
Raghava Lawrence Free school: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ‘రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అనేకమందికి సహాయం చేసిన ఆయన, అనాథ పిల్లలకు పెద్దదిక్కుగా నిలిచారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు స్థాపించి అనేకమందికి ఆశ్రయం కల్పించారు. తాజాగా ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. లారెన్స్ తన మొదటి ఇంటిని పేద పిల్లల కోసం ఉచిత పాఠశాలగా మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కాంచన 4’ సినిమాకి తీసుకున్న అడ్వాన్స్‌తో ఈ సేవా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన ఇంట్లో పెరిగిన ఓ విద్యార్థి ఈ పాఠశాలలో మొదటి టీచర్‌గా పనిచేయబోతున్నారని వెల్లడించారు.‘కాంచన 4’ షూటింగ్ సగం పూర్తయింది. ఈ సినిమాకి తీసుకున్న అడ్వాన్స్‌తో నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత పాఠశాలగా మార్చుతున్నాను. ఈ ఇల్లు నాకు ఎంతో ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్‌గా పొదుపు చేసిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత దాన్ని అనాథాశ్రమంగా మార్చాను. ఇప్పుడు మళ్లీ పిల్లల విద్య కోసం అంకితం చేస్తున్నాను అని లారెన్స్ తెలిపారు. Raghava Lawrence Free school.
నా ఇంట్లో పెరిగిన పిల్లల్లో ఒకరు ఇప్పుడు టీచర్‌గా ఈ స్కూల్‌లో చేరబోతున్నారు. ఇది నాకు మరింత గర్వకారణం. మీ అందరి ఆశీస్సులు, మద్దతు ఎప్పుడూ నాతో ఉంటాయని ఆశిస్తున్నాను. ‘సర్వీస్ ఈజ్ గాడ్’ అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు లారెన్స్‌ను నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇటీవలే రాఘవ లారెన్స్ 80 ఏళ్ల వృద్ధుడు రాఘవేంద్ర గురించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి స్పందించారు. భార్య చేసిన స్వీట్స్‌ను చెన్నై లోకల్ రైళ్లలో అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న ఆ వృద్ధుడికి రూ.1 లక్ష సాయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన వివరాలు తెలిసినవారు చెప్పాలని కోరుతూ, మీకు రైళ్లలో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొనుగోలు చేసి సహాయం చేయండి అని ప్రజలను అభ్యర్థించారు.