
Biggboss Contestant Lobo : టీవీ షోలలో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న.. బిగ్‌బాస్ షోతో సెలెబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న ఖయూమ్ అలియాస్ లోబోకు భారీ షాక్ తగిలింది. ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి తాజాగా జనగామ జిల్లా కోర్టు ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు టీవీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
2018, మే 21న ఓ టీవీ ఛానెల్ షూటింగ్ కోసం లోబో తన టీమ్‌తో కలిసి రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయి స్తంభాల గుడి ప్రాంతాలకు పర్యటనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సమయంలో, లోబో తానే కారును నడుపుతూ రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పెంబర్తి గ్రామానికి చెందిన మణెమ్మ మరియు మేడె కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతతో లోబో కారు కూడా అదుపుతప్పి బోల్తా పడింది, అందులో ప్రయాణిస్తున్నవారికి కూడా గాయాలయ్యాయి. Biggboss Contestant Lobo.
ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు లోబోపై కేసు నమోదు చేశారు. పోలీసులు పలుమార్లు విచారణలు జరిపి, అవసరమైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన విచారణలో లోబో నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఫలితంగా, ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.
సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించిన లోబో, స్టార్ మా మ్యూజిక్ తో పాటూ ఇతర టీవీ షోలలో యాంకర్‌గా మంచి గుర్తింపు పొందారు. బిగ్‌బాస్ షో ద్వారా ప్రజల్లో తన ప్రత్యేక హౌస్‌స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ టాటూ స్టూడియోను నడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయనకు జైలు శిక్ష పడటంతో, ఇది ఆయన ప్రొఫెషనల్ లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.