
Trump And Epstein Case: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తీవ్ర లైంగిక ఆరోపణల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నట్టు రోజుకో ఫోటో, వీడియో బయటకు వస్తున్నాయి. చిన్న పిల్లలను సైతం వదలని కామాంధుడైన జఫ్రీతో గతంలో స్నేహంగా ఉండటం ఇప్పుడు ట్రంప్ కు తలనొప్పిగా మారింది. అసలు ఎందుకు ట్రంప్ పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి..? అసలు ట్రంప్ కు సంబంధించి ఎలాంటి వీడియోలు బయటపడ్డాయి.? అసలు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎలాంటి నేరాలు చేశాడు..? ట్రంప్ అతడిని ఎందుకు దూరం పెట్టాడు..?
డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య సంబంధం గురించి ఎప్పటి నుంచో అమెరికాలో చర్చ జరుగుతోంది. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త ఆధారాలు వైట్ హౌస్ ను కుదిపేస్తున్నాయి. ఇది రాజకీయ కుట్ర అని ట్రంప్ ఆరోపిస్తున్నా… ఆధారాలు చూస్తున్న వారు మాత్రం ట్రంప్ వ్యవహారంపై అనుమానంగానే చేస్తున్నారు. ట్రంప్ ఏమైనా నీతివంతుడా అనే విమర్శలూ వస్తున్నాయి. అమెరికాలో చిన్న పిల్లలపై లైంగిక దాడుల కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తూ చనిపోయిన జెఫ్రీతో ట్రంప్ కు మంచి సంబంధాలు ఉన్నాయని కొద్ది రోజులుగా రోజుకో వార్త ప్రసారం అవుతోంది. ఇది ట్రంప్ వర్గంలో అలజడి రేపుతోంది. దీనికి తోడు 1993లో ట్రంప్ పెళ్లిలో ఎప్‌స్టీన్ ఉన్న ఫోటోలు, వీడియోలను కొన్ని మీడియా సంస్థలు విడుదల చేశాయి. ఈ ఫోటోల్లో ట్రంప్‌తో ఎప్‌స్టీన్ సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారు. అంతేకాదు ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది కూడా ట్రంప్ పై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 1990లో ట్రంప్‌ను ఎప్‌స్టీన్ కార్యాలయంలో రాత్రి వేళ కలిసినప్పుడు ఆయన ప్రవర్తన తనను ఇబ్బందికి గురిచేసిందని ఓ అమెరికన్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ పై వరుసగా వస్తున్న ఈ ఆరోపణలు అమెరికాలోని రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇవి ట్రంప్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు. Trump And Epstein Case.
1993లో ట్రంప్-మర్లా మేపుల్స్ పెళ్లి కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో ఎప్‌స్టీన్ ట్రంప్‌తో నవ్వుతూ, సంభాషిస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోలు, ఫోటోలను ఇప్పటి వరకు సీక్రెట్ గా దాచారు. అయితే ఇప్పుడు బయటకు రావడానికి కారణం గురించి రాజకీయ విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులు 2024 ఎన్నికల తర్వాత కావాలని బయటపెట్టారని భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలోనూ ఈ ఆధారాలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫోటోలు ట్రంప్-ఎప్‌స్టీన్ మధ్య సన్నిహిత సంబంధాన్ని సూచిస్తున్నాయని, ఇది ఎప్‌స్టీన్ నేరాలతో ట్రంప్‌కు లింక్ ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోందని అంటున్నారు. అయితే, ఈ ఆధారాలు ఎప్‌స్టీన్ నేరాలకు ట్రంప్‌ను నేరుగా లింక్ చేయడానికి సరిపోవని వైట్ హౌస్ పేర్కొంది.
