ఢిల్లీలో మంత్రి లోకేష్..!

Nara Lokesh & Union Ministers: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.కేవలం భేటీలతో సరిపుచ్చడమే కాదు..రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా లోకేష్ వారికి పలు విజ్ణప్తులు చేస్తున్నారు. లోకేష్ వినతలు పట్ల అటు కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. నారా లోకేష్ ఇవాళ హస్తినలో కేంద్ర మంత్రులు జైశంకర్, జేపీనడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతీరామన్ లతో వరుసగా భేటీ అయ్యారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఇవాళ పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఏపీకి సంబంధించిన పలు విజ్ఞప్తులను వారికి విన్నవించారు. వీలైనంత మేర ఏపీకి నిధులు, ప్రాజెక్ట్ లు తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టీడీపీ వర్గాలంటున్నాయి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తో మొదలు పెట్టి జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ ను లోకేష్ కలిశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని మంత్రి జైశంకర్ ని లోకేష్ కోరారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో రాష్ట్రం టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ లో నేషనల్, ఇంటర్నేషనల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించాలన్నారు.

రాష్ట్రంలో యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను నారా లోకేష్ కోరారు. లోకేష్ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈనెల 21నాటికి సమస్య పరిష్కరిస్తామని నడ్డా హామీ ఇచ్చారు. రాష్ట్రానికి 29వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని నడ్డా చెప్పారు. ఏపీలో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు. విశాఖలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చి పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని సిద్ చేసిందని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు.

ఏపీలో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు సహకారం అందించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని లోకేష్ కోరారు. కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు.ఈ ఏడాది చివరి నాటికి రిఫైనరీ ని స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. ప్రాజెక్టు ని సకాలంలో పూర్తిచేసేందుకు కేంద్రం కూడా సహకరించాలని లోకేష్ అభ్యర్థించారు.

ఇక ఏపీలో రోడ్ల విస్తరణ ప్రాజెక్ట్ లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి వినతిపత్రాలు అందించారు మంత్రి లోకేష్. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు నుంచి మచిలీపట్నం మధ్య ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మధ్య కనెక్టివిటీలో NH-65 ది కీలక పాత్ర అని, హైదరాబాద్– గొల్లపూడి రోడ్డు విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజిని డీపీఆర్ లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఈస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం కావాలన్నారు. బెంగుళూరు – చెన్నై రోడ్డు డైరక్ట్ కనెక్టవిటీ కోసం కుప్పం-హోసూరు – బెంగుళూరు మధ్య 56 కిలోమటర్ల మేర 3వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి పర్మీషన్స్ ను త్వరితగతిన మంజూరు చేయాలని కూడా లోకేష్ కోరారు. Nara Lokesh & Union Ministers.

ఇదే క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్ ను కోరారు. ఐదుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయిన నారా లోకేష్.. ఏపీకి రావాల్సిన అభివృద్ధి ఫలాలను వెంటనే విడుదల చేయోలని కోరడం విశేషం. ఈ భేటీల అనంతరం మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. తొలిసారి టిడిపిపి కార్యాలయానికి వచ్చిన సందర్భంగా టీడీపీ, జనసేన ఎంపీలు లోకేష్ ని సత్కరించారు.

join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q