మెగాస్టార్ బర్త్ డే స్పెషల్…!

Megastar Chiranjeevi Birthday Special: ఉప్పెనలా ఉప్పొంగిన ఆ ఉపద్రవం.. మూవీ చుట్టూ ముసురుకున్న మూస పద్దతుల్ని ఊడ్చిపడేసింది. విరుచుకుపడ్డ ఆ వెండితెర విప్లవం.. 24 క్రాఫ్ట్స్ రూపురేఖల్నీ మార్చిపారేసింది. ఊహలకందని ఆ ఉత్పాతం.. పాతదనాన్ని పాతరేసింది. ఆ అద్భుతాన్ని ఆకళింపుచేసుకోటానికి.. కొత్తదనానికి కూడా కొంత సమయం పట్టింది. ఇదంతా ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. నిబద్ధతతో నిలబడి.. సంకల్పబలం తో సక్సెస్ కు చిరునామాగా మారిన చిరు, 70 వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా మెగా 9 టీవీ ప్రత్యేక కథనం మీకోసం…

అతను సెట్ లో నిలబడితే.. రీళ్లు నోళ్లు తెరుకుని నిర్ఘాంతపోయాయి. లైట్లు ఆ వెలుగు ముందు వెలవెలబోయాయి. కెమెరాలు ఆ దృశ్యాన్ని పట్టుకోలేక పట్టుకోల్పోయాయి. చలనచిత్రం ఆ కదలికల్ని చూసి స్తంభించిపోయింది. అప్పుడే.. అతను కాలుపెట్టినప్పుడే కళామతల్లి పులకించిపోయింది. అతను అడుగేసినప్పుడే ఆబాలగోపాలం అబ్బురపడింది. అతని రాకతో.. తెలుగు సినిమా మళ్లీ పుట్టింది.స్టైల్.. బోసినవ్వులతో కేరింతలు కొట్టింది. హీరోయిజం.. నడకలు నేర్వటం మొదలుపెట్టింది. హీరో.. అనే పదానికి నామకరణం జరిగింది. డైలాగ్.. అన్నదానికి అన్నప్రాసన వేడుక పూర్తైంది. స్టార్ డమ్ కి అక్షరాభ్యాసం ఆరంభమైంది. నాట్యానికి భంగిమలు పరిచయం కావటం ప్రారంభమైంది.

అలా పెరిగి పెరిగి పెద్దైన ఒక శిఖరాన్ని అందరూ ముద్దుగా.. మెగాస్టార్ అంటారు. పెద్దగా.. కొణిదెల శివశంకర వరప్రసాద్ అని పిలుస్తారు. రఫ్ గా.. చిరంజీవి అని కొలుస్తారు. ఆయన చేసిన పాత్రల్ని ప్రస్తావించటం సముచితం కాదు. ఆ రివార్డుల్నీ, రికార్డుల్నీ ఏకరువుపెట్టడం అవివేకమే. ఆ ఘనతని ఇప్పటికీ చూస్తూనే ఉందీ లోకం. తాను కొల్లగొట్టిన హృదయాల్ని తెలుసుకోవటం, చుక్కల్ని లెక్కించటం.. రెండూ ఒకటే. చరిత్రలోకి చిరంజీవి రాలేదు.. చిరంజీవే చరిత్ర రాశారు. దాన్ని ఎప్పటికప్పుడు తిరగరాసుకుంటూ వెళ్ళారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు చీటీలతో కప్పేస్తారు. మాటలు విందామంటే విజిల్స్ తో కమ్మేస్తారు. స్టంట్స్ చూద్దామంటే అరుపులతో అడ్డొస్తారు. డాన్స్ వీక్షిద్దామంటే చొక్కాలు విప్పి గిరగిరా తిప్పేస్తారు.

