
Low Budget High Collection Movies: ఈ ఏడాది బాక్సాఫీస్ తీరు అందరినీ ఆశ్చర్యపెట్టింది. ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సినిమాల ఫలితాలు వచ్చాయి. తక్కువ బడ్జెట్‌తో తీసిన కొన్ని సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబట్టగా, భారీ స్థాయిలో నిర్మించిన స్టార్ హీరోల సినిమాలు నిరాశపరిచాయి. కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలే విజయం సాధిస్తున్నాయని ఈ ట్రెండ్ స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా యాభై కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌లో రూపొందిన సినిమాలు నిర్మాతలకు బంగారు బాటను తెచ్చిపెట్టాయి.
సంక్రాంతికి వస్తున్నాం: వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ ఏడాది టాలీవుడ్‌కు మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు పోటీగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా, వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుర్తింపు పొందింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూ.50 కోట్ల బడ్జెట్‌తో తయారై, రూ.303 కోట్ల వసూళ్లను రాబట్టింది.
మహావతార్ నరసింహా: ఇక మహావతార్ నరసింహా అనే యానిమేషన్ చిత్రం ఊహించని రీతిలో ఘనవిజయం సాధించింది. విడుదలకు ముందు పెద్దగా ఆసక్తి లేనప్పటికీ, కంటెంట్ బలంగా ఉండటంతో ఈ చిత్రం థియేటర్లలో నెల రోజులు గడిచినా కూడా సూపర్ రన్ కొనసాగిస్తోంది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ యానిమేషన్ మూవీ ఇప్పటివరకు రూ.315 కోట్ల వసూళ్లు సాధించి, భారతీయ యానిమేషన్ సినిమాల రికార్డులను తిరగరాసింది.
సయ్యారా: బాలీవుడ్ బాక్సాఫీస్ కి సైయారా చిత్రం ఊపిరి పోసింది. అహాన్ పాండే, అనీత్ పడ్దా లు హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ సినిమా, మోహిత్ సూరి తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరీ. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.600 కోట్ల వసూళ్లు సాధించి బాలీవుడ్‌లో ఈ ఏడాది రెండవ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
కొత్త లోక: దుల్కర్ సల్మాన్ నిర్మించిన ‘కొత్త లోక’ అనే లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా మలయాళ పరిశ్రమలో చరిత్ర సృష్టించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా, విడుదలైన వారం రోజుల్లోనే రూ.185 కోట్ల వసూళ్లు రాబట్టింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మహిళా ప్రాధాన్య చిత్రంగా నిలిచింది.
తుడరుమ్: మరోవైపు మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ చిత్రం రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొంది రూ.235 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి భారీ లాభాలను ఇచ్చింది. ఈ చిత్రం కూడా కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సినిమా కావడం గమనార్హం. Low Budget High Collection Movies.
మొత్తానికి ఈ ఏడాది విడుదలైన సినిమాల పరిస్థితి చూస్తే, ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ వాల్యూ కన్నా కంటెంట్‌ను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి కథలు, వినూత్నమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ పెద్ద విజయాలు అందుకుంటున్నాయి.