ఎవరీ బాలెన్‌ షా?

Balen Shah: నేపాల్‌ అట్టుడికిపోతోంది…యువత ఆగ్రహజ్వాలలతో రగిలిపోతోంది. సోషల్‌మీడియాపై ప్రభుత్వం ఆంక్షల్ని విధించడాన్ని వ్యతిరేకిస్తూ జనరేషన్‌ జెడ్‌ యువత రోడ్డెక్కింది. గల్లీ నుంచి పార్లమెంటు వరకు ఎక్కడ చూసినా యువత ఆవేషం కట్టలుతెంచుకున్నట్లు కనిపిస్తోంది. రాజధాని ఖట్మండుతో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. దేశ ఆర్థిక మంత్రిని నడివీధుల్లో కొట్టారు.రెండు రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో 20 మందికిపైగా చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు.పరిస్థితి చేయిదాటడంతో ప్రధానిగా కేపీ శర్మ రాజీనామా చేశారు. ఓలీ రాజీనామా అనంతరం ఎయిర్‌పోర్టులను మూసివేశారు. మంత్రులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో నేపాల్ తదుపరి ప్రధాని ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నేపాల్ లో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు బాలెన్ షా పేరు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఇంతకీ ఎవరీ బాలెన్ షా..? నేపాల్‌ నాయకత్వం చేపట్టాలని యువత ఎందుకు కోరుతోంది?

బాలెన్ షా గా ఫేమస్ అయిన ఈ 35 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు అండర్ గ్రౌండ్ హిప్ హాప్ రాపర్ . బాలెన్ షా 1990లో ఖాఠ్మంబూలోని గైర్ గావ్‌లో జన్మించారు. బాలెన్ తండ్రి రామ్ నారాయణ్ షా ఆయుర్వేద వైద్యుడు, తల్లి ధ్రువదేవి. బాలెన్‌ చిన్నప్పటి నుంచి సంగీత ప్రియుడు. బాలెన్ షా కాఠ్‌మాండూలోని వైట్ హౌస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. కాలేజీ రోజుల్లో బాలెన్ స్టూడెంట్ పాలిటిక్స్ లో చురుకుగా ఉండేవారు. అలా బాలెన్ స్ట్రక్చరల్ ఇంజనీర్, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, యాక్టర్ , రైటర్గా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా బాలెన్ తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేసి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈయన పాడిన బలిదాన్‌ అనే పాటకు యూట్యూబ్‌లో ఏడు మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన బాలెన్, 2022లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖాఠ్మాండు మేయర్‌గా ఎన్నికయ్యారు.ఏ పార్టీ మద్దతు లేకుండా ఆ పదవిని నిర్వహించిన మొదటి వ్యక్తి బాలెన్.

నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో యువత ఆందోళన బాట పట్టింది. ఈ నేపథ్యంలో జనరేషన్‌ జెడ్‌కు సపోర్ట్ గా నిలిచారు బాలెన్‌ షా. వారికి మద్దతు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉద్యమం పూర్తిగా జనరేషన్‌ జెడ్‌ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వయస్సు పరిమితి కారణంగా వారి ఆందోళనలో నేను పాల్గొనలేను. కానీ వారి ఆవేశాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నానుఅని ఆపోస్ట్ సారాంశం. ఈ పోస్ట్ జనరేషన్‌ జెడ్‌ ను బాగా ఆకర్షించింది. Balen Shah.
దీంతో యువత కేపీ ఓలీ తర్వాత ప్రధానిగా బాలెన్ షాయేనంటూ సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ మొదలుపెట్టింది. పార్టీల కోసం పని చేసే నాయకులు కాదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి అనే క్యాప్షన్ తో బాలెన్ పేరుత సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ చేస్తున్నారు.‘బాలెన్‌ దాయ్‌.. టేక్‌ ద లీడ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రధాని ఓలి రాజీనామాతో నేపాల్ రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ కొత్త ప్రధాని కోసం అభ్యర్ధుల పేర్లను పరిశీలిస్తున్నారు. జనరేషన్‌ జెడ్‌ సైతం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్‌ వద్దకు బాలెన్‌ షా పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.