ఏందీ అభిమానం..! మెగాస్టార్ కే ఎందుకా స్థానం.. ?
ఎవరితను..! మనకు తెలిసిన మనిషా.. మన ఇంటి మనిషా.. మనలో అతనున్నాడా.. ! అతనే మనమయ్యామా.. ! ఆ చిరుతపులి కళ్లని చూస్తే మన రక్తం ఎందుకు మరుగుతోంది..! ఆ గాంభీర్యమైన గొంతు వింటే అంతుపట్టని అనుభూతి ఎలా కలుగుతోంది..! అతను అలా కదిలితే.. మన శరీరం ఎందుకిలా పులకిస్తోంది.. ! ఒక మనిషి ఇంతలా మంత్రిస్తాడా.. ? ఒక హీరో అంతగా నచ్చేస్తాడా.. ?

అసలు ఎవరీ చిరంజీవి.. ?
మన కథల్లో,యదల్లో..మన కలల్లో, కదలికల్లో ఎందుకు కనిపిస్తున్నాడు..? థియేటర్లోంచి బయటికొచ్చినా.. మనలోంచి మాత్రం ఎందుకు బయటికిపోవటం లేదు..? ఒక్కడిగా పుట్టి.. కోట్లాది మందిలో ఎలా జీవిస్తున్నాడు..?

చిరంజీవి అంటే ఎందుకంత ప్రత్యేకత..?
ఆయనలో ఏముందని ఆరా తీస్తే… అతని ద్వారా ప్రసరించే ఆ ఆరా వల్లే.. మనకీ ఆరాధనా భావం కలుగుర్తుందనిపిస్తుంది. చెక్కు చెదరని ఆ ఆత్మవిశ్వాసం ఎవరెస్ట్ శిఖరాన్ని తనలో చూసుకునేలా చేస్తోంది. తనలో అల్లుకున్న ఆ సానుకూల శక్తి వల్లే.. తనపై వల్లమాలిన అభిమానం పుడుతోంది. చిరంజీవి అంటే బహిర్గత రూపం కాదు.. అంతర్గత లోకం. చిరంజీవి అంటే పేరు కాదు. అదో నిష్కల్మష హృదయం..చిరంజీవి అంటే కథానాయకుడు కాదు. నిరంతర శ్రామికుడు. అందుకే.. మనదీ, తనదీ వెండితెర వరకే ఉండిపోయే పరిచయం కాదు. అది తెర దిగిపోగానే తెగిపోయే బంధం కాదు. హృదయాంతరాల్లోకి ఒదిగిపోయే దివ్యానుభూతి. చిరంజీవి అంటే.. తెరలోకానికే పరిమితమయ్యే ఎమోషన్ కాదు. ప్రతిరోజూ మనతో పెనవేసుకొనే ఓ రిలేషన్.

అంతే కాదు… చిరంజీవి అంటే.. టైటిల్ కార్డ్ తో మొదలయ్యే కథ కాదు. శుభం కార్డ్ తో ఆగిపోయే సినిమా కాదు. చిరంజీవి అంటే.. కొనసాగే జీవితం.. మన స్వగతం. చిరంజీవి ఉంది సినిమాల్లో కాదు. మన జీవితాల్లో.. మన భావోద్వేగాల్లో, జీవనరాగాల్లో.. మన స్నేహాల్లో, దాహాల్లో .. మన ప్రేమల్లో, హృదయ సీమల్లో.. మన కలల్లో, ఆంతరంగిక అలల్లో.. మన వ్యాపకాల్లో, మన జ్ఞాపకాల్లో..ఈ మన హీరో పాటల పుస్తకం పాఠ్యపుస్తకాల్లోనే కాదు, మదిలో కూడా పదిలమే.. టూరింగ్ టాకీస్ తో మొదలైన ఆ మెగా రోరింగ్.. ఇవాల్టి మల్టీ ప్లెక్స్ లో కూడా మోత మోగిపోతోంది. గంటల కొద్దీ క్యూ లైన్లలో చెమటతో తడిచి.. జుట్టు చెదిరి ..చొక్కాలు చిరిగినా మొఖంలో అంతు తెలియని ఆనందం అనుభవించిన అభిమానులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే వారి బిగించిన పిడికిలి లో ఉన్నది చిత్తు కాగితం కాదు… చిరంజీవి సినిమా టిక్కెట్టు..

