బాలయ్య ఖాతాలో మరో రికార్డ్…!!

Balakrishna NSE Trading Bell: టాలీవుడ్‌లో మాస్‌ ఇమేజ్‌కు మారుపేరు, నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో తన కెరీర్‌లోనే ఊహించని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సినిమాలు, రాజకీయాలు, సామాజిక సేవలు — అన్ని రంగాల్లోనూ ఆయన స్పష్టమైన ముద్ర వేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‌ దుమ్ము లేపుతుండగా, మరోవైపు రాజకీయంగా తన స్థిర స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించారు.

కేవలం సినిమాలపరంగానే కాకుండా, సామాజిక సేవలతోనూ దేశవ్యాప్తంగా పేరుగాంచారు బాలయ్య. తండ్రి నందమూరి తారక రామారావు ఆశయాలనుసరించి స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందేలా చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగతంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సేవా కార్యక్రమాలకు నిరంతరంగా సమయం కేటాయిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఈ సేవా కృషిని గుర్తించి ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్‌లో ఆయనకు ప్రస్తానం దక్కింది. తాజాగా బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) వారు బాలయ్యను ప్రత్యేకంగా ఆహ్వానించి, ట్రేడింగ్ బెల్ మోగించే అవకాశాన్ని కల్పించారు. బాలయ్యతో పాటు బసవతారకం హాస్పిటల్‌ ప్రతినిధులు ఈ సందర్బంగా NSEని సందర్శించారు. సాధారణంగా NSE ట్రేడింగ్ బెల్ మోగించే హక్కు కేవలం విశిష్ట గౌరవార్థులకే లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తొలి దక్షిణాది సినీ నటుడిగా బాలయ్య మరోసారి చరిత్రలోకి ఎక్కారు. Balakrishna NSE Trading Bell.

ఇక సినిమా విషయానికి వస్తే, బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2: తాండవం అనే భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన అఖండ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.