
Nara Lokesh Nepal Rescue: ప్రస్తుతం మన పొరుగుదేశం నేపాల్ అట్టుడికిపోతోంది. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉంది. చివరికి దేశ అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది… దేశ అత్యున్నత పాలనా భవనం పార్లమెంట్ తో పాటు సుప్రీంకోర్టు, అధ్యక్ష, ప్రధాని భవనాలు నిప్పుల్లో కాలిపోతున్నాయి. ప్రజలు మరీముఖ్యంగా యువత రోడ్లపైకి వచ్చి భారీఎత్తున నిరసన తెలుపుతూ పాలకులు, అధికారులను చితకబాదుతున్నారు. ఇలా సోషల్ మీడియాపై దేశంలో విధించిన నిషేదం ‘జెన్-జడ్’ ఉద్యమానికి దారితీసింది… ఇదికాస్త ఉదృతమై దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమయ్యింది. మరోవైపు నేపాల్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నేపాల్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది… అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ప్రజల వివరాలు సేకరిస్తున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా నేపాల్ లోని భారత రాయబార కార్యాలయంతో వివిధ మార్గాల ద్వారా తెలుగువారి సమాచారం సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి సంఖ్య 187 మందిగా తేలింది.
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు నాలుగు ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బఫాల్ లో 27 మందితో కూడిన తెలుగు బృందం ఉంది… వీరంతా శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సిమిల్ కోట్ లో 12 మంది, పశుపతి నగరంలో 55, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి వీరంతం సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందకు స్వయంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఆయన భారతదేశంలోని విదేశాంగ శాఖ అధికారులు, నేపాల్ లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తెలుగు ప్రజల భద్రతే ప్రాధాన్యంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కేంద్ర ఏజెన్సీలు, నేపాల్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం వార్ రూమ్ ను ఏర్పాటుచేశారు.
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకరావడమే ఏకైక అజెండా అని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నేపాల్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్ లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వీరంతా నేపాల్ లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని, వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నేపాల్ లోని బఫాల్, సిమిల్ కోట్, పశుపతి నగరం, పింగలస్థాన్ లో వీరంతా ఉన్నారని వివరించారు.
సమీక్ష సందర్భంగా నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి నారా లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన సూర్యప్రభతో మాట్లాడిన మంత్రి లోకేష్.. నేపాల్‌లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలపై మంత్రి వాకబు చేశారు. తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్‌లో చిక్కుకుపోయామని, ప్రస్తుతం ఓ హోటల్‌లో సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వారికి ధైర్యం తెలిపారు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు అధికారులు మీతో సంప్రదిస్తారని భరోసా ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని వారిలో ధైర్యం నింపారు.
నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఇప్పటివరకు వచ్చినా అధికారిక సమాచారం ప్రకారం నేపాల్‌లో 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నట్లుగా సమాచారం. బఫాల్లో 27 మంది చిక్కుకున్నారు. వీరు శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. అదే విధంగా సిమిల్ కోట్లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది ఉన్నారు. అలాగే గౌశాలలోని పింగలస్థాన్లో 90 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. Nara Lokesh Nepal Rescue.
నేపాల్ పర్యటనకు వెళ్లి ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన తెలుగు ప్రజలకు తక్షణ సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తెలుగు వారు నోడల్ అధికారి సురేష్‌ను సంప్రదించవచ్చునని ఓ ప్రకటనలో పేర్కొంది.