చిరు, ప్రభాస్ కు పోటీగా రవితేజ..!

2026 Sankranti Movie Clash: తెలుగు సినిమా ప్రేక్షకులకైతే సంక్రాంతి సీజన్ అంటే పండుగతో పాటు పక్కా సినిమా ఫెస్టివల్! ఈ సీజన్‌కు భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయన్న అంచనాలతో టాప్ హీరోలు తమ సినిమాల్ని ఇదే టైంలో రిలీజ్ చేయాలని చూస్తుంటారు. ఏటా నాలుగైదు సినిమాలు పోటీపడుతూ పెద్ద ఎత్తున వినోదాన్ని పంచుతుంటాయి. ఇప్పుడు 2026 సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల గడువు ఉండగానే, పలు భారీ ప్రాజెక్టులు థియేటర్లలో దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, వచ్చే ఏడాది మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూజా కార్యక్రమాల సమయంలోనే మేకర్స్ ఈ మూవీని సంక్రాంతి 2026లో విడుదల చేస్తామని ప్రకటించారు. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ పలు వాయిదాల తర్వాత సంక్రాంతి బరిలోకి ఎంటర్ అవుతోంది. ముందు ఈ సినిమా డిసెంబర్ 5, 2025న విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల ఆ డేట్ మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 9, 2026న రిలీజ్ కానుంది.

ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండటంతో సంక్రాంతి సందర్బంగా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది కాదు గానీ, గతంలో 2004లో ‘అంజి’, ‘వర్షం’ సినిమాల మధ్య సంక్రాంతి పోటీ జరిగితే ప్రభాస్‌ విజయం సాధించాడు. ఇప్పుడు ఇద్దరూ మాస్ ఇమేజ్‌తో మళ్లీ గట్టిగా తలపడతుండటంతో ఈ పోటీకి మరింత ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా సంక్రాంతి బరిలోకి మరో మాస్ స్టార్ అడుగుపెడుతున్నాడు. రవితేజ ప్రధాన పాత్రలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతి టార్గెట్‌గానే ప్లాన్ చేసినా, కార్మికుల సమ్మె కారణంగా కొద్దిగా ఆలస్యం జరిగింది. 2026 Sankranti Movie Clash.

అయితే ఇప్పుడు అన్ని పనులు వేగంగా జరుగుతుండటంతో ఈ మూవీ జనవరి 13, 2026న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. ‘అనార్కలి’ అనే టైటిల్ చర్చలో ఉండగా, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. షూటింగ్‌ను అక్టోబర్ నాటికి పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్‌ను ప్రారంభించి సమయానికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాదు రవితేజ శ్రీలీలతో కలిసి చేస్తున్న ‘మాస్ జాతర’ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అంటే రెండు నెలల గ్యాప్‌లో రవితేజ నుంచి రెండు సినిమాలు రావడం ఫ్యాన్స్‌కి డబుల్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు