సీక్రెట్ గా ఎంగేజ్మెంట్..!

Nivetha Pethuraj Secretly engaged: హీరోయిన్ నివేదా పేతురాజ్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను అభిమానులతో పంచుకుంది. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ సందర్భంగా తన కాబోయే జీవిత భాగస్వామితో కలిసి దిగిన ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.

చెన్నైకు చెందిన నివేదా పేతురాజ్‌ 2016లో సినీ రంగ ప్రవేశం చేసి, అదే ఏడాదిలో ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం వంటి పలు చిత్రాల్లో నటించినా ఎందుకో స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది. కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ ముద్దగుమ్మ ఒక్కసారిగా తన పెళ్లి వార్తతో నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చింది.

కేవలం నటన, మోడలింగ్‌తొ మాత్రమే కాకుండా, కారు రేసింగ్ వంటి విభిన్న రంగాల్లో కూడా తన ప్రతిభను చాటిన నివేదా, ఇటీవల మధురైలో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు ఆమె జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. నివేదాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్. ఇతను దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నప్పటికీ, దీనిని బహిరంగంగా ప్రకటించకుండా తగిన గోప్యత పాటించారు. ఎంగేజ్‌మెంట్ పూర్తైన తర్వాతే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

వీరి వివాహ వేడుకను సాదాసీదాగా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయానికి వచ్చాయని సమాచారం. ఈ సంవత్సరం చివర్లో వివాహం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు నివేదాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు ఆమె కాబోయే భర్త రాజ్‌హిత్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తితో ఇంటర్నెట్‌ లో తెగ వెతికేస్తున్నారు.