
Palnadu District Train Robberies: ఆ రూట్ లో రైలు ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్న ప్రయాణీకులు. సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి రైళ్ళను దోచుకుంటున్న దోపిడీ దొంగలు. అడ్డువచ్చిన వారిపై దాడులకు సైతం వెనకాడని దొంగల ముఠా.బందిపోట్ల కంటే దారుణంగా రైళ్ళలో దోపిడీలకు పాల్పడుతున్న దొంగలు. రైళ్ళ లో దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాని ఇప్పటికీ గుర్తించలేని రైల్వే పోలీసులు. ఇంతకీ ఎక్కడా ఆ ప్రాంతం ఏమిటీ ఆ కథ..??
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ-నడికుడి మధ్య ప్రాంతంలో వరుసగా జరుగుతున్న రైలు దొంగతనాలు అటు ప్రయాణీకులకు ,ఇటీ రైల్వే పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గుంటూరు – హైదరాబాద్ రైలు మార్గాన్ని టార్గెట్ చేసుకున్న దొంగలు న్యూ పిడుగురాళ్ల – నడికుడి రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతం అద్దంకి -నార్కెట్ పల్లి ప్రధాన రహదారికి అతిసమీపంలో ఉండటం తో దోపిడీ అనంతరం దొంగలు రోడ్డుమార్గాన పారిపోవడానికి ఈ ప్రాంతం అనువుగా ఉండటం తో దొంగలు ఈ ప్రాంతాన్ని తమ దోపిడీలకు అనువుగా ఎంచుకున్నారు.రైలు లో సాధారణ ప్రయాణీకుల వలే నటిస్తూ తాము ముందుగా నిర్ధేశించుకున్న ప్రాంతానికి చేరుకోగానే చైన్ లాగి దోపిడీ చేసి మెరుపులా మాయమైపోతున్నారు.
కొన్ని సందర్బాల్లో దొంగలు అత్యంత ప్రమాదకరమైన సిగ్నల్ ట్యాంపరింగ్ కు సైతం పాల్పడుతున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ బాక్సులు పనిచేయకుండా జంక్షన్ బాక్సులో షార్ట్ సర్క్యూట్ చేసి సిగ్నల్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని ఇలాంటి చర్యల వలన రైలు ప్రమాదాలు జరిగి భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది వారాల క్రితం న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో సిగ్నల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన దొంగలు విశాఖ-చర్లపల్లి స్పెషల్ ట్రైన్ ను గంటన్నరకుపైగా నిలిపివేశారు.ఆ ట్రైన్ ఎస్4, ఎస్7 బోగీల్లోకి చొరబడి నిద్రపోతున్న ప్రయాణీకుల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యారు. బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటిరోజే తుమ్మలచెరువు రైల్వేస్టేషన్ వద్దకు విశాఖ ఎక్స్ వచ్చిన వెంటనే ఎస్ 1 బోగీలో ఉన్న దొంగలు చైన్ లాగి ట్రైన్ నిలిపివేశారు. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. దోపిడీ దొంగలు మరో బోగీలోకి వచ్చే ప్రయత్నంలో రైల్వే పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో దొంగలు పోలీసులపై రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరపడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటనలకంటే ముందే నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. విశాఖ ఎక్స్ ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు మర్చిపోకముందే రెండు రోజులక్రితం నడికుడి సమీపంలో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ను బ్రిడ్జి వద్ద చైన్ లాగి నిలిపివేశారు. ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3 భోగీల్లో ప్రయాణీకుల వద్ద లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం చేసి పరారయ్యారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో రిమోట్ ఏరియాలను అడ్డాగా చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో అయితే రైల్వేట్రాక్ అద్దంకి-నార్కెట్ పల్లి హైవేకు దగ్గరగా ఉంటుంది. దీంతో రైలులో దొంగతనాలు చేసి హైవేకు చేరుకుని పారిపోవడానికి సులభంగా ఉంటుంది. Palnadu District Train Robberies.
అందుకే ఈ ప్రాంతాలను రైలు దొంగతనాలకు అడ్డాలుగా ఎంచుకుంటున్నారు. అయితే వరుస దొంగతనాలతో పల్నాడు ప్రాంతంలో రాత్రి పూట వచ్చే రైళ్లలో నిఘాపెంచారు. దీంతో దొంగలు రూట్ మార్చారు. తాజాగా మంగళగిరి-తాడేపల్లి మధ్య రెండు రైళ్లలో దొంగతనం జరగడం కలకలం సృష్టించింది. అర్దరాత్రి సమయంలో పూణె-భువనేశ్వర్ రైలులో ప్రయాణీకురాలి బ్యాగ్ లాక్కుని దొంగలు పరారయ్యారు. అదే ప్రాంతంలో అమరావతి ఎక్స్ ప్రెస్ లో మరో మహిళా ప్రయాణీకురాలు అచ్యుతాంబ మెడలో బంగారు గొలుసు లాక్కుని జంప్ అయ్యాడు. బాధితురాలు విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరుసగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైలు దొంగతనాలు జరుగుతుండడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు రైల్వే పోలీసులకు వరుస దొంగతనాలు సవాళ్లుగా మారుతున్నాయి.