‘మిరాయ్’ రాముడి క్యారెక్టర్ లో ఆ టాలీవుడ్ హీరో.!

Rana Daggubati As Lord Rama: మరో రెండు రోజుల్లో తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయ్ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. ఫస్ట్ డే టాక్ బాగుంటే, మిరాయ్ కూడా హనుమాన్ తరహాలో తేజ ఖాతాలో మరో సాలిడ్ హిట్‌గా నిలిచే అవకాశం పుష్కలంగా ఉంది.

సినిమా ట్రైలర్ చివర్లో శ్రీరాముడి పాత్రకు సంబంధించిన ఓ చిన్న షాట్ చూపించారు. అయితే, ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, మిరాయ్ లో శ్రీరాముడిగా కనిపించేది టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా అని తెలుస్తోంది. ఈ పాత్ర చాలా కీలకమైనదిగా ఉండబోతుందని, సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ పవర్‌ఫుల్ ఎంట్రీతో రానా స్క్రీన్‌పై దర్శనమిస్తారని సమాచారం. తేజ సజ్జ కోసం ఈ పాత్ర చేయడానికి రానా వెంటనే ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ఓ కొత్త స్థాయి సినిమా అనుభూతిని అందించనున్నాయని టీమ్ భావిస్తోంది.

హనుమాన్తో పాన్ ఇండియా క్రేజ్ పొందిన తేజ సజ్జా, ఇప్పుడు మిరాయ్ సినిమాతో తన మార్కెట్‌ను మరింత విస్తరించాలని భావిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. విజువల్ ఎఫెక్ట్స్, కథనం పరంగా ఈ సినిమా మరో లెవెల్లో ఉంటుందని ఇప్పటికే ట్రైలర్ అద్భుతంగా చూపించింది. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన మరో ప్రధాన పాత్రలో విలన్‌గా నటిస్తున్నాడు మంచు మనోజ్. ఈ పాత్ర తనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకంతో మనోజ్ ఈ ప్రాజెక్ట్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. తన నెగటివ్ షేడ్స్‌ను కొత్తగా ఆవిష్కరించే ఈ అవకాశం తలుచుకొని క్యారెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేశాడట. Rana Daggubati As Lord Rama.

మిరాయ్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుండటంతో, ప్రమోషన్‌పై కూడా తేజ సజ్జా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సినిమా కంటెంట్ నిజంగానే టీజర్, ట్రైలర్‌ల స్థాయిలో ఉంటే, OG వచ్చేవరకు బాక్సాఫీస్‌ మీద మిరాయ్ హవా కొనసాగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.