ఇలా మెగాస్టార్ గురించి కి చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు… రాసుకుంటూ పోతే కలం ఆగిపోదు.. కాలం అంటని క్రేజ్.. ఎవ్వరికీ లేని ఈజ్.. దేనికీ లొంగని కరేజ్.. దటీజ్.. మెగాస్టార్. దశాబ్దాలుగా మనం ట్రెండ్ మార్చిన హీరోల్ని చూశాం.. నటనకు అర్థం మార్చిన ఆర్టిస్టుల్ని కూడా చూశాం.. అలాగే ఇండస్ట్రీ రికార్డ్స్ మార్చిన లెజెండ్స్ నీ చూశాం.. కానీ.. ఒకే ఒక్కడు.. చిరంజీవి అనే ఒక్కడు. రంగుల ప్రపంచం ముఖచిత్రాన్నే మార్చేశాడు. ఆకుల్నీ,కొమ్మల్నీ, పిల్లవేరుల్నీ ముట్టుకోలేదు.. సినిమా చెట్టు తల్లివేరునే పట్టుకున్నాడు. అంజనీపుత్రుడై పెకలించి తన గుండె లోతుల్లో నాటుకున్నాడు. అప్పటినుంచీ చలనచిత్ర వటవృక్షం చిరంజీవి నీడలో పెరిగింది. ఇపుడు శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ సినీవనానికి తోటమాలిగా తోడున్నాడు. ఈ అందరివాడు.

తెలుగు సినిమా చరిత్రని లిఖించాలంటే రెండు అధ్యాయాలుగా కాదు.. రెండు పుస్తకాలుగా విడగొట్టి రాయాలి. అందులో ఒకటి చిరంజీవికి పూర్వం.. మరొకటి చిరంజీవి పర్వం.. ఎందుకంటే.. వాటి రూట్స్ నే రివైజ్ చేసిన ఇన్నోవేటర్.. ఈ మెగా ఫైటర్. టాలెంట్ అనేది ఏ ఒక్కడి పేటెంట్ కాదు అని అందరిలో ఆత్మస్థైర్యం నింపిన
నిలువెత్తు నిదర్శనం చిరంజీవి. పరిశ్రమలోని పెత్తందారుల గుత్తాధిపత్యాన్ని తన మర్యాదతో మడత పెట్టేసిన మట్టి మనిషి అతను. బ్యాక్ గ్రౌండ్ అనే ట్యాగ్ లేకపొయినా, తెరపై కనిపించాలనే ఆశ అనామకుల్లో కూడా అంకురించటానికి ఆదిమూలం చిరంజీవి. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్ళకి బ్యాక్ బోన్ గా ఉంటానని చాటిన ఆశాజీవి ఈ చిరంజీవి.

అంతేకాదు.. మనం సమాజం నుంచి ఏం తీసుకున్నాం అనే కంటే సమాజానికి మనం ఏం ఇచ్చాం అని ఆలోచన చేయడమే కాదు.. ఐ బ్యాంక్.. బ్లడ్ బ్యాంకులతో .. తన మనసునే ట్రస్ట్ గా మార్చి కొన్ని లక్షలమందికి సాయం చేసి దాన్ని సేవగా భావించే మహోన్నత శిఖరం ఈ చిరంజీవి. అంతే కాదండోయ్.. చిరంజీవి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే… చిరంజీవి అంటే వెండితెరపై కనిపించే హీరో కాదు.. హీరోల్ని సృష్టించే హీరో అతను. మనలో ఉన్న నిరాశను పోగొట్టి ఏదో సాధించాలన్న తపనను నిత్యం రగిలించే జోష్ అతను.. అందుకే ఆయన అంజనమ్మకు కన్నయ్య… తెలుగు జనానికి అన్నయ్య…

70 వ వసంతంలో అడుగుపెడుతున్న విశేష సందర్భాన్ని పురస్కరించుకుని మన మెగాస్టార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది మెగా9 టీవీ.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q