భారత్ పై అక్కసు.!

Trump Double Game: భారతదేశానికి తాను మిత్రుడిగా ప్రచారం చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచరణ శైలి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. భారత్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో భారత్ ను ఇబ్బంది పెట్టేవే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా భారత్ ఎదుగుతున్న సమయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దానికి అడ్డుకట్ట వేసేవిగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోసారి భారత్‌పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు.

భారత ప్రధాని నా స్నేహితుడు.. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.. మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నా అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సోషల్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ట్రంప్ పోస్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీసైతం స్పందించారు. నేను కూడా ట్రంప్ తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం అంటూ మోదీ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. మరోవైపు.. భారతదేశంపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు. భారత్, చైనా దేశాలపై సుంకాల భారాన్ని 100శాతం పెంచాలంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలను ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది.

యుక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత దేశాన్ని ట్రంప్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్సు కాల్ లో మాట్లాడారు. యుక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్న రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచాలంటే భారత్, చైనా దేశాలపై 100శాతం సుంకాలు విధించాలని, రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని రష్యా, భారత్ చెప్పే వరకు వారిపై సుంకాల మోత మోగించాలని ట్రంప్ పేర్కొన్నట్లు తెలిసింది.

అయితే, అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారట. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. భారతదేశం ఉత్పత్తులపై ఇప్పటికే ట్రంప్ 50శాతం సుంకాలను విధించారు. చైనా ఎగుమతులపై సుంకాలు 30శాతం వరకు ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మరోసారి భారత్, చైనాలపై సుంకాల మోతను మోగించే అవకాశాలు ఉన్నాయి.

ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్‌ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్‌, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై భారత్‌, చైనాలపై ట్రంప్‌ కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. ఇటీవల ఎస్సీవో సమ్మిట్‌కు భారత ప్రధాని మోదీ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధినేత పుతిన్‌తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనిపై కూడా ట్రంప్‌ తన అక్కసును వెళ్లగక్కారు. Trump Double Game.

ఇక మరోవైపు.. అమెరికా, భారత్‌ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.