పండగ చేసుకోండి..!!

Car GST 2.o: ఈసారి దసరా పండుగ సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. కొత్త కారు కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్‌టీ రేట్ల కోతతో కంపెనీలు వరుస పెట్టి కార్ల ధరలను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి వాటి కార్ల ధరలలో కోతలు విధించాయి. వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో కారు ధరలు దిగొచ్చాయి. కొత్త ధరలు ఈనెల 22 నుంచి ఇంప్లిమెంట్ కానున్నాయి. మరి ఏ మోడళ్ల ధరలు ఎంత తగ్గాయి? ఏ కంపెనీ బంపర్ ఆఫర్లు అందిస్తోంది?

కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లలో కోత విధించడంతో కొనుగోలుదార్లలో కొత్త ఉత్సాహం మొదలైంది. సరిగ్గా దసరా పండుగ సీజన్ ప్రారంభమయ్యే ఈనెల 22 నుంచే కంపెనీలు భారీగా కార్ల ధరలను తగ్గిస్తున్నాయి. కారు కొనాలనుకునేవారి ఆశలకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా ధరలు భారీగా దిగివస్తున్నాయి. తాజాగా తగ్గింపు ప్రకటించిన కంపెనీల్లో కియా, ఎంజీ మోటార్, నిస్సాన్, ఆడి ఉన్నాయి. ఇది వరకే టాటా మోటార్స్, హ్యుందాయ్, రెనో, మహీంద్రాలు కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

జీఎస్టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో మహీంద్రా కంపెనీ బొలెరో నియో ధరను 1లక్షా27వేలకు తగ్గించింది. xuv 3xo పెట్రోల్ వెర్షన్ పైన లక్షా 40వేలు, డీజిల్ వెర్షన్ పైన లక్షా 56వేలు తగ్గించింది .ఇక థార్ ధర లక్షా 35వేల వరకు, థార్ రాక్స్ ధర లక్షా 33వేలకు తగ్గింది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్ ధరలు వరుసగా లక్ష నుంచి లక్షన్న వరకు తగ్గాయి. xuv700 ధర లక్షా 43వేలు తగ్గింది.

ఇక టాటా మోటార్స్ కూడా తగ్గేదే లేదంటూ ధరలను భారీగా తగ్గించింది. తమ మోడళ్ల కార్లపై దాదాపుగా లక్షా 45 వేల వరకు ధర తగ్గించింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ ధరలు వరుసగా 75వేల, 80వేలు, లక్షా 10వేల వరకు తగ్గాయి. పంచ్, నెక్సాన్ ధరలు వరుసగా 85వేలు, లక్షా 55వేల వరకు తగ్గాయి. కర్వ్ ధర 65వేలు తగ్గింది. హారియర్, సఫారీ ధరలను వరుసగా లక్షా 4వేల నుంచి లక్షా 45వేల వరకు తగ్గించింది.

నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ టయోటా తమ మోడళ్లపై 3 లక్షల 49వేల వరకు ధర తగ్గించింది. ఫార్చ్యూనర్ ధర గరిష్టంగా 3లక్షల 49వేలు తగ్గింది. లెజెండర్ 3లక్షల34వేలు, హిలక్స్ 2లక్షల52వేలు, వెల్ఫైర్ 2లక్షల78వేలు, కామ్రీ లక్ష వరకు తగ్గాయి. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ ధరలు వరుసగా లక్షా 80 వరకు తగ్గాయి . ఇతర మోడళ్ల ధరలు లక్షా 11 వేల వరకు తగ్గనున్నాయి ఇక రెనాల్ట్ కూడా తమ మోడళ్ల ధరలను తగ్గించింది. రెనాల్ట్ కార్ల ధరలు 96వేల వరకు తగ్గుతాయి. ఇందులో కైగర్ ధర గరిష్టంగా 96వేల395 రూపాయలు తగ్గనుంది.

కియా కార్ల ధరలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు.. ఏకంగా కొన్ని మోడల్స్‌పై లక్షల్లో ధరలు తగ్గించేసింది. కియా అన్ని ఎస్‌యూవీ, ఎంపీవీలకు ఈ తగ్గింపును వర్తింపజేస్తోంది. ముఖ్యంగా సోనెట్, సైరస్, సెల్టోస్, క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్, కార్నివాల్ వంటి మోడల్స్‌పై భారీ తగ్గింపులు లభించనున్నాయి.సోనెట్ ‌పై లక్షా 64వేలు తగ్గించింది. సైరస్ మోడల్‌పై అత్యధికంగా లక్షా 86వేల ధర తగ్గింది. సెల్టోస్ పై 75వేల తగ్గింపు లభిస్తుంది. క్యారెన్స్ మోడల్‌పై 48వేలు , క్యారెన్స్ క్లావిస్ పై 78వేల తగ్గింపు లభించనుంది. ఇక కార్నివాల్ మోడల్‌ ధరలను భారీగా తగ్గించింది ఈ మోడల్ పై ఏకంగా 4లక్షల48వేల రూపాయల ధర తగ్చింది. Car GST 2.o.

ఇక లగ్జరీ కార్ బ్రాండ్స్ కూడా జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తోంది. బీఎండబ్ల్యే కంపెనీ తమ కార్ల ధరలను 8లక్షల 9వేల వరకు తగ్గించింది. ఆడి ఇండియా తన క్యూ3 పై 3లక్షలు మొదలుకుని, క్యూ8 పై 8 లక్షల వరకు ధర తగ్గించింది. మెర్సిడెస్‌ బెంజ్‌ తన మోడళ్లపై 2లక్షల6వేల నుంచి 11 లక్షల వరకు తగ్గించింది. లెక్సస్‌ తన ఆరు మోడళ్లపై లక్షా 47వేల నుంచి 20 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే వినియోగదారులు సెప్టెంబర్ 6 నుంచి తగ్గించిన ధరలకే బుక్ చేసుకోవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q