‘అఖండ 2’ కోసం ఇద్దరు విలన్లు..!

Akhanda 2 Villains: నందమూరి బాలకృష్ణ సినిమాటిక్ కెరీర్‌లో అఖండ ఓ మైలురాయిగా నిలిచింది. ఆ సినిమా విజయంతో ఆయన ఇమేజ్‌ మళ్లీ పీక్‌కి చేరింది. ఆ చిత్రం తర్వాత బాలయ్యకు వరుస హిట్లు రావడం మొదలైంది. అదే విధంగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను కెరీర్‌లోనూ అఖండ స్పెషల్ చాప్టర్. కానీ ఆ తర్వాత చేసిన స్కంద మాత్రం భారీ నిరాశను మిగిల్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మళ్లీ మాస్ కం బ్యాక్ ఇవ్వాలనే సంకల్పంతో అఖండ 2 రూపొందిస్తున్నారు. ఈసారి ఎలాంటి తప్పు జరగకుండా, ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటున్నారు.

మొదటి భాగంలో కనిపించిన ప్రధాన పాత్రలు అఖండ 2లో కొనసాగబోతున్నాయి. అదే సమయంలో కొత్త పాత్రలు, మునుపెన్నడూ చూడని విలన్లు కూడా కథలోకి ఎంటర్ అవుతున్నారు. బాలయ్యకు ఈసారి ఇద్దరు పవర్‌ఫుల్ ప్రతినాయకులు ఎదురిగా నిలబడబోతున్నారు. ఈసారి క్లైమాక్స్ సీన్ సినిమాకు స్పెషల్ హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

తొలి భాగంలో అఘోర అవతారంలో బాలయ్య ఒళ్లు గగుర్పొడిచేలా నటించగా… ఇప్పుడు శివుడి రూపంలో ధర్మాన్ని స్థాపించేందుకు ఉగ్ర తాండవం చేసే యాక్షన్ సీన్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. థమన్ సంగీతం ఈ సన్నివేశానికి ప్రాణం పోస్తుందనే టాక్ వినిపిస్తోంది. శివతాండవం లుక్‌లో బాలయ్య త్రిశూలం, ఢమరుకం తీసుకుని విలన్లను ఎదుర్కొనే విధానం ఫ్యాన్స్‌కి ఫుల్ గూస్‌బంప్స్ అందిస్తుందట. ఈ క్లైమాక్స్ సీన్‌కి ప్రత్యేక గ్రాఫిక్స్ టీమ్ పని చేస్తోందట.

ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఒకవైపు శివభక్తుడు, అఘోర రూపంలో ధర్మానికి పోరాటం చేస్తుంటే, మరోవైపు రాజకీయ నాయకుడిగా సామాజిక సేవలో నిమగ్నమవుతాడు. ఈ రెండు పాత్రలు కథలో ఎలా కలిసిపోతాయన్నది సినిమా హైలైట్‌గా మారనుంది. యాక్షన్‌కు తోడు, పొలిటికల్ ఎలిమెంట్స్‌ కూడా ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి.

ఈసారి అఖండ 2ను ప్రాంతీయ చిత్రంగా కాకుండా, నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్లాలని బోయపాటి శ్రీను డిసైడ్ అయ్యారు. అందుకోసం బాలయ్య స్వయంగా హిందీ డబ్బింగ్ చేయనున్నారు. ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను విలన్‌గా ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. Akhanda 2 Villains.

సంజయ్ దత్ ఇందులో ఓ ఉగ్రవాది నాయకుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఆయన్ను ఎదుర్కొంటూ బాలయ్య శివతాండవం చేస్తూ, చివరి ఫైట్ సీన్‌ను రచ్చ చేస్తాడట. ఈ సీన్‌నే సినిమాలో ప్రధాన అట్రాక్షన్‌గా మలచారు. అంతేకాదు, ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో సరైనోడులో పవర్‌ఫుల్ నెగటివ్ రోల్‌లో ఆకట్టుకున్న ఆది.. ఈ సినిమాలో మరింత ప్రభావవంతమైన పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ మొదటి వారం సినిమా విడుదల కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.