ఇచ్చాపురం నియోజకవర్గంలో YSRCP గ్రూపు రాజకీయాలు..!

YSRCP Group politics in Ichapuram constituency: అసలే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి 9 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఒక్కసారి మినహా సైకిల్ పార్టీదే హవా. అలాంటి బలమైన అసెంబ్లీ నియోజక వర్గంలో ఇతర వైసీపీ సమన్వయంతో వ్యవహరించాలి. కానీ వైసీపీ వర్గపోరు తెలుగు దేశం పార్టీకి ప్లస్ పాయింట్ అయిందట.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజక వర్గ వైఎస్సార్ సీపీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ పిరియా విజయా సాయిరాజ్ మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కి చేరింది. ఇటీవలే ఇచ్ఛాపురం నియోజక వర్గంలో వైసీపీ నిర్వహించిన బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ వేదికగా రాజకీయాలు రచ్చ కెక్కాయి. శాసన మండలి సభ్యులు నర్తు రామారావు బైక్ ర్యాలీ సెపరేట్ గా నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజక వర్గ వైసిపి సమన్వయ కర్తగా ఉన్న జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయా సాయిరాజ్ ఇచ్చాపురంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.

ఇక కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు హాజరైన వెన్నుపోటు దినోత్సవంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రత్యేకంగా బైక్ ర్యాలీ ఏర్పాటును వ్యతిరేకించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, ఇచ్చాపురంలో స్వయంగా పాల్గొన్నారు. దీంతో ఎమ్మెల్సీ నర్తు రామారావు రావాల్సి వచ్చిందట. వచ్చినా తూతూ మంత్రంగా పాల్గొని వెళ్ళిపోయారట. నర్తు, పిరియాల మధ్య రాజకీయ వైరం స్వపక్షం లో విపక్షం అన్నది గడచిన రెండు దశాబ్దాలుగా నడుస్తున్న అంశం. నర్తు రామారావు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. కాంగ్రెస్ పార్టీ లో నర్తు రామారావు ఉన్నప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జెడ్పీ చైర్మన్ భర్త సాయిరాజ్ టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ తరపున ఒకసారి, వైసిపి తరపున మరోసారి నర్తు రామారావు పోటీ చేసినా గ్రూప్ రాజకీయాలు పుణ్యమా గెలవలేక పోయారన్న టాక్ ఉంది. YSRCP Group politics in Ichapuram constituency.

ఇక సాయిరాజ్ ఒకసారి, ఆయన భార్య విజయ ఇటీవలే ఇచ్ఛాపురం బరిలో వైసిపి తరపున పోటీ చేసినా అపజయం తప్పలేదు. యాదృచ్చికం గా ఈ ఇద్దరి నేతల సయోధ్య లేకపోవడం వల్లే ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. అలాగే గడిచిన మూడు పర్యాయాలుగా ఈ ఇద్దరి వైరం టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతోంది. మూడు పర్యాయాలుగా టీడీపీ తరపున బరిలో దిగిన డాక్టర్ బెందాలం అశోక్ ప్రతీసారి మెజారిటీ పెంచుకుని హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ప్రమోషన్ పొందారు. గతంలో నర్తుకు గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీగా వైసీపీ అవకాశం కల్పించింది. విజయ ప్రస్తుతం జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.

ఈ ఇద్దరు నేతలు ఒక్కటైతే తప్పా టీడీపీ కంచుకోటకు ఎదురెళ్లే పరిస్థితి లేదు. అలా అని ఇచ్చాపురం వైసీపీ నేతల్లో సమన్వయం కుదిరే పని కాదు అన్నది అంతే వాస్తవం. 2023 ఎన్నికల్లో ఇచ్చాపురంలో పిరియా విజయా సాయిరాజ్, నర్తు రామారావు, పిలక రాజ్యలక్ష్మి, సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి, కాయల వెంకట రెడ్డి, డి విష్ణు మూర్తి రెడ్డి,నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర ఇలా చాలా మంది నేతలు టికెట్ కోసం నానా తంటాలు పడ్డారు. అందరూ జగన్ వీర విధేయులు గా చెప్పుకోవడం తప్పా, ఎన్నికల్లో బరిలో దిగిన నేతకు సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు దాదాపుగా లేవు. ఇచ్చాపురం నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ముఖ్య నేతల మధ్య బహిరంగ వార్ పై అటు అధిష్టానం నుంచీ, ఇటు జిల్లా నాయకత్వం వరకు ఎంతగా హెచ్చరించినా ఎవరి దారి వారిదే.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/a-former-chief-minister-such-a-person-is-repeatedly-being-prevented-from-visiting-the-district/