1990లలో ఎప్‌స్టీన్ ఒక ప్రముఖ ఫైనాన్సియర్‌గా, ధనిక సామాజిక వర్గాల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ట్రంప్ తన కార్యక్రమాలకు వ్యాపారవేత్తలు, ప్రముఖులను ఆహ్వానించడం సాధారణం, అందులో భాగంగా ఎప్‌స్టీన్ ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే కేవలం పెళ్లికి హాజరైనంత మాత్రానా ఎప్‌స్టీన్ నేరాలతో ట్రంప్‌కు నేరుగా సంబంధం ఉందని నిరూపించడానికి సాక్ష్యం కాదని ట్రంప్ మద్దతు దారులు వాదిస్తున్నారు. అటు ఎప్‌స్టీన్ కేసులో మొదటి సాక్షి, అమెరికన్ ఆర్టిస్ట్ మారియా ఫార్మర్ ఆరోపణలు కూడా ట్రంప్ ను ఇబ్బంది పెడుతున్నాయి. 1995లో న్యూయార్క్‌లోని ఎప్‌స్టీన్ కార్యాలయంలో ట్రంప్‌ను రాత్రి వేళ కలిసిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె జిమ్ షార్ట్స్‌లో ఉన్నప్పుడు ట్రంప్ తనను అసభ్యంగా చూశాడని, తనను 16 ఏళ్ల అమ్మాయిగా భావించి ఎప్‌స్టీన్‌తో అలా వ్యాఖ్యానించాడని ఆరోపించారు. ఎప్‌స్టీన్ ఆ సమయంలో ట్రంప్‌ను ఈ రాత్రి దీని కోసం రాలేదు అని చెప్పి పంపించాడని ఫార్మర్ తెలిపారు. ఈ ఘటన తనకు అసహనాన్ని కలిగించిందని, ట్రంప్ ప్రవర్తన అనుచితంగా అనిపించిందని ఆమె చెప్పారు. అయితే, ట్రంప్ తనపై నేరుగా లైంగిక వేధింపులకు పాల్పడలేదని, అలాంటి ఆధారాలు తన వద్ద లేవని ఫార్మర్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను ఆమె అప్పట్లో పోలీసులకు తెలియజేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. వైట్ హౌస్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఇవి పాత ఆరోపణల భాగమని, ట్రంప్‌కు ఎప్‌స్టీన్ నేరాలతో సంబంధం లేదని పేర్కొంది.
మరోవైపు జెఫ్రీ ఎప్‌స్టీన్ తన ప్రైవేట్ విమానాలు, యూఎస్ వర్జిన్ దీవుల్లోని ద్వీపం, ఫ్లోరిడాలోని బంగ్లాల్లో మైనర్ బాలికలపై లైంగిక దోపిడీ, ట్రాఫికింగ్ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 11 ఏళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను మోడలింగ్, ఉద్యోగ అవకాశాల పేరిట మాయమాటల చెప్పి, రాత్రి వేళల్లో పార్టీలు నిర్వహించి, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పరిచయం చేసి లైంగిక దాడికి గురిచేశారని ఆధారాలు ఉన్నాయి. ఈ దారుణాలు 2018 వరకు కొనసాగాయని పోలీసులు నిర్ధారించారు. ఈ నేరాలకు సంబంధించి ఎప్‌స్టీన్ సహచరి గిస్లైన్ మాక్స్‌వెల్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పట్లో ట్రంప్ ఎప్‌స్టీన్, ట్రంప్ కలిసి తిరగడంతో వీరు మంచి స్నేహితులని.. ఎప్‌స్టీన్ చేసిన ఘోరాల్లో ట్రంప్ కు కూడా పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా వీడియాలో రిలీజ్ చేస్తున్నారు.
కొత్త ఫోటోలు, వీడియోలు బయటకు రాగానే ట్రంప్ స్పందించారు. ఫేక్ న్యూస్ గా కొట్టిపారేశారు. ట్రంప్ ఎప్‌స్టీన్ నేరాలకు బాధ్యత వహించలేనని, తనకు ఆ నేరాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. పైగా 2024 ఎన్నికల ప్రచారంలో ఎప్‌స్టీన్ ఫైళ్లను విడుదల చేయాలని తానే స్వయంగా భావించానని.., కానీ రాజకీయ కారణాలతో వెనక్కు తగ్గామని ట్రంప్ చెప్పారు. వీడియోలు, ఫోటోలు రాజకీయ కుట్రలో భాగమని.., ట్రంప్‌కు నేరుగా ఎప్‌స్టీన్ నేరాలతో సంబంధం ఉందనడానికి ఈ ఆధారాలు పనికి రావని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలు రాజకీయ కుట్ర లేక మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఎప్‌స్టీన్ నేరాలకు ట్రంప్‌కు నేరుగా సంబంధం లేదని వైట్ హౌస్, ట్రంప్ సమర్థకులు వాదిస్తున్నప్పటికీ, ఈ వివాదం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.