‘ఓజీ’ కోసం 117 మంది సంగీత కళాకారులు..!

OG Music Artists: టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత భారీ అంచనాల మధ్య ఎదురుచూస్తున్న చిత్రాల్లో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఓజీ’ (OG) ముందంజలో ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుండటంతో, ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచింది. పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు, మ్యూజికల్ అప్‌డేట్స్ అంటూ చిత్ర బృందం వరుసగా ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.ఎస్. థమన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పాటల గ్లింప్స్‌లోనే ఆయన వర్క్‌ స్థాయి స్పష్టంగా కనిపిస్తోంది. థమన్ ప్రస్తుతం ‘ఓజీ’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర మ్యూజికల్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. లండన్‌ స్టూడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ జోరుగా సాగుతోంది. అంతేకాదు, దీని కోసం ఏకంగా 117 మంది సంగీత కళాకారులు కలిసి పనిచేస్తున్నట్లు థమన్ వెల్లడించారు. నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చిందన్నారు . తమన్‌ పోస్ట్‌తో #HungryCheetah హ్యాష్‌ ట్యాగ్‌ మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. OG Music Artists.

మాములుగా తమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అఖండ లాంటి డివోషనల్ మూవీకి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది. అంతేకాదు ఆ సినిమా ఆర్ ఆర్ కి సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. అలాగే ఈ ఏడాది డాకూ మహారాజ్ మూవీలో థమన్ బీజియం సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను మించేలా తమన్.. ఓజి కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. . డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో పవన్ సరసన మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్‌ కథానాయిక నటించింది. ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడి పాత్ర పోషించారు.