సమాచారం. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో 14వ చిత్రం (వర్కింగ్ టైటిల్ VD14) కావడంతో, మేకర్స్ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథనాయిక ఎవరు అనే అంశంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోయినా, ఆ స్థానాన్ని రష్మికనే భర్తీ చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. VD14 కథ విన్న వెంటనే రష్మిక ‘ఓకే’ చెప్పిందని తెలుస్తోంది. VD14 ప్రాజెక్ట్ కి సంబంధించి హైదరాబాద్‌లో ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైనట్లు టాక్.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా 1854–1878 మధ్యకాలంలో బ్రిటిష్ కాలనీలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడే ఒక పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఆయన కెరీర్‌లో ఇంతవరకూ చేయని విభిన్నమైన క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్ అంశాలు బలంగా ఉండబోతున్నాయట. రాహుల్ సాంకృత్యాన్‌ తనదైన శైలిలో స్క్రీన్‌ప్లే రూపొందించి, దీనిని థ్రిల్లింగ్ యాక్షన్-రొమాంటిక్ డ్రామాగా మలచుతున్నారని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. Vijay Deverakonda Rashmika combo.

ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం 2025 జూలై 24న థియేటర్లకు వచ్చింది. ఈ మూవీ మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, ఆయన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం VD14తో పాటు, దిల్ రాజు బ్యానర్‌లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న 59వ సినిమాపై కూడా విజయ్ ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్థన